logo

అంతా.. జగన్నాటకం

రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తీసుకొచ్చే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ అస్తవ్యస్తంగా మారింది. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామటూ నాటకమాడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ శాఖను నిర్వీర్యం చేశారు.

Updated : 18 Jun 2024 04:38 IST

మద్యనిషేధమంటూ డ్రామాలు
అమ్మకాలు భారీగా పెంచిన వైనం
వైకాపా హయాంలో ఆబ్కారీ వ్యవస్థ అస్తవ్యస్తం

కర్నూలు నేరవిభాగం, న్యూస్‌టుడే : రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దఎత్తున ఆదాయం తీసుకొచ్చే మద్య నిషేధ, ఆబ్కారీ శాఖ అస్తవ్యస్తంగా మారింది. తాము అధికారంలోకి వస్తే మద్యపాన నిషేధం అమలుచేస్తామటూ నాటకమాడిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ శాఖను నిర్వీర్యం చేశారు. ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టటంతోపాటు ఇటు మందుబాబులను నిలువు దోపిడీ చేశారు. నాసిరకం మద్యంతో పలువురి ప్రాణాలు తీశారు. కనీసం బాధిత కుటుంబాలకు సాయం చేయడంలోనూ నిర్లక్ష్యం వహించారు.

మద్యం దుకాణాల అనుమతులు, కేటా యింపు, పర్యవేక్షణ, ఆబ్కారీ నేరాల నియంత్రణ విధులను గతంలో మద్యనిషేధ, ఆబ్కారీ శాఖ పర్యవేక్షించేది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యనిషేధ, ఆబ్కారీ శాఖను విభజించి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో (సెబ్‌) పేరుతో కొత్త శాఖను ఏర్పాటు చేసింది. ఆబ్కారీ స్టేషన్లు కాస్త సెబ్‌ స్టేషన్లుగా మారాయి. ఆ శాఖలో ఉన్న 148 మంది అధికారులు, సిబ్బందిలో.. 105 మందిని సెబ్‌కు, 43 మందిని ఆబ్కారీ శాఖకు కేటాయించారు. నేరాలు నియంత్రించే బాధ్యతలను సెబ్‌కు.. మద్యం దుకాణాలు, బార్ల నిర్వహణ బాధ్యతలను ఆబ్కారీ శాఖకు అప్పగించారు. ఒకవైపు నియామకాలు చేపట్టలేదు. సిబ్బంది అంతంతమాత్రంగానే ఉన్నారు.. దీనికితోడు రెండుగా విభజించడంతో సిబ్బంది సంఖ్య తగ్గిపోయి ఒక్కో సెబ్‌ స్టేషన్‌కు కనీసం 10 మంది కూడా లేని పరిస్థితి నెలకొంది. పైగా సంబంధం లేని అక్రమ ఇసుక రవాణా బాధ్యతలను సైతం సెబ్‌ స్టేషన్లకు అప్పగించి భారం మోపారు. గత వైకాపా ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా మార్చి అందులో ఉద్యోగులను నియమించింది. దీంతో అరకొరగా ఉన్న ఆబ్కారీ శాఖ ఉద్యోగులు మద్యం అమ్మకాలు, ఉద్యోగుల అక్రమాలను పర్యవేక్షించలేక నలిగిపోయారు. ఓసారి కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో ఆ శాఖ అధికారులు తమ దుస్థితిని వెల్లడించారు. పైగా వైకాపా నేతల సంస్థలకు సంబంధించి బ్రాండ్ల అమ్మకాలు పెంచాలన్న ఒత్తిడి భరించలేకపోయారు. ఉద్యోగుల సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా వదిలేయటంతో కిందస్థాయి ఉద్యోగులు నరకయాతన అనుభవించారు.

దుకాణాలు తగ్గించి.. ధరలు పెంచి

గతంలో ఉమ్మడి జిల్లాలో 205 మద్యం దుకాణాలు, 46 బార్లు ఉండేవి. అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మద్య నిషేధమంటూ ప్రకటించి డ్రామాలాడారు. 205 మద్యం దుకాణాలుండగా వాటిని 175కు తగ్గించి.. బార్ల సంఖ్యను 49కు పెంచేశారు. మద్యం ధరలను వైకాపా ప్రభుత్వం అమాంతం పెంచేసింది. రూ.50 ఉన్న చీప్‌ లిక్కర్‌ సీసాను రూ.150 చేసింది. అప్పటివరకు ఉన్న ప్రైవేటు మద్యం దుకాణాలను ప్రభుత్వ దుకాణాలుగా మార్చేసింది. రోజుకు రూ.1.50 కోట్ల వరకు ఉండే మద్యం అమ్మకాలను రూ.4.5 కోట్ల పెంచేసింది. దుకాణాల్లో ముఖ్యమైన బ్రాండ్లు లేకుండా కొత్తకొత్త నాసిరకం బ్రాండ్లను తెరపైకి తెచ్చింది. దీంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా పెరిగి అదుపు చేయలేని స్థాయికి చేరింది.

ఈ ఏడాది కర్నూలు జిల్లాలో సెబ్‌ అధికారులు జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు దాడులు జరిపి 16,047 లీటర్ల మద్యం, 6,783 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.

ప్రక్షాళనకు ఎదురుచూపు

తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో మద్యనిషేధ, ఆబ్కారీ, సెబ్‌ శాఖలు ప్రక్షాళన కోసం ఎదురుచూస్తున్నాయి. రెండు శాఖలను ఒకటి చేసి శాఖను పునరుద్ధరించాలని సిబ్బంది విన్నవిస్తున్నారు. ప్రభుత్వ దుకాణాలు తొలగించి ప్రైవేటు వ్యక్తులకు అనునమతులివ్వడం మేలని పలువురు పేర్కొంటున్నారు. నాసిరకం జే బ్రాండ్లను తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వందల మంది బలి

మద్యం కారణంగా ఉమ్మడి జిల్లాలో కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోగా ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ప్రధానంగా నాసిరకం మద్యం తాగటంతో శరీరంలోని అవయవాలు దెబ్బతిని అనారోగ్యానికి గురై పలువురు చనిపోయారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యం తాగలేక చాలామంది తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ప్రాణాలు కోల్పోలయిన ఘటనలు సైతం జరిగాయి. కొందరు నిరుపేదలు మద్యం కొనుగోలు చేయలేక నాటు సారాకు బానిసై అనారోగ్యంతో ప్రాణాలు వదిలారు. చనిపోయిన వారికి సంబంధించి బాధితుల కుటుంబాలకు జగనన్న బీమా ఇచ్చే విషయంలోనూ అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని