logo

పెద్దల అండ.. అనర్హులకు అధికార దండ

జలవనరులశాఖలో నిబంధనలు నీట మునిగాయి.. సీనియారిటీని తుంగలో తొక్కి కొందరు అధికారులు కీలక స్థానంలో కొలువుదీరారు. వైకాపా నాయకుల బంధువులు, స్నేహితులు, సన్నిహితులుగా ఉంటున్న  అధికారులు ‘అధికారం’

Published : 19 Jun 2024 02:46 IST

జలవనరులశాఖలో ఐదేళ్లు వైకాపా నేతల పెత్తనం
సీనియారిటీని తుంగలో తొక్కి పోస్టింగులు

ఈనాడు, కర్నూలు: జలవనరులశాఖలో నిబంధనలు నీట మునిగాయి.. సీనియారిటీని తుంగలో తొక్కి కొందరు అధికారులు కీలక స్థానంలో కొలువుదీరారు. వైకాపా నాయకుల బంధువులు, స్నేహితులు, సన్నిహితులుగా ఉంటున్న  అధికారులు ‘అధికారం’ అండతో నచ్చిన చోట పోస్టింగులు తెచ్చుకున్నారు.. అర్హులకు తీరని అన్యాయం జరిగింది.. వైకాపా నేతల అరాచకాలకు భీతిల్లి నాడు అర్హులు నోరు మెదపలేదు. అర్హులను పక్కకు తప్పించి అనర్హులను అందలాలు ఎక్కిస్తున్నా ఏనాడూ ప్రతిఘటించలేదు. ప్రశ్నిస్తే తామెక్కడ ఇబ్బందులు పడతామోనన్న భయంతో ఎవరికివారు మిన్నకుండిపోయారు. వైకాపా పాలన అంతం కావడంతో తమకు జరిగిన అన్యాయాలను ప్రస్తుత అధికారులకు వివరించి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

బంధువు కోసం మరొకరిని బలి చేశారు

గుంతకల్లు హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌. డివిజన్‌ డీఈఈగా విధులు నిర్వర్తించిన తిరుమలేశ్వర్‌రెడ్డిని నంద్యాలలోని కేసీ కెనాల్‌ డివిజన్‌కు ఈఈగా పూర్తి అదనపు బాధ్యతలతో నియమించారు. ఇందుకోసం అక్కడి ఈఈ ప్రతాప్‌ను అర్ధంతరంగా అనంతపురం బదిలీ చేశారు. తిరుమలేశ్వర్‌రెడ్డి కన్నా చాలామంది సీనియర్లు ఉన్నప్పటికీ ఆయనకే కీలక పోస్టింగు ఇవ్వడం గమనార్హం. ఆయన ఆత్మకూరులోని ఓ కీలక మాజీ ప్రజాప్రతినిధికి అత్యంత సన్నిహితుడు కావడంతోపాటు దూరపు బంధుత్వం కూడా ఉండడంతో కీలకమైన ఈఈ పోస్టు పొందినట్లు సమాచారం.

వీరికీ కట్టబెట్టారు

ఆళ్లగడ్డలోని కేసీ కెనాల్‌ డివిజన్‌ డీఈఈగా విధులు నిర్వర్తిస్తున్న దశరథరామిరెడ్డికి నెల్లూరులోని సోమశిల ప్రాజెక్టుకు పూర్తి అదనపు బాధ్యతలతో ఈఈ పోస్టు కట్టబెట్టారు. సోమశిల ప్రాజెక్టు ఆళ్లగడ్డకు చాలా దూరంలో ఉన్నప్పటికీ ఆయనకే ఆ కీలక పదవి కట్టబెట్టడం గమనార్హం. వై.ఎస్‌.ఆర్‌. జిల్లాకు చెందిన ఆయనకు మాజీ ప్రజాప్రతినిధితో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆ పోస్టును తెచ్చుకోగలిగారు.

నంద్యాలలోని ఎస్సార్బీసీ డివిజన్‌కు చెందిన డీఈఈ రఘురామిరెడ్డికి కర్నూలులోని కేసీ కెనాల్‌ సబ్‌ డివిజన్‌ డీఈఈ బాధ్యతలు అప్పగించారు. ఓ ఎస్‌ఈ సిఫార్సుతో కర్నూలుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి లేఖ ఆధారంగా బదిలీ చేయించుకోవడం గమనార్హం. 

కర్నూలు జలవనరులశాఖ క్వాలిటీ కంట్రోల్‌ విభాగం డీఈఈగా ఉన్న సుబ్రహ్మణ్యంరెడ్డిని నంద్యాలలోని కేసీ కెనాల్‌ సబ్‌ డివిజన్‌కు బదిలీ చేశారు. ఇందుకోసం ఆ సబ్‌ డివిజన్‌ డీఈఈ రాజశేఖర్‌ను గోరకల్లులోని ఎస్సార్బీసీ డివిజన్‌కు బదిలీ చేయడం గమనార్హం.  


బుగ్గన అండతో కీలక పదవి

నందికొట్కూరు హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్‌.ఎన్‌.ఎస్‌.ఎస్‌.) డివిజన్‌ ఈఈగా విధులు నిర్వర్తించిన రెడ్డి శేఖరరెడ్డి కర్నూలులోని చిన్ననీటిపారుదల డివిజన్‌కు తొలుత ఈఈగా వచ్చారు. అందుకోసం ఆ స్థానంలో ఉన్న శ్రీనివాసులు ఈఈని శ్రీశైలం ప్రాజెక్టు ఈఈగా అర్ధంతరంగా బదిలీ చేశారు. ఆ తర్వాత కర్నూలు ఇరిగేషన్‌ రెగ్యులర్‌ ఎస్‌ఈగా ఉన్న శ్రీరామచంద్రమూర్తిని ఉన్నట్టుండి శ్రీశైలం ప్రాజెక్టు ఎస్‌ఈగా బదిలీ చేశారు. అనంతరం కర్నూలు ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈగా పూర్తి అదనపు బాధ్యతలను రెడ్డి శేఖరరెడ్డికి అప్పగించారు. ఎస్‌.ఇ. పోస్టుకు అర్హులైన ఇంజినీర్లు అందుబాటులో ఉన్నప్పటికీ సీనియారిటీని పూర్తిగా పక్కనపెట్టి జూనియర్‌ అయిన రెడ్డి శేఖర్‌రెడ్డికి జలవనరుల శాఖ జిల్లా అధికారిగా పెత్తనం అప్పగించారు. హంద్రీనీవా సుజల స్రవంతి కర్నూలు డివిజన్‌-3 ఈఈగా కూడా రెడ్డి శేఖరరెడ్డే ఇటీవల పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం ఆయన మూడు కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. నాటి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అండదండలు పుష్కలంగా ఉండడంతో కీలక పదవులు లభించినట్లు ప్రచారం జరుగుతోంది. 

ఉన్నతాధికారుల వత్తాసు

జలవనరులశాఖలో రాష్ట్రస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ అధికారి అండదండలు పుష్కలంగా లభించడంతో కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆ అధికారితోపాటు నాటి ప్రజాప్రతినిధులు ఆయా అధికారులకే వత్తాసు పలకడంతో పలువురు అధికారులను అర్ధంతరంగా బదిలీ చేయించి మరీ పోస్టింగులు పొందగలిగారు. ప్రభుత్వం మారడంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని జలవనరులశాఖలో జరిగిన అడ్డగోలు బదిలీలపై ప్రస్తుత ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని