logo

కాలం కరిగింది.. కరవు బృందం కదిలింది

రబీ సీజన్‌ ముగిసి ఐదు నెలలైంది. ఖరీఫ్‌ ‘కాడి’ కదిలింది. చినుకు రాలడంతో విత్తనం మొలకెత్తింది.. గత రబీలో నెలకొన్న పంట నష్టం తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం ఈనెల 19, 20 తేదీల్లో రానుంది.

Published : 18 Jun 2024 02:13 IST

ఈ నెల 19, 20 తేదీల్లో పర్యటన
రబీ పంటల ఆనవాళ్లు కరవు
ఛాయాచిత్ర ప్రదర్శనలతో సరి

వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎండిపోయిన వరిపొలం.. ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు (పాత చిత్రం)

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే : రబీ సీజన్‌ ముగిసి ఐదు నెలలైంది. ఖరీఫ్‌ ‘కాడి’ కదిలింది. చినుకు రాలడంతో విత్తనం మొలకెత్తింది.. గత రబీలో నెలకొన్న పంట నష్టం తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం ఈనెల 19, 20 తేదీల్లో రానుంది.

నష్టం ఆనవాళ్లే లేనప్పుడు అధికారులొచ్చి ఏం చూస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఆలస్యానికి కారణం గత ప్రభుత్వం సకాలంలో స్పందించకపోవడమే. 2023-24 రబీ సీజన్‌లో అక్టోబరు, నవంబరు నెలల్లో చినుకు జాడ కరవైంది. పప్పుశనగ, జొన్న, మొక్కజొన్న, పొగాకు, వేరుశనగ, మినుము, వరి తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పంటలు పరిశీలించి ఆదుకోవాలని రైతులు ఆందోళన చేశారు.. కలెక్టరేట్లను ముట్టించారు.. ప్రభుత్వం స్పందించలేదు. చివరి 2024 సార్వత్రిక ఎన్నికల ప్రకటన వెలువడే ముందు రోజు మార్చిలో కరవు మండలాలు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అన్ని మండలాలు కరవు కోరల్లో చిక్కుకుంటే కర్నూలులో 18, నంద్యాలలో 13 మండలాలనే కరవు జాబితాలో ప్రస్తావించడం గమనార్హం. గత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే కేంద్ర బృందం పర్యటన ఎప్పుడో పర్యటించేది... నిధుల విడుదలా పూర్తియ్యేదని రైతులు పేర్కొంటున్నారు.

85,259 హెక్టార్లలో ‘విత్తు’కోని పంటలు

గత రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. కర్నూలు జిల్లాలో 27,039 హెక్టార్లు, నంద్యాలలో 58,220 హెక్టార్లలో విత్తనమే పడలేదు. చాలామంది పంట విరామం ప్రకటించి వలసెళ్లారు. కర్నూలు జిల్లాలో 1,21,673 హెక్టార్ల సాధారణ సాగు అందులో 94,634 హెక్టార్లలో (77.78 శాతం) పంటలు సాగయ్యాయి. 18 మండలాల్లోనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆయా మండలాల్లో 70,982 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. నంద్యాల జిల్లాలోని 29 మండలాల పరిధిలో 1,81,118 హెక్టార్ల సాధారణ సాగు కాగా 1,22,898 హెక్టార్లలో (68 శాతం) పంటలు సాగయ్యాయి. 13 కరవు మండలాల్లో అన్ని రకాల పంటలు కలిపి 59,207 హెక్టార్లలో నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే పంట నష్టం జాబితా రూపొందించడంపై రైతులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అభ్యంతరాలు తెలిపితే పరిశీలనకు పొలాల్లో ఏముంటాయని ప్రశ్నిస్తున్నారు.

అందని ఖరీఫ్‌ నిధులు

2023-24లో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఉమ్మడి జిల్లాలో 30 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయా మండలాల పరిధిలో రూ.460.47 కోట్ల పంట నష్టపరిహారాన్ని మే 18న విడుదల చేసింది. అందులో సుమారు లక్ష మంది రైతులకు పరిహారం అందలేదు. అందులో 40 వేల మందికి పైగా బ్యాంకు ఖాతాల వివరాలు తప్పుగా ఉన్నాయంటూ తేల్చారు.

గుట్టుగా జాబితా తయారీ

నష్టపోయిన రైతుల జాబితా వివరాలు గుట్టుగా తయారీ చేసినట్లు విమర్శలున్నాయి. గత ఐదేళ్లు రైతు భరోసా కేంద్రాలపై అధికార వైకాపా నేతలు పెత్తనం చెలాయించారు. తాము చెప్పినట్లుగా పనిచేయాలని.. ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోకూడదని.. ఆర్బీకేల సిబ్బందిని బెదిరించారు. కరవు ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతుల వివరాలు ఆర్బీకేల వద్ద ప్రదర్శించలేదు. ఈ-పంట నమోదులో ఉన్న వివరాల ఆధారంగానే జాబితా రూపొందించారు. కనీసం రైతుల వద్ద అభ్యంతరాలు స్వీకరించలేదు. పంట నష్టం నివేదికలను వ్యవసాయాధికారులు మే నెలాఖరున ప్రభుత్వానికి నివేదించారు. ఆర్బీకేలపై మండల వ్యవసాయ, సబ్‌ డివిజన్ల ఏడీఏలు పర్యవేక్షణ కొరవడింది.

పశుగ్రాసం కొరత

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 31 కరవు మండలాల్లో పశుగ్రాసం కొరత ఉందని పశుసంవర్ధక శాఖ అధికారులు తేల్చారు. రూ.2.84 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపారు.నంద్యాల జిల్లాలో 3.17 లక్షల యూనిట్ల పశుసంపద ఉండగా 11 వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు నిర్ధారించారు. 1,650 మెట్రిక్‌ టన్నుల సమీకృత దాణా, రూ.9.60 లక్షల విలువైన మందులు, గడ్డి కత్తిరించే యంత్రాలు కలిపి మొత్తం రూ.1.66 కోట్లతో ప్రభుత్వానికి నివేదికలు పంపారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కేంద్ర కరవు బృందానికి అన్ని జిల్లాల నివేదికలను సమర్పించారు.  కర్నూలు జిల్లాలో 3.74 లక్షల యూనిట్ల పశు సంపద ఉండగా 15,996 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత ఉన్నట్లు నిర్ధారించారు.

కరవు మండలాలు : 31
పంట పంట: 1,30,189 హెక్టార్లు
నష్టపోయిన రైతులు : 1,16,912
నష్టం అంచనా : రూ.128.87 కోట్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని