logo

మల్లన్న గడపన వైకా‘పాచికలు’

కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పలు శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించింది.. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది.. తిరుమల తర్వాత అత్యధిక భక్తులొచ్చే శ్రీశైల క్షేత్రంపై వెంటనే దృష్టి సారించాలని భక్తజనం విన్నవిస్తోంది.

Updated : 19 Jun 2024 05:19 IST

ఆలయ సముదాయ గదుల్లో ‘రాజకీయం’ 
స్థానచలనం కలిగిన ఉద్యోగులకు డిప్యుటేషన్లు
వెంటనే ప్రక్షాళన చేయాలంటున్న భక్తజనం

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పలు శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించింది.. తిరుమల నుంచే దానికి శ్రీకారం చుట్టింది.. తిరుమల తర్వాత అత్యధిక భక్తులొచ్చే శ్రీశైల క్షేత్రంపై వెంటనే దృష్టి సారించాలని భక్తజనం విన్నవిస్తోంది. మల్లన్న సన్నిధిలో విధులు నిర్వహిస్తున్న కొందరు ఉద్యోగులు వైకాపా నేతలతో అంటకాగారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా అక్రమార్జనకు అలవాటు పడ్డారు. ఆలయ పాలనలో ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న వారిని సాగనంపాల్సిన సమయం వచ్చిందని భక్తులు పేర్కొంటున్నారు.

అస్మదీయుడికి ఆలయ బాధ్యతలు

ప్రధాన దేవస్థానాల్లో కార్యనిర్వహణాధికారులుగా పని చేయాలంటే ప్రత్యేక అర్హతలు ఉండాలి. రీజినల్‌ జాయింట్‌ కమిషనర్, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్, ఐఏఎస్‌ అధికారులనే ఈవోలుగా నియమించాలి. జగన్‌ గద్దెనెక్కిన వెంటనే కడపలో వైకాపా నేతలకు అనుకూలంగా పని చేసిన అధికారి ఈవోగా వాలిపోయారు. కడప మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేసిన డిప్యూటీ కలెక్టర్‌ ఎస్‌.లవన్నను 2021 ఆగస్టు 20న శ్రీశైల దేవస్థానం ఈవోగా ప్రభుత్వం నియమించింది. ఆయన ఈవోగా కొనసాగించడానికి ఏకంగా నిబంధనలు మార్చేశారు. డి…ప్యూటీ కలెక్టర్లు ఈవోగా పని చేయడానికి వెసులుబాటు కల్పించారు. కడప, చిత్తూరు ప్రజాప్రతినిధుల అండదండలతో ఆయన రెండేళ్ల పాటు ఈవోగా పని చేశారు. ఆయన హయాంలో వందల రూ.కోట్ల అభివృద్ధి పనులు, టెండర్లు వైకాపా నేతలకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. బదిలీ అయినాసరే విధుల నుంచి రిలీవ్‌ కాకుండా, సీఎస్‌ ఉత్తర్వులను బేఖాతరు చేసి 20 రోజులు అదనంగా పని అయిష్టంగా వెళ్లారు. ప్రస్తుతం నెల్లూరులో డీఆర్వోగా పని చేస్తున్నారు. 


భక్తులకు బాధలు మిగిల్చారు

  • వైకాపా హయాంలో క్యూలైన్ల నిర్వహణ అధ్వానంగా మారింది. రూ.5 వేల గర్భాలయ అభిషేకం టికెట్లు, రూ.1500 సామూహిక అభిషేకం టికెట్లను తీసుకున్న భక్తులను ఒకే వరుసలో వెళ్లాలని షరతులు పెట్టారు. శ్రీకాళహస్తి నుంచి డిప్యుటేషన్‌ బదిలీపై వచ్చిన అధికారిణికే క్యూలైన్ల బాధ్యతలు అప్పగించారు. ఆమె భక్తులపై అనుచితంగా ప్రవర్తించినా అడ్డుచెప్పడం లేదు. ఆర్జిత సేవలు, దర్శనానికి వచ్చే మహిళలు కచ్చితంగా జడలు చేసుకోవాలని షరతు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఆమెకు ఈవో స్థాయి అధికారుల అండదండలు ఉండటం వల్లే ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
  • అప్పటి ఈవో లవన్న అనాలోచితంగా నిర్మించిన క్యూలైన్ల వల్ల ఇప్పటికీ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్జిత సేవల క్యూలైన్లు, స్పర్శ దర్శనం క్యూలైన్ల ప్రవేశ మార్గాలు పర్యవేక్షకస్థాయి అధికారుల కనుసన్నల్లో నడపడం భక్తులకు ఇబ్బందులు తెచ్చి పెడుతోంది. క్యూలైన్ల నిర్వహణ సక్రమంగా లేదని భక్తులు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించడం లేదు. 

డిప్యుటేషన్‌పై తిరిగొచ్చేశారు

వైకాపా అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత దేవాదాయశాఖలో ఉద్యోగులను సాధారణ బదిలీలు చేశారు. దేవాదాయశాఖ పరిధిలోని హెల్పర్‌ నుంచి ఏఈవోల వరకు బదిలీ అయ్యారు. మల్లన్న సన్నిధిలో పని చేస్తున్న 70 మందిని శ్రీకాళహస్తి, కాణిపాకం, కసాపురం, మహానంది దేవస్థానాలకు పంపించారు. మూడు నెలలు గడవక ముందే ఉద్యోగులను డిప్యుటేషన్‌ పద్ధతిలో వచ్చేశారు. ఇందుకు అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అండదండలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికలు ముందు ఏసీ, డీసీలకు పదోన్నతి కల్పించారు. 


అంటకాగారు.. కట్టబెట్టారు

ప్రోటోకాల్‌ కార్యాలయం పేరిట మూడు దుకాణాలు దక్కించుకొన్న వైకాపా నేతలు ఇలా పార్టీ సమావేశాలకు వినియోగించుకుంటున్నారు. (పాత చిత్రం) 

  • డిప్యుటేషన్‌పై వచ్చిన ఉద్యోగులు దుకాణాలు మొదలు కొని, దేవస్థానం స్థలాల్లో ఇళ్ల నిర్మాణం, కొత్త సత్రాలకు స్థలాలు కేటాయించడం వరకు అన్ని పనులు వైకాపా నేతలకు కట్టబెట్టారు. దేవస్థానంలో పొరుగు సేవల కింద సిబ్బందిని నియమించే ఏజెన్సీలన్నింటినీ ఒకే ఏజెన్సీకి దక్కేలా పావులు కదిపారు. సదరు ఏజెన్సీ కార్యకలాపాలు వైకాపా నేతల కనుసన్నల్లో కొనసాగాయి. రూ.లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. 
  • ఐదేళ్ల పాటు క్షేత్రంలో గదులను వైకాపా కార్యకలాపాలకు వేదికగా చేసుకున్నారు. సిద్ధరామప్ప దుకాణ సముదాయంలోని మొదటి అంతస్తులో మూడు దుకాణాలు అతి తక్కువ ధరతో పొదుపు సంఘాల పేరిట స్థానిక వైకాపా నేతలు తీసుకున్నారు. తర్వాత వాటిని ప్రోటోకాల్‌ కార్యాలయంగా మార్చేశారు. ప్రోటోకాల్‌ పేరు చెప్పి వైకాపా కార్యకలాపాలు నడిపించారు. శ్రీశైలంలో వైకాపా బలపడేందుకు సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను దేవస్థానం గదులను వేదికగా నిర్వహిస్తున్నప్పటికీ ఆలయ అధికారులు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికీ వైకాపా కార్యకలాపాలకు దేవస్థానం గదులు వేదికగా మారడం గమనార్హం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని