logo

బడులకు బకాయిల షాక్‌

పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యుత్తు బకాయి రూ.14.32 లక్షలు ఉంది. ఈ బకాయి చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు పలుమార్లు విద్యాశాఖాధికారులను కోరినా ఫలితం లేదు.

Published : 17 Jun 2024 02:36 IST

గత ప్రభుత్వ నిర్వాకం
రూ.4.52 కోట్లకు చేరిన విద్యుత్తు బిల్లులు
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

ఇది వెల్దుర్తిలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ పాఠశాల. దీని విద్యుత్తు బకాయి రూ.24.64 లక్షలున్నాయి

  • పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలంలోని కంబాలపాడు ఏపీఎస్‌డబ్ల్యూ రెసిడెన్షియల్‌ పాఠశాల విద్యుత్తు బకాయి రూ.14.32 లక్షలు ఉంది. ఈ బకాయి చెల్లించాలని విద్యుత్తు శాఖ అధికారులు పలుమార్లు విద్యాశాఖాధికారులను కోరినా ఫలితం లేదు.
  • డోన్‌ మండలంలోని ఉడుములపాడు ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ పాఠశాల బకాయి రూ.12.71 లక్షలకు చేరింది. మండల కేంద్రం సి.బెళగల్‌లోని ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ రూ.8.63 లక్షలు, కర్నూలు నగరంలోని పీఆర్‌ స్కూల్‌ విద్యుత్తు బిల్లులు రూ.7.31 లక్షలు చెల్లించాల్సి ఉంది.
  • గత వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ పాఠశాలల విద్యుత్తు బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయి. తొమ్మిది నెలలుగా విద్యుత్తు శాఖకు పైసా చెల్లించలేదు. విద్యుత్తు శాఖ అదనపు రుసుం విధిస్తున్నా బకాయిలు మాత్రం వసూలు కావడం లేదు. మరోవైపు బిల్లులు చెల్లించడానికి పాఠశాలలకు పైసా విడుదల కావడం లేదని ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

కర్నూలు జిల్లాలో 974 ప్రాథమిక, 191 ప్రాథమికోన్నత, 269 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 955 ప్రాథమిక, 183 ప్రాథమికోన్నత, 231 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి గత తొమ్మిది నెలలుగా విద్యుత్తు బకాయిలు చెల్లించడం లేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,992 పాఠశాలలకు సంబంధించి రూ.4,52,44,000 విద్యుత్తు బకాయిలు ఉన్నాయి. నాడు- నేడు కింద పాఠశాలల్లో జరుగుతున్న పనులకు విద్యుత్తు వినియోగం ఎక్కువగా ఉండటంతో బిల్లులు అధికంగా వస్తున్నాయి. ఒక్కో ప్రాథమిక పాఠశాలకు నెలకు రూ.900, ప్రాథమికోన్నత పాఠశాలకు రూ.1300, ఉన్నత పాఠశాలలకు   రూ.2,500 వరకు బిల్లులు వస్తున్నాయి. కానీ ఈ బిల్లులు చెల్లించడానికి పాఠశాలల వద్ద నిధులు లేవు. బకాయిలు ఇలాగే పెరిగిపోతే కనెక్షన్లు కట్‌ చేయడం తప్ప తమకు మరో మార్గం లేదని విద్యుత్తు శాఖ అధికారులు చెబుతున్నారు.

మాట మరిచి.. మొండిచెయ్యి చూపారు

గత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాఠశాలలకు నిర్వహణ నిధులు విడుదల చేయలేదు. దీంతో విద్యుత్తు బిల్లులు చెల్లించడం కష్టమైంది. పాఠశాల గ్రాంటు అన్నదే లేకుండా పోవడంతో ప్రధానోపాధ్యాయులు బిల్లులు చెల్లించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెలలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాలుగా ఎన్నికైన పాఠశాలల్లో అదనపు విద్యుత్తు వినియోగం జరగడంతో బిల్లులు మరింతగా పెరిగాయి. గత ప్రభుత్వ హయాంలో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రతి నెలా విద్యుత్తు బిల్లులను సమగ్ర శిక్షా అభియాన్‌ అధికారులకు పంపితే నిధులు విడుదల చేస్తామని ప్రకటించారు. ఆ మేరకు సమగ్ర శిక్షా అధికారులకు బిల్లులు పంపినా నిధులు మాత్రం విడుదల కాలేదని హెచ్‌ఎంలు నిట్టూరుస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని