logo

సామాజిక సేవ.. నాయకత్వ పటిమ

ప్రతి విద్యార్థిలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఎన్‌సీసీ శిక్షణ సాగుతుంది.. సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించేలా అధికారులు తీర్చిదిద్దుతారు.

Published : 19 Jun 2024 03:35 IST

ఎన్‌సీసీలో చేరేందుకు విద్యార్థుల ఆసక్తి 
అర్హులకు రిజర్వేషన్ల వర్తింపు
న్యూస్‌టుడే, కర్నూలు బీక్యాంప్‌

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న ఎన్‌సీసీ విద్యార్థులు (పాత చిత్రం) 

ప్రతి విద్యార్థిలో నాయకత్వ లక్షణాలు, దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా ఎన్‌సీసీ శిక్షణ సాగుతుంది.. సామాజిక కార్యక్రమాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించేలా అధికారులు తీర్చిదిద్దుతారు. ఇందులో చేరిన విద్యార్థులకు విద్య, ఉపాధిలో రిజర్వేషన్లు సైతం వర్తిస్తాయి. ఏటా జులై నుంచి ఆగస్టు మొదటి వారం వరకు ప్రతి పాఠశాలు, కళాశాలల్లో ఎన్‌సీసీలో ప్రవేశాలు నిర్వహిస్తారు. 

న్‌సీసీకి సంబంధించి కర్నూలు, అనంతపురం జిల్లాలకు కలిపి కర్నూలు గ్రూపు ఏర్పాటైంది. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు సంబంధించి 113 కళాశాలల్లో ఎన్‌సీసీ ప్రవేశపెట్టారు. ఇందులో 4,350 మంది బాలురు, 5,950 బాలికలు ఉన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పాఠశాల స్థాయిలో 50 విద్యాలయాల్లో 9 వేల మంది బాలబాలికలు ఎన్‌సీసీలో ఉన్నారు. 

శిక్షణ కార్యక్రమాలు

పాఠశాల స్థాయిలో రెండేళ్లపాటు శిక్షణ కొనసాగుతుంది. వారంలో రెండు రోజులు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఇందులో దేశభక్తి, కవాతు, షూటింగ్‌కు ప్రాధాన్యమిస్తారు. ఈ శిక్షణతోపాటు ఎన్‌సీసీలో ఉండే విద్యార్థి తప్పనిసరిగా ఆయా ప్రాంతాల్లో జరిగే 11 రోజుల శిబిరంలో పాల్గొనాల్సి ఉంటుంది. రెండేళ్ల శిక్షణ పూర్తి చేసినవారికి ఎ.పత్రం జారీ చేస్తారు. సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు అదనంగా పాయింట్లు కేటాయిస్తారు. 

డిగ్రీ స్థాయిలో..

డిగ్రీ స్థాయిలోనూ ఎన్‌సీసీలో ప్రవేశాలను జులై మొదటి వారం నుంచి చివరి వారంలో పూర్తి చేస్తారు. యువకులకు సంబంధించి పరుగు, హైజంప్, లాంగ్‌జంప్‌ వంటి వాటిలో ప్రావీణ్యం చూస్తారు. పరిగెత్తే సత్తా, ఎత్తుతోపాటు శారీరకంగా బలంగా ఉండాలి. క్రీడల్లో రాణించేవారికి మరింత ప్రాధాన్యమిస్తారు. సైనిక పరంగా శిక్షణ సాగుతుంది. మహిళలకు సంబంధించి కేవలం పరుగు, ఎత్తు ప్రామాణికంగా తీసుకుంటారు. 

  • మూడేళ్లపాటు సాగే శిక్షణలో కళాశాల స్థాయి సౌకర్యాన్ని బట్టి ఏడాదిలో 40 తరగతులు ఉండేలా శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో ఉత్సాహవంతులైన యువకులను గుర్తించి వారికి సైనిక శిక్షణతోపాటు గణతంత్ర వేడుకలు, తల్‌సైనిక్‌ శిబిరాలకు ఎంపిక చేస్తారు. వారిలో క్రీడా నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఇక్కడ ప్రతిభ చాటిన విద్యార్థులకు రాష్ట్రపతి, గవర్నర్‌ చేతులమీదుగా ప్రశంసాపత్రాలు అందజేస్తారు. 
  • రెండేళ్ల శిక్షణ, ఎన్‌సీసీ శిబిరం పూర్తి చేసిన విద్యార్థులు ‘బి’ సర్టిఫికెట్‌ పరీక్ష రాసేందుకు అర్హులు. మూడేళ్ల శిక్షణ పూర్తి చేసినవారు ‘సి’ పత్రానికి అర్హులు. ఆర్డీసీ, తల్‌సైనిక్‌ శిబిరాల్లో ప్రతిభ చూపినవారికి అదనంగా మార్కులు కేటాయిస్తారు. ఈ పత్రాలు పొందినవారికి ఉన్నత విద్య, ప్రభుత్వ, రక్షణ రంగంలో 2 శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు.  

ఎంపిక విధానమిలా..

పాఠశాల స్థాయిలో 8, 9 తరగతుల వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. బాలబాలికల ఎత్తు ప్రామాణికంగా తీసుకుంటారు. శరీరంపై ఎలాంటి పచ్చబొట్లు ఉండకూడదు. ఉంటే అలాంటివారిని ఎంపిక చేయరు. నిలబడిన సమయంలో రెండు మోకాళ్లు ఒకదానికొకటి తగలకూడదు. పాదం మొత్తం నేలకు ఆనకూడదు. చేతులు, కాళ్లకు ఎలాంటి అదనపు వేళ్లు ఉండకూడదు. పరిగెత్తే సామర్థ్యం ఉన్నవారిని ఎంపిక చేస్తారు. 

విద్యార్థుల ఆసక్తి

ఎన్‌సీసీలో చేరేందుకు బాలబాలికలు, యువతీయువకులు ఉత్సాహం చూపుతున్నారు. ఎన్‌సీసీ ఉండే కళాశాలలో చేరేందుకు పలువురు ప్రాధాన్యమిస్తున్నారు. ఎన్‌సీసీ కావాలంటూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 45 కళాశాలలు దరఖాస్తు చేసుకోగా 39 కళాశాలలకు సంబంధించి పెండింగులో పెట్టారు. సీనియారిటీ ప్రకారం కళాశాలలకు ఎన్‌సీసీ కేటాయిస్తామని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 


పచ్చబొట్లు ఉండకూడదు
- దాసరి సుధీర్, అసోసియేట్‌ ఎన్‌సీసీ అధికారి

ఎన్‌సీసీలో చేరాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా సూచనలు పాటించాలి. ఫ్యాషన్‌పై మోజుతో చాలామంది యువత పచ్చబొట్లు వేయించుకుంటోంది. అలాంటివారికి ఎన్‌సీసీలో ప్రవేశం ఉండదు. విద్యార్థి ఎత్తు పరిగణనలోకి తీసుకుంటారు. కోర్సు పూర్తి చేసిన పాఠశాల విద్యార్థులకు ‘ఏ’ పత్రం, డిగ్రీ స్థాయిలో బి, సి పత్రాలు అందజేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని