logo

అందరూ జట్టుగా.. అక్రమాలు గుట్టుగా

అక్రమార్కులంతా జట్టుగా మారారు. ఆదాయంతో ‘ఆట’లాడుతున్నారు. ఆలూరులోని స్పోర్ట్స్‌ అథారిటీకి చెందిన ఆరు దుకాణాలు నిర్మించారు. ఐదేళ్ల కిందట ఆ దుకాణాలకు వేలం పాట నిర్వహించగా..

Updated : 19 Jun 2024 05:17 IST

అద్దె చెల్లింపుపై ఆటలు  
పట్టించుకోని స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు
న్యూస్‌టుడే, ఆలూరు గ్రామీణ

ఆలూరులో స్పోర్ట్స్‌ అథారిటీకి చెందిన భవన సముదాయం

క్రమార్కులంతా జట్టుగా మారారు. ఆదాయంతో ‘ఆట’లాడుతున్నారు. ఆలూరులోని స్పోర్ట్స్‌ అథారిటీకి చెందిన ఆరు దుకాణాలు నిర్మించారు. ఐదేళ్ల కిందట ఆ దుకాణాలకు వేలం పాట నిర్వహించగా.. అందరూ రింగై వాటిని దక్కించుకున్నారు. నెలకు రూ.8వేల చొప్పున వాటిని అద్దెకు తీసుకున్నారు. రెండేళ్ల పాటు అంతా బాగానే కొనసాగింది. తర్వాత వాటి గురించి పట్టించుకునేవారే కరవయ్యారు. ఒక్కో దుకాణం నుంచి నెలకు రూ.8వేల చొప్పున ఆరు దుకాణాలకు కలిపి మొత్తం రూ.48వేలు అద్దె రావాల్సి ఉంది. అలా వచ్చిన దాన్ని ఆలూరులోని ఇండోర్‌ స్టేడియం అభివృద్ధి చేసుకోవడంతో పాటు ఆటగాళ్లకు కావాల్సిన వాటిని సమకూర్చాల్సి ఉంది. లక్ష్యం దారితప్పింది.. అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది.  

మూడేళ్లుగా ఇంతే.. 

ఆలూరు పట్టణంలోని ఆలూరు- ఎల్లార్తి రహదారిలోని దుకాణాలకు మంచి డిమాండ్‌ ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆ దారిలో వెళ్తుంటారు. దీంతో ఆ రహదారిలో అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగుతుంటాయి. అక్కడ చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు సాగించేవాళ్లు కూడా మంచి ఆదాయం పొందుతుంటారు. అలాంటి రహదారిలో జిల్లా స్పోర్ట్స్‌ అథారిటీ ఆధ్వర్యంలో ఆరు దుకాణాలు నిర్మించారు. వాటికి ఐదేళ్ల కిందట టెంటర్లు పిలిచారు. కొందరు వ్యాపారులు వాటిని దక్కించుకున్నారు. సక్రమంగా అద్దెలు చెల్లించాలని, ఏటా 33 శాతంతో అద్దెలు పెంచుతామని వాటిని దక్కించుకన్న వారికి సూచించారు. రెండేళ్ల పాటు సక్రమంగా చెల్లిస్తూ వచ్చారు. మూడేళ్లుగా ఎవరూ కూడా అద్దెలు చెల్లించలేదు. అంతేకాకుండా 33 శాతం పెంపు కూడా జరగలేదు. దీంతో అక్కడ ఉన్న దుకాణాలు పొందిన కొందరు తమ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. వేలం ద్వారా దుకాణాలు దక్కించుకున్న కొందరు ఆ దుకాణాలను ప్రస్తుతం విక్రయించేందుకు సిద్ధమయ్యారు. 


ఏకంగా విక్రయానికే.. 

నోటీసులు అందిస్తున్న స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు 

స్పోర్ట్స్‌ అథారికిటీకి సంబంధించిన ఆస్తులను అమ్మకానికి పెట్టారు కొందరు స్వార్థపరులు. దుకాణాలను దుక్కించుకున్న వారు మూడేళ్లుగా అద్దె చెల్లించడంలేదని, ఇటీవల అధికారులు మే 10వ తేదీన తాఖీదులు ఇచ్చారు. కొన్ని నెలలుగా అద్దె చెల్లించడం లేదని, దుకాణాలకు వేలంపాట నిర్వహిస్తామని హెచ్చిరిస్తూ స్వయంగా జిల్లా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అధికారి భూపతిరావు తాఖీదులు ఇచ్చారు. నెల రోజులు గడిచినా అద్దెకున్న వారు ఎలాంటి చెల్లింపులు చేపట్టలేదు. అధికారులు మాత్రం వాటికి టెండర్లు పిలవలేదు. ప్రస్తుతం అందులో అద్దెకు ఉన్న కొందరు ఆ దుకాణాన్ని వేరొకరికి రూ.9 లక్షల నుంచి రూ.10లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఇంతా జరుగుతున్నా స్పోర్ట్స్‌ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తుండటంపై  కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏటా 33 శాతంతో పెంచుతామని చెప్పడం వల్ల తాము ముందుకు రాలేకపోయామని.. ఇలాగైతే తాము కూడా వేలంపాటలో పాల్గొనేవారమని మరికొందరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తేరుకుని దుకాణాల క్రయవిక్రయాలపై దృష్టిసారించి ప్రభుత్వ ఆస్తులను రక్షించాలని క్రీడాభిమానులు కోరుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని