logo

న్యూరోలో.. నీరోలు

తాపీ మేస్త్రీ పని చేసే అజయ్‌ ఈ నెల 1న ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు... మొదట ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా 20 కుట్లు వేశారు.. ఒక్కరోజే రూ.50 వేల వరకు ఖర్చవడంతో రోగి సహాయకులు కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేర్పించారు.

Updated : 17 Jun 2024 06:37 IST

శస్త్రచికిత్సలు చేయడంలో అలసత్వం
సర్వజన ఆసుపత్రిలో రోగుల తిప్పలు
కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే

 

తాపీ మేస్త్రీ పని చేసే అజయ్‌ ఈ నెల 1న ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు... మొదట ప్రైవేటు ఆసుపత్రిలో చేరగా 20 కుట్లు వేశారు.. ఒక్కరోజే రూ.50 వేల వరకు ఖర్చవడంతో రోగి సహాయకులు కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ వార్డులో చేర్పించారు. రెండ్రోజులైనా వైద్యులు పట్టించుకోలేదు. ఆరోగ్యం ఇబ్బందికరంగా మారడంతో తిరిగి ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.. మరో రూ.60 వేల వరకు ఖర్చైంది.
కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో సేవలు పడకేశాయి. శస్త్రచికిత్సలు చేయడంలో వైద్యులు అలక్ష్యంతో చేస్తుండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు..విధిలేని పరిస్థితిలో ప్రైవేటుకు వెళ్తున్నారు.

శస్త్రచికిత్స చేయాలంటే ప్రధానంగా ఎక్స్‌రే, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, టూడీ ఎకో తదితరాలకు సంబంధించిన నివేదికలు కీలకం. ఈ పరీక్షలకు సంబంధించి రిపోర్టు రావాలంటే కనీసం వారం రోజులు పడుతుంది. మరోవైపు కొందరు రోగులు  రక్తపోటు, మధుమేహంతో బాధపడుతుండటం.. ఇంకొందరికి రక్తం తక్కువగా ఉందంటూ చెప్పి ఆపరేషన్లు చేయడం లేదు. ఫలితంగా ఒక్కో రోగి కనీసం ఆసుపత్రిలో 15 రోజుల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. శస్త్రచికిత్సలు చేసేందుకు నలుగురు రోగులను ఓటీకి తీసుకెళ్లినా.. వారిలో ఒకరిద్దరికే చేస్తున్నారు. మరో ఇద్దరిని వెనక్కి పంపేస్తున్నారు. రోజుల తరబడి నిరీక్షించలేక కొందరు రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. మరోవైపు కొన్ని ఆరోగ్యశ్రీ కేసులను బయటకు పంపుతున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో ఈ విభాగానికి సింహభాగం ఆరోగ్యశ్రీ ద్వారా పెద్దఎత్తున నిధులు సమకూరేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి కానరావడం లేదు.

తగ్గిన శస్త్రచికిత్సలు

నిత్యం రద్దీగా ఉండే న్యూరో సర్జరీ విభాగంలో కేవలం 20 పడకలే ఉన్నాయి. సుమారు 50 మంది నిత్యం చికిత్స పొందుతుంటారు. గతంలో ప్రతినెలా 70 నుంచి 90 వరకు శస్త్రచికిత్సలు చేసేవారు.  విశాఖపట్టణం నుంచి ఇద్దరు అసోసియేట్లు బదిలీపై న్యూరో సర్జరీ విభాగానికి వచ్చి రెండేళ్లైంది. వీరిలో ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారో.. ఎవరు సెలవులో ఉన్నారో తెలియని పరిస్థితి. ఆరుగురు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆరుగురు అసిస్టెంట్లు, ఇద్దరు అసోసియేట్లు ఉన్నప్పటికీ నెలకు కనీసం 50-60 శస్త్రచికిత్సలు చేయడం లేదు.

నెలకు రెండు వేల ఓపీ

  • కర్నూలు సర్వజన వైద్యశాలలోని న్యూరో సర్జరీ సూపర్‌ స్పెషాలిటీ విభాగంలో ప్రతి బుధ, శనివారాల్లో ఓపీ ఉంటుంది. నెలకు సుమారు రెండు వేల వరకు ఓపీ, 400 వరకు ఐపీ ఉంటుంది. ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, అనంతపురం, తెలంగాణ రాష్ట్రం గద్వాల ప్రాంతానికి చెందిన బాధితులు వస్తుంటారు. వెన్నెముక సమస్య, తలలో కణితులు, తలకు గాయాలైన వారికి ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కింద చేరుతుంటారు. ఆరోగ్యశ్రీ కింద వారానికి కనీసం 20 శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంటుంది.
  • న్యూరో సర్జరీ విభాగంలో చేరిన బాధితుల ఆరోగ్య పరిస్థితులను బట్టి మొదట సీటీ లేదా ఎంఆర్‌ఐ, ఎక్స్‌రే, రక్త పరీక్షలు, టూడీ ఎకో వంటి పరీక్షలు చేస్తారు. శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తే ఆరోగ్యశ్రీ కింద ట్రస్టుకు నివేదికలు పంపుతారు. అక్కడినుంచి అనుమతి వచ్చిన వెంటనే శస్త్రచికిత్స చేస్తారు. వారం రోజుల తర్వాత డిశ్ఛార్జి చేయాల్సి ఉంటుంది. రోగికి బయట ఏవైనా పరీక్షలు రాసిచ్చి ఉంటే అందుకైన ఖర్చు, మందులు, ఛార్జీలకు డబ్బులను డిశ్ఛార్జి సమయంలో ఇవ్వాల్సి ఉంటుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని