logo

బీటెక్‌ విద్యార్థి బలవన్మరణం

బీటెక్‌ చదువుతున్నాడు.. మరో రెండేళ్లలో చదువు పూర్తిచేసి, జీవితంలో స్థిరపడతాడనుకున్న తల్లిదండ్రులు ఆశలు ఆవిరయ్యాయి. కుమారుడిని  చదివించేందుకు వారు పడిన శ్రమ పట్టాలపై విగతజీవిలా మారింది.

Published : 18 Jun 2024 01:55 IST

ఈశ్వర్‌ (పాత చిత్రం)

ఆదోని నేరవార్తలు, న్యూస్‌టుడే: బీటెక్‌ చదువుతున్నాడు.. మరో రెండేళ్లలో చదువు పూర్తిచేసి, జీవితంలో స్థిరపడతాడనుకున్న తల్లిదండ్రులు ఆశలు ఆవిరయ్యాయి. కుమారుడిని  చదివించేందుకు వారు పడిన శ్రమ పట్టాలపై విగతజీవిలా మారింది. బీటెక్‌ విద్యార్థి రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన సోమవారం ఆదోని పట్టణంలో వెలుగు చూసింది. రైల్వే పోలీసులు, విద్యార్థి తండ్రి తెలిపిన వివరాల మేరకు.. ఆదోని మండలం పెసలబండ గ్రామానికి చెందిన గొల్ల వెంకటేశ్వర్లు, నలినీ దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటేశ్వర్లు ఆదోని మండలం పెద్దతుంబళం గ్రామంలోని పీహెచ్‌సీ హెల్త్‌ సూపర్‌వైజరుగా పని చేస్తున్నారు. ఆదోని పట్టణంలోని శ్రీమంజునాథ్‌ ఎస్టేట్‌లో నివాసం ఉంటున్నారు. వీరి కుమారుడు సలేంద్ర ఈశ్వర్‌ (20) తిరుపతిలోని మోహన్‌బాబు ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ రెండో సంవత్సరం ఇటీవల పూర్తిచేశాడు. సెలవులు కావడంతో గత నెల 15వ తేదీన కళాశాలలకు సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చాడు. కాగా.. ఈ నెల 16వ తేదీ రాత్రి 7.30 గంటల సమయంలో ఈశ్వర్‌ బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడన్నారు. రాత్రి ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో ఈశ్వర్‌ ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయిందన్నారు. కాగా.. తెల్లవారు జామున ఆదోని రైల్వే స్టేషన్‌ పరిధిలోని నగరూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం రావడంతో సంఘటన స్థలానికి వెళ్లి చూశామన్నారు. మృతదేహం గుర్తుపట్టేందుకు వీలులేకుండా పోయిందన్నారు. కాగా.. మృతుడి చేతిపై వేయించుకున్న టాటూ ఆధారంగా గుర్తించామన్నారు. మృతదేహాన్ని పోలీసులు శవపరీక్ష నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చేతికొచ్చిన కుమారుడు మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఈశ్వర్‌ ఆత్మహత్యకు గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు.


అతిసార లక్షణాలతో వృద్ధురాలి మృతి

చంద్రిబాయి  (పాతచిత్రం)

హొళగుంద, న్యూస్‌టుడే : వాంతులు విరేచనాలతో ఓ వృద్ధురాలు మృతిచెందిన ఘటన హొళగుంద మండలంలోని నెరణికి తండాలో సోమవారం చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చంద్రిబాయి(60)కి గత మూడు రోజులు నుంచి వాంతులు, విరేచనాలు కావడంతో ఆలూరు ప్రభుత్వ ఆసుప్రతిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చామన్నారు. మరల వాంతులు విరేచనాలు ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గ మధ్యలో మృతిచెందినట్లు తెలిపారు. కుళాయిలకు సరఫరా అయ్యే కలుషిత నీటిని తాగడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై హొళగుంద ప్రాథమిక వైద్యాధికారి న్యూటన్‌ను వివరణ కోరగా గ్రామంలో గత మూడ్రోజుల నుంచి ఇలాంటి కేసులు వస్తున్నాయన్నారు. దీంతో ఆరోగ్య సిబ్బంది చేత ఇంటింటికి ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందించి, పలు జాగ్రత్తలు చెప్పామన్నారు. అలాగే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నీటి తొట్టెలను శుభ్రంగా చేయాలని పంచాయతీ కార్యదర్శిని కోరినట్లు తెలిపారు. గ్రామ ట్యాంకుల్లోని నీటిని సేకరించి టెస్టింగ్‌కు పంపించాలని అధికారులకు చెప్పినట్లు వైద్యాధికారి వివరించారు.


విద్యుదాఘాతంతో మహిళా కూలీ దుర్మరణం

రమావత్‌ మంజులబాయి (పాత చిత్రం)

రైల్వేకోడూరు గ్రామీణ, న్యూస్‌టుడే: బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న లారీకి విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు తగలడంతో ఓ మహిళా కూలీ మృత్యువాత పడిన  సంఘటన మండల పరిధిలోని అనంతరాజుపేట వద్ద సోమవారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం సూర్యతండాకు చెందిన శంకర్‌నాయక్, రమావత్‌ మంజులబాయి (34) దంపతులు కూలి పనుల నిమిత్తం వలస వచ్చి కోడూరులోని కొత్తకృష్ణానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో అనంతరాజుపేటలోని ఓ పొలంలో బొప్పాయి కాయల కోత పనులకు 20 మంది కూలీలతో కలిసి మంజులబాయి ఓ లారీలో వెళ్లారు. ఓ పొలం వద్ద సగం లోడు చేసి మరో పొలానికి వెళ్తుండగా స్టీలు ఫ్యాక్టరీ సమీపంలోకి వెళ్లగానే తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్తు హైటెన్షన్‌ తీగలు లారీ పైభాగాన్ని తగిలాయి. వెంటనే మంటలు వ్యాపించడంతో డ్రైవర్, క్లీనర్‌తో పాటు కూలీలు కిందకు దూకేశారు. అప్పటికే క్యాబిన్‌లో ఉన్న మంజులాబాయి ఇనుప కడ్డీని పట్టుకుని కిందకు దిగే క్రమంలో షాక్‌కు గురై మృతి చెందారు. మరో నలుగుకు కూలీలు సిద్ధేశ్వరమ్మ, నరసింహులు, జయమ్మ, వెంకటసుబ్బమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్ల్లు సీఐ బాబు తెలిపారు.

లారీలో చెలరేగిన మంటలు


విద్యార్థికి తీవ్ర గాయాలు.. 

సౌళహళ్లి (మంత్రాలయం), న్యూస్‌టుడే: విద్యుదాఘాతంతో విద్యార్థి చేతికి తీవ్ర గాయమైన ఘటన సోమవారం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండల పరిధిలోని సౌళహళ్లికి చెందిన బోయ శ్రీనివాసులు కుమారుడు వరుణ్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. గ్రామ శివారులో ఉన్న గుండ్రప్ప తాత గుడి దగ్గర పొలాల్లో స్తంభానికి వేలాడుతున్న విద్యుత్తు తీగ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ప్రమాదంలో బాలుడి కుడి చేతికి బలమైన గాయం కావడంతో చికిత్స నిమిత్తం ఆదోని ఆసుపత్రికి తరలించారు. దీంతో బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పొలాల్లోని స్తంభాలకు తీగలు వేలాడుతున్నాయని ఎన్నిసార్లు లైన్‌మెన్‌కు తెలిపినా పట్టించుకోలేదని తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని