logo

కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని ఆదేశాలు

బేతంచర్ల మండలం సిమెంట్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని కర్నూలు డీఈవో మరోసారి ఆదేశాలు జారీ చేశారు.

Published : 18 Jun 2024 01:38 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: బేతంచర్ల మండలం సిమెంట్‌ నగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు కౌన్సెలింగ్‌కు హాజరవ్వాలని కర్నూలు డీఈవో మరోసారి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 10న కౌన్సిలింగ్‌కు హాజరవ్వాలని తొలుత ఉత్తర్వులు జారీ చేయగా డోన్‌ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఈ విషయంపై వివరణ కోరడంతో అప్పట్లో కౌన్సిలింగ్‌ను వాయిదా వేశారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతో పాటు, పాణ్యం సిమెంట్‌ ఎయిడెడ్‌ హైస్కూల్‌ను 2021లో ప్రభుత్వానికి అప్పగిస్తూ సిమెంట్‌నగర్‌ పాణ్యం సిమెంట్స్‌ యాజమాన్యం తమ అంగీకార పత్రాన్ని అందజేసింది. ఇవే పాఠశాలలను తిరిగి యాజమాన్యానికి అప్పగించాలని, కేవలం ఉపాధ్యాయులను మాత్రమే ప్రభుత్వానికి అప్పగించాలని ఈ ఏడాది మార్చిలో ప్రత్యేక జీవోలు జారీ అయ్యాయి. ఈ జీవోలు వివాదాస్పదంగా మారాయి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క పాణ్యం సిమెంట్స్‌ పాఠశాలల కోసమే ప్రత్యేక జీవోలు తయారు కావడం గమనార్హం. ఈ ప్రత్యేక జీవోలను ఆధారంగా చేసుకుని కర్నూలు డీఈవో ఉపాధ్యాయులను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయడానికి కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం కౌన్సిలింగ్‌కు కచ్చితంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని