logo

గోదాముల్లో గోల్‌మాల్‌

పౌరసరఫరాల గోదాముల్లో బియ్యం ‘తూకం’ తప్పుతోంది.. గంపగుత్తగా రేషన్‌ దుకాణాలకు తరలిస్తూ వంద క్వింటాళ్లకు ఒక క్వింటా వరకు కోత పెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతినెలా సగటున 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు.

Published : 17 Jun 2024 02:37 IST

తూకం తప్పుతున్న రేషన్‌ సరకులు
వంద క్వింటాళ్లకు క్వింటా కోత
ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో పక్కదారి
కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే

వేయింగ్‌ యంత్రంపై తూకం వేసిన బియ్యం సంచులనే రేషన్‌ దుకాణానికి పంపించాలి..
అలా కాకుండా స్టేజీ-1 నుంచి వాటిని ఎలాంటి తూకం వేయకుండా నేరుగా రేషన్‌ దుకాణాలకు పంపిస్తున్నారు

పౌరసరఫరాల గోదాముల్లో బియ్యం ‘తూకం’ తప్పుతోంది.. గంపగుత్తగా రేషన్‌ దుకాణాలకు తరలిస్తూ వంద క్వింటాళ్లకు ఒక క్వింటా వరకు కోత పెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రతినెలా సగటున 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని చౌక దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వంద క్వింటాళ్ల బియ్యానికి క్వింటా వరకు తూకం తక్కువగా వస్తోంది. రెండు జిల్లాల పరిధిలో 160-180 క్వింటాళ్ల బియ్యం వరకు ‘మాయ’ం చేస్తున్నారు. ఏటా రూ.3.28 కోట్ల విలువైన బియ్యం పక్కదారి పడుతున్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలో ఓ చౌకదుకాణానికి నెలకు 200 క్వింటాళ్ల బియ్యం కోటా వస్తోంది.. అందులో రెండు క్వింటాళ్ల మేర తరుగు వస్తోంది.. ఆమేరకు లబ్ధిదారుల వాటాలో డీలర్‌ కోత పెడుతున్నారు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,436 మంది చౌకదుకాణాల డీలర్లు ఉన్నారు. ఏ డీలర్‌ను అడిగినా తనకు వచ్చిన కోటాలో బియ్యం తేడా వస్తుందని చెబుతున్నారు. రాష్ట్ర ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెనాలిలో గోదాముల్లో తనిఖీ చేయగా పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘న్యూస్‌టుడే’ బృందం ఉమ్మడి జిల్లాలో పరిశీలన చేయగా గోదాముల్లో రేషన్‌ సరకుల గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు తేలింది.]

  • స్టేజ్‌-1 గుత్తేదారులు పౌర సరఫరాల గోదాముల (ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు)కు బియ్యం సరఫరా చేస్తారు. అక్కడి నుంచి ప్రతి నెలా 18,034.712 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని స్టేజ్‌-2 గుత్తేదార్లు చౌక దుకాణాలకు సరఫరా చేస్తారు.   
  • ఉమ్మడి కర్నూలు జిల్లాలో 17 పౌర సరఫరా గోదాములున్నాయి. వీటి పరిధిలో ప్రతి నెలా వేయింగ్‌ యంత్రాలను ఈ.పోస్‌ యంత్రాలతో అనుసంధానం చేసి, చౌక దుకాణాల డీలర్‌కు ఎంత రేషన్‌ కోటా ఉందో అంతమేర బియ్యం తూకం వేసి సదరు డీలర్‌తో వేలిముద్రలు వేయించుకుంటున్నారు. తూకం వేసిన బియ్యం సంచులను కాకుండా గోదాము నుంచి నేరుగా అందజేస్తున్నారు.
  • పౌరసరఫరాల గోదాముల నుంచి ఒక సంచి 50 కిలోల చొప్పున లెక్కకట్టి డీలర్‌ కోటా ఎంత ఉందో అంత మేరకు స్టేజ్‌-2 వాహనానికి లోడ్‌ చేస్తారు. ఆ తర్వాత పౌరసరఫరాల గోదాములో వేబ్రిడ్జిలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ.పోస్‌ యంత్రాల్లో ఎంత తూకం వచ్చిందో అంతే వేబ్రిడ్జి కాటాలో తూకం వచ్చేలా ఎవరికి అనుమానం రాకుండా గుట్టుగా నడిపిస్తున్నారు
  • ఒక్కో బియ్యం సంచిపై 580 గ్రాముల అదనపు బియ్యం (టేర్‌ వేయిట్‌) ఇవ్వాల్సి ఉంది.  పౌరసరఫరాల గోదాముల ఇన్‌ఛార్జిలు ఇవ్వడం లేదు.  వాటిని పౌరసరఫరాల గోదాముల ఇన్‌ఛార్జిలే స్వాహా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

విన్నపాలు బుట్టదాఖలు

పౌరసరఫరాల గోదాములో వేయింగ్‌ యంత్రంపై 30 నుంచి 50 క్వింటాళ్ల చొప్పున బియ్యం సంచులు ఉంచి తూకం వేసి అదే బియ్యాన్ని తమకు ఇవ్వాలని డీలర్లు కోరుతున్నారు. ఒక డీలరుకు 150 క్వింటాళ్ల బియ్యం కోటా ఉంటే ఒక్కోసారి 50 క్వింటాళ్ల చొప్పున మూడుసార్లు బియ్యం తూకం వేసి ఇవ్వాలని విన్నవిస్తున్నారు. ఇలాగైతే చౌకదుకాణాలకు బియ్యం సరఫరా చేసేందుకు వారం రోజులు కాదు కదా.. నెల రోజులైనా సరిపోదని అధికారులు.. అలా తూకం వేసి ఇవ్వలేమని హమాలీలు మొండికేస్తున్నారు. మొత్తంమీద తామే నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదాముల్లో వేయింగ్‌ యంత్రంపై బియ్యం సంచులు ఉంచి.. ఈ.పోస్‌లో డీలరుతో వేలిముద్ర వేయించుకున్న తర్వాత గోదాములో బియ్యం సంచులను లారీలోకి లోడింగ్‌ చేస్తున్నారని.. వేబ్రిడ్జి తూకాల్లోనూ తేడాలున్నాయని.. గోదాము నుంచి సరకు సరైన తూకంతో బయటకు పంపితే తరుగు ఎందుకు వస్తుందని డీలర్లు ప్రశ్నిస్తున్నారు.


వీరికి తూకం వేయకుండానే

అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రతి నెలా 318 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సరఫరా చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకానికి, వసతి గృహాలకూ పౌరసరఫరాల సంస్థ ద్వారానే ఉమ్మడి జిల్లాలో 2 వేల మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి తూకం వేయకుండానే పంపిస్తున్నారు.  ఒక బియ్యం సంచి (50 కిలోలు) చొప్పున ఎంత కోటా ఉంటే అన్ని క్వింటాళ్ల్లు తూకం లేకుండానే సరఫరా చేస్తున్నారు. కొన్ని సంచులను డీలర్లు తెచ్చి మధ్యాహ్న భోజన పథకం, అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేస్తుండగా.. మరికొంత నేరుగా గోదాముల నుంచే వెళ్తోంది. దీంతో పదుల సంఖ్యలో బియ్యం సంచులు మిగిలించుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. చేసేదేమీలేక తక్కువ తూకంతో వచ్చిన బియ్యం భారాన్ని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, కళాశాలల, వసతిగృహాల ప్రిన్సిపాళ్లు భరిస్తున్నారు.


ఏటా రూ.25 కోట్లు పక్కదారి

చౌక దుకాణంలో డీలర్‌ బియ్యం సంచులను తూకం వేసుకోగా, ఒక్కో సంచిపై 2 కిలోల తరుగు వస్తోంది. క్వింటాకు 3-4 కిలోల చొప్పున బియ్యం తక్కువగా వస్తోంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి నెలా కార్డుదారులకు 18 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నారు. 450 టన్నుల నుంచి 540 టన్నుల వరకు బియ్యంలో కోత పడుతోంది. ప్రభుత్వం కొనుగోలు చేసిన బియ్యం కార్డుదారులకు చేరేలోగా కొనుగోలు, రవాణా తదితర ఖర్చులతో కలిపి కిలోకు రూ.41 మేర వెచ్చిస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.1.84 కోట్ల నుంచి రూ.2.21 కోట్ల మేర బియ్యం దోపిడీ జరుగుతోంది. ఏడాదికి రూ.22-రూ.26.52 కోట్ల మేర పక్కదారి పడుతోంది.తరుగు రూపంలో మిగిలిపోయిన బియ్యాన్ని పౌరసరఫరాల గోదాముల నుంచి అక్రమ మార్గాల్లో తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 

పశ్చిమప్రాంతంలోని నిల్వ కేంద్రం (ఎంఎల్‌ఎస్‌)లో ఓ డీలర్‌ దుకాణానికి సంబంధించిన బియ్యం సంచులను యంత్రాల (వేయింగ్‌ మిషన్‌)పై తూకం వేసి ఇచ్చారు. సంబంధిత డీలరు దుకాణంలో వాటిని తూకం వేయగా తక్కువగా వచ్చాయి. 50 కిలోల సంచిలో 47.240 కిలోలే ఉన్నాయి. మరో డీలరుకు ఇచ్చిన సంచుల్లో 42.790 కిలోలు వచ్చాయి. ప్రతి డీలరుకు 150 నుంచి 200 కిలోల వరకు బియ్యం తక్కువగా వస్తున్నాయని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని