logo

ఉద్యోగుల్లో బదిలీ గుబులు

ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి సారించారు.. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే జట్టు రూపకల్పనలో సిద్ధమయ్యారు.

Updated : 18 Jun 2024 05:13 IST

ప్రజాప్రతినిధుల సిఫార్సుకు పరుగులు

ఎన్నికలు ముగిశాయి.. కొత్త ప్రభుత్వం కొలువు దీరింది.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి చంద్రబాబు నాయుడు పాలనపై దృష్టి సారించారు.. ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లే జట్టు రూపకల్పనలో సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో భారీగా బదిలీలు ఉంటాయన్న చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వ హయాంలో కొందరు ఉద్యోగులు వైకాపా నేతలతో అంటకాగారు.. వారి చెప్పిందే వేదంలా వ్యవహరించారు.. ఐదేళ్లుగా జిల్లాలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారుల జాబితా ప్రభుత్వ పెద్దల చెంతకు చేరింది. వారికి ముందుగా స్థానచలనం కల్పించనున్నారు. ఆ మేరకు కొన్ని రోజులుగా రాష్ట్రస్థాయిలో తీవ్ర కసరత్తు చేస్తున్నారు. తొలుత ఉన్నతాధికారులను కదిలించి తర్వాత ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు బదిలీ చేసే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి మొదలు మండలస్థాయి అధికారుల వరకు వెంటవెంటనే బదిలీలు పూర్తి చేసి పాలనను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు కొందరు అధికారులు చెబుతున్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో రెవెన్యూ శాఖలో పెద్ద ఎత్తున బదిలీలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్, జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోలకు తప్పనిసరిగా స్థానచలనం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ఎన్నికలకు రెండు నెలల ముందు ఇతర జిల్లాలకు వెళ్లిన తహసీల్దార్లు, ఎంపీడీవోలు నెలాఖరుకు సొంత జిల్లాలకు రానున్నారు. రెండేళ్లుగా జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్న డిప్యూటీ తహసీల్దార్లు, సీనియర్, జూనియర్‌ అసిస్టెంట్లకు బదిలీ తప్పనిసరి కానుంది. దీంతో వారంతా కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి మచ్చిక చేసుకుంటున్నారు. నంద్యాల కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు ఎన్నికల క్రతువులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాకు వచ్చారు. ఆయన వచ్చినప్పటి నుంచి కేవలం ఎన్నికల విధుల్లో మాత్రమే ఉండటంతో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. సెప్టెంబరు ఆఖరున డీఆర్వో ఉద్యోగ విరమణ చేయనుండటంతో స్థానచలనం లేకపోవచ్చునని తెలుస్తోంది.

వైకాపా నేతల ఆశీస్సులతో

కొత్తగా జిల్లా ఏర్పాటైన నాటి నుంచి అప్పటి వైకాపా నాయకుల ఆశీస్సులతో తిష్ట వేసిన పలువురు అధికారులను ఇతర జిల్లాలకు బదిలీ చేయడం కానీ,  ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించడం గానీ జరగొచ్చు. డ్వామా, డీఆర్‌డీఏ పీడీలకు, డీఈవో సుధాకర్‌రెడ్డిలకు బదిలీలు తప్పనిసరనే ప్రచారం జరుగుతోంది. అప్పట్లో రాష్ట్ర మంత్రి ఆశీస్సులతో జిల్లాకు వచ్చిన డీఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. సమగ్రశిక్ష ఏపీసీ కూడా బదిలీ కావచ్చునంటున్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈకి స్థానచలనం తప్పనిసరి. ఈయన బడా నాయకుడి ఆదేశాలకు అనుగుణంగా పనిచేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నీటిపారుదల శాఖలో కూడా పెద్ద ఎత్తున బదిలీలు చేయనున్నారు. కేసీ కెనాల్‌ ఈఈ గతంలో ఒక ఎమ్మెల్యేకు పీఏగా పనిచేసి డిప్యుటేషన్‌పై ఈఈగా వచ్చారు. తిరిగి ఆయన్ని మాతృశాఖకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగుగంగ, కేసీ కెనాల్‌లోని పలువురు డీఈలు, ఏఈలకు స్థానచలనం తప్పనిసరిని తెలుస్తోంది. రెండు నెలల కిందట బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్‌ కమిషనర్‌కూ బదిలీ జరుగుతుందంటున్నారు. పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో డీఈలు, ఏఈలపై బదిలీ వేటు తప్పదనే సమాచారంతో ఇప్పటికే వారు తమకు అనుకూలమైన ప్రజాప్రతినిధుల వద్దకు వెళ్లి సహకరించాలని కోరినట్లు సమాచారం.

ఎస్పీపై వేటు తప్పదా

నంద్యాల ఎస్పీ రఘువీర్‌రెడ్డికి స్థానచలనం కానుంది. ఈయనపై ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వానికి అంటకాగారు. రెండున్నరేళ్లుగా వైకాపా ప్రజాప్రతినిధులకు పూర్తిస్థాయిలో సహకరించడంతో పాటు ఇటీవల సాధారణ ఎన్నికల్లో అధికార పార్టీకి వంతపాడారు. నటుడు అల్లు అర్జున్‌ పర్యటన సమయంలో ఎస్పీ వ్యవహరించిన తీరుపై ఎన్నికల కమిషన్‌ వివరణ కోరింది. ఈయనతో పాటు జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్‌ డీఎస్పీలకు స్థానచలనం తప్పదు. నంద్యాలలోని వన్‌టౌన్, టూటౌన్, త్రీటౌన్, తాలుకా సీఐలు, ఎస్సైలను బదిలీ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్ధమైంది. త్రీటౌన్, టూటౌన్‌ సీఐలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గుర్రుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని