logo

చక్కని వసతి.. సరైన తిండి

విద్యార్థులకు సంక్షేమ వసతిగృహాలు బాసటగా నిలుస్తున్నాయి. బీసీ, ఎస్సీ వసతిగృహాలు ఈ నెల 13 నుంచే పునఃప్రారంభమయ్యాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిని కల్పిస్తున్నారు.

Published : 18 Jun 2024 01:56 IST

వసతిగృహాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
విస్తృత ప్రచారం చేస్తున్న అధికారులు

డోన్‌లోని ఎస్సీ బాలికల వసతిగృహంలో భోజనం తింటున్న విద్యార్థినీలు

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: విద్యార్థులకు సంక్షేమ వసతిగృహాలు బాసటగా నిలుస్తున్నాయి. బీసీ, ఎస్సీ వసతిగృహాలు ఈ నెల 13 నుంచే పునఃప్రారంభమయ్యాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా వసతిని కల్పిస్తున్నారు. ఒక్కో వసతిగృహంలో వంద మంది విద్యార్థులు ఉండేలా సదుపాయాలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, ఓసీ, మైనార్టీలను చేర్చుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 2,036 సీట్లు

ఉమ్మడి జిల్లాలో బీసీ, ఎస్సీలకు చెందిన ప్రీ-మెట్రిక్‌ వసతి గృహాలు 105 ఉన్నాయి. బీసీ వసతిగృహాల్లో 9,530 సీట్లకు 1,501 వరకు ఖాళీలుండగా, ఎస్సీ వసతిగృహాలకు సంబంధించి 7,100కి గాను 535 వరకు ఖాళీలున్నాయని అధికారులు చెబుతున్నారు.

భర్తీ ప్రక్రియ ఇలా...!

బీసీ వసతిగృహాలకు సంబంధించి: బీసీలకు 70 శాతం, హరిజన క్రిస్టియన్స్‌ (హెచ్‌సి) 11 శాతం, ఎస్సీలకు 9శాతం, ఓసీకి 4 శాతం, ఎస్టీలకు ఆరు శాతం చొప్పున వసతిగృహాల్లో ఖాళీ సీట్లను భర్తీ చేస్తారు.

ఎస్సీ వసతి గృహాలకు సంబంధించి: ఎస్సీలకు 70 శాతం, హరిజన క్రిస్టియన్స్‌కు 11 శాతం, బీసీలకు 9 శాతం, ఓసీలకు 4 శాతం, ఎస్టీలకు 6 శాతం ప్రకారం ఖాళీలను భర్తీ చేస్తారు.

భోజనం ఎలా ఉందంటే..?

ఆది, మంగళ, శుక్రవారం నాడు వారానికి మూడుసార్లు కోడికూరతో భోజనం, ప్రతి రోజూ పాలు, అల్పాహారం, భోజనంతో పాటు ఆకుకూరపప్పు, కూరగాయలతో చేసిన కూర, కోడికూర లేని రోజుల్లో ఉడికించిన గుడ్లు, రాత్రి సమయంలో భోజనం తర్వాత రోజూ అరటిపండు ఇస్తారు. ఉదయం చిక్కీలు, సాయంత్రం స్నాక్స్‌ (శనగ, అల్చందల గుగ్గుళ్లు), ఉచితంగా బెడ్‌సీట్లు, దుప్పట్లు ఇస్తారు. కాస్మోటిక్‌ ఛార్జీలు ప్రభుత్వం చెల్లిస్తుంది.

ఎవరు అర్హులంటే...?

వసతిగృహాలకు అయిదు కి.మీ.లు ఆపై దూరంలో నివసించే విద్యార్థులు అర్హులు. రూ.60 వేల నుంచి రూ.80 వేల వార్షిక ఆదాయం తల్లిదండ్రులకు ఉండాలి. దరఖాస్తుతో పాటు విద్యార్థి ఆధార్, తల్లిదండ్రుల ఆధార్, రేషన్‌ కార్డు, కులం, బ్యాంకు ఖాతా నకలు ప్రతులు, టీసీ, మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలు జత చేయాలి. అదనపు వివరాలు కావాలంటే ఆయా వసతిగృహాల్లోని సంరక్షణాధికారులను సంప్రదించాలి.


విద్యార్థులను తీర్చిదిద్దేందుకు కృషి

-ఎన్‌.మధు సంరక్షకుడు, ఎస్సీ బాలుర వసతిగృహం, డోన్‌

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వసతిగృహాల్లో ఖాళీల భర్తీకి విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. ప్రభుత్వం సూచించిన మెనూ ప్రకారం పౌష్టికాహారంతో పాటు బోధకుల ద్వారా విద్యార్థుల్ని ఉత్తములుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం.


చర్యలు తీసుకుంటున్నాం

-ఎం.చింతామణి జిల్లా సంక్షేమ అండ్‌ సాధికారత అధికారిణి, నంద్యాల

ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులను చేర్చుకుంటాం. విద్యార్థులకు సంబంధించి రెన్యువల్స్‌కు ఈనెల చివరివరకు అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రవేశాలకు సంబంధించి జులై చివరి వరకు దరఖాస్తుకు వీలుంది. ఆయా వసతిగృహాల్లో ఖాళీల సంఖ్యను బట్టి భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు