logo

మల్లన్న క్షేత్రంలో చంద్రన్న ప్రక్షాళన చేపట్టాలి

తిరుమల తర్వాత భక్తుల తాకిడి ఎక్కువ ఉండే క్షేత్రం శ్రీశైలం.. ఆరో అష్టాదశ శక్తిపీఠం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీగిరిని సందర్శిస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది.

Updated : 18 Jun 2024 09:09 IST

శ్రీశైలంలో గత ఐదేళ్లు అక్రమాల పర్వం
కనీస సౌకర్యాల్లేక భక్తుల తీవ్ర అవస్థలు

శ్రీశైల మల్లన్న కృష్ణదేవరాయగోపురం

తిరుమల తర్వాత భక్తుల తాకిడి ఎక్కువ ఉండే క్షేత్రం శ్రీశైలం.. రెండో జ్యోతిర్లింగŸం, ఆరో అష్టాదశ శక్తిపీఠం కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు శ్రీగిరిని సందర్శిస్తుంటారు. పర్వదినాల్లో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. శ్రీశైల మల్లికార్జునుడి క్షేత్రం చెంత గత ఐదేళ్లు జగన్‌ ప్రభుత్వం రాజకీయం చేసింది. భక్త జన సమస్యలు పట్టించుకోకుండా వైకాపా నేతలు, అధికారులు సొంత లాభాలు చూసుకున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో అవినీతి, అక్రమాలను పెంచి పోషించారు. భక్తుల సేవ ముసుగులో భారీగా లబ్ధి పొందారు. ఇటీవల కొలువుదీరిన ‘కూటమి’ ప్రభుత్వం మల్లన్న క్షేత్రం అభివృద్ధికి శ్రీకారం చుట్టాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే తిరుమల వేంకన్న కొండపై ప్రక్షాళనలకు శ్రీకారం చుట్టారు.. మల్లన్న కొండపై దృష్టి సారించాలని భక్తులు కోరుతున్నారు.

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైల మహాక్షేత్రంలో రూ.215 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆరు నెలల కిందట శంకుస్థాపన చేశారు.. అందులో రెండు పనులకే టెండర్లు ఖరారయ్యాయి. అదేవిధంగా రూ.75 కోట్ల అంచనాతో నిర్మించ తలపెట్టిన నూతన క్యూ కాంప్లెక్స్‌ , రూ.35 కోట్ల అంచనాతో రూపొందించిన సాలు మండపాల నిర్మాణంపై దృష్టి సారించాల్సి ఉంది. లడ్డూ విక్రయ కేంద్రం నుంచి విరాళ కేంద్రం వరకు ఉన్న స్థలంలో నూతన క్యూకాంప్లెక్స్‌ను నిర్మించాల్సి ఉంది. డొనేషన్‌ కౌంటర్‌ను మరో ప్రదేశానికి తరలించాల్సి ఉంది. యాత్రీకులకు 200 వసతి గదుల సముదాయం, శివ సేవకుల వసతి సముదాయం, సౌర విద్యుదుత్పత్తి కేంద్రం, పలుచోట్ల మంచినీటి ట్యాంకుల నిర్మాణాలకు పరిపాలన, సాంకేతిక అనుమతులిచ్చి పనులు వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇంజినీరింగ్‌ అధికారుల ఇష్టానుసారం

శ్రీశైల క్షేత్రంలో రూ.వందల కోట్ల వ్యయంతో బృహత్తర ప్రణాళిక పనులు చేపట్టారు. దేవాదాయశాఖ, దేవస్థానం ఇంజినీర్లు సరైన ప్రణాళిక లేకుండా పనులు చేపట్టడం వల్ల రూ.100 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం అయ్యాన్న ఆరోపణలు ఉన్నాయి. డార్మెటరీ గదులను కల్యాణ కట్టగా, శివదీక్షా క్యూ కంపార్ట్‌మెంట్‌ తో పాటు సిద్ధరామప్ప దుకాణ సముదాయాన్ని సూట్‌ గదులు, బ్యాంకుల సముదాయంగా మార్చారు. సాంకేతిక అనుమతులకు భిన్నంగా వ్యవహరించడంతో నిధులన్నీ వృథా అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రసాద్‌ పథకం కింద రూ.50 కోట్లతో పలుచోట్ల పనులు చేపట్టారు. హఠకేశ్వరం, శిఖరేశ్వరం సముదాయాలు నిరుపయోగంగా మారాయి. శిఖరేశ్వరం వద్ద రూ.60 లక్షలతో నిర్మించిన వాచ్‌టవర్‌ నిరుపయోగంగా మారింది.

ఏటా రూ.5 కోట్ల దోపిడీ

పడితరం స్టోర్‌ అక్రమాలకు నిలయంగా మారింది. దేవస్థానం వందల క్వింటాళ్ల చొప్పున జీడిపప్పు కొనుగోలు చేస్తోంది. మార్కెట్ ధరల కంటే ఎక్కువ మొత్తం చెల్తిస్తున్నారు. నెలకు రూ.42 లక్షలు సొమ్ము అదనంగా చెల్లిస్తున్నారు. ఈ లెక్కన ఏడాది కాలానికి రూ.5 కోట్లు గండి పడుతోంది. నంద్యాల పాల ఉత్పత్తుల సహకార సంస్థ విజయ డెయిరీ నుంచి కొన్నేళ్ల నుంచి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేస్తున్నారు. ఈ నెయ్యి ద్వారా లడ్డూ ప్రసాదాలు తయారు చేసేవారు. ఈవో లవన్న వచ్చిన తర్వాత నెల్లూరుకు చెందిన డెయిరీ నుంచి తెప్పిస్తున్నారు. నాణ్యతపై ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని క్యాన్లకు బ్యాచ్‌ నంబర్లు లేకుండా నెయ్యి సరఫరా చేస్తున్నారు.

గేట్లు భక్తులకు పాట్లు

 • వైకాపా ప్రభుత్వంలో ధర్మకర్తల మండలి తీర్మానం మేరకు వాహనాలు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించకుండా ఇనుప గేట్లు బిగించారు. దీంతో టోల్‌గేట్‌ నుంచి వచ్చిన వాహనాలు నేరుగా భారత్‌ పెట్రోల్‌ బంక్‌ మీదుగా రింగ్‌ రోడ్డుపైకి వెళ్లాల్సి వస్తోంది. అక్కడే ఉన్న పార్కింగ్‌ ప్రదేశంలో వాహనాలు నిలుపుకోవాలి. అలా కాకుండా సత్రాలకు వెళ్లాలంటే టోల్‌గేట్‌ వద్ద నుంచి వాహనాలు సుమారు ఆరు కిలోమీటర్లు రింగ్‌రోడ్డుపై ప్రయాణించి బస్టాండు వరకు చేరుకోవాలి. ఇనుప గేట్లు ఏర్పాటు చేయడంతో భక్తులు సత్రాలకు వెళ్లాలన్నా, ఆలయం వద్దకు రావాలన్నా అష్టకష్టాలు పడుతున్నారు.
 • దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణంలో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రద్దీ రోజుల్లో భక్తుల కార్లను టోల్‌గేట్‌ సమీపంలోని శివపార్వతుల విగ్రహం వద్ద నిలిపివేస్తున్నారు. దీనివల్ల రింగ్‌రోడ్డు నుంచి వచ్చే వాహనదారులు చెంచులక్ష్మి మ్యూజియం మీదుగా తిరిగి వెళ్లడానికి నానా అవస్థలు పడుతున్నారు.

వంతెనల నిర్మాణం అత్యవసరం

 • వారాంతపు, సెలవు రోజుల్లో శ్రీగిరి క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. వేలాదిగా వచ్చే కార్లు, ఇతర వాహనాలు నిలిపేందుకు ఆలయ పరిసరాల్లో సరిపడా పార్కింగ్‌ ప్రదేశాలు లేవు. చేసేది లేక భక్తులు తమ కార్లను ఆలయ పరిసరాల్లోని అంతర్గత రహదారులకు ఇరువైపులా నిలుపుతున్నారు.
 • తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి కార్లు, ఇతర వాహనాలు హఠకేశ్వరం వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. అక్కడి నుంచి 2 కి.మీ దూరం ప్రయాణించగానే సాక్షి గణపతి ఆలయం వద్ద ట్రాఫిక్‌లో ఆగిపోతున్నారు.
 • ముఖద్వారం- శ్రీశైలం టోల్‌గేట్‌ వరకు గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. సమస్య పరిష్కారానికి టోల్‌గేట్‌ సమీపం నుంచి పైవంతెన( ఫ్లైఓవర్‌) నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. రూ.20 కోట్ల అంచనాతో శ్రీశైలం- సున్నిపెంట మధ్య తీగల వంతెన నిర్మించాలన్న ప్రతిపాదన ఉంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  ap-districts
  ts-districts

  సుఖీభవ

  చదువు