logo

ప్ర‘జల’ పథకాన్ని ముంచేశారు

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీటి పథకాలు తీసుకొచ్చారు. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించి ప్రాజెక్టుకు నిధులు

Updated : 19 Jun 2024 05:14 IST

ఈ నెల 25న పరిశీలించనున్న ఏఐఐబీ అధికారులు
గడువు పొడిగిస్తే పనుల పూర్తికి అవకాశం
మంచినీటి పథకాలకు తెదేపా పునాది
ఐదేళ్లలో రూపాయి ఇవ్వని జగన్‌ సర్కారు
న్యూస్‌టుడే, ఎమ్మిగనూరు

పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన రక్షిత మంచినీటిని అందించాలన్న ఉదాత్త లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నీటి పథకాలు తీసుకొచ్చారు. ఐదేళ్లుగా జగన్‌ ప్రభుత్వం అత్యంత నిరంకుశంగా వ్యవహరించి ప్రాజెక్టుకు నిధులు ఇవ్వకుండా పక్కన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకపోవడంతో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) తన వాటాను పూర్తిగా విడుదల చేయలేదు. ఫలితంగా అనేకచోట్ల పనులు అసంపూర్తిగా నిలిచిపోయి నిష్ప్రయోజనం అవుతున్నాయి. ఏఐఐబీ అధికారులు ఈ నెల 25న మున్సిపాలిటీల్లో పరిశీలన చేయనున్నారు. మరోసారి కొలువుదీరిన తెదేపా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ప్రాజెక్టు గడువు పొడిగిస్తే అసంపూర్తి పనులు పూర్తయి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చే వీలుంది.


తెదేపా తెచ్చింది.. వైకాపా నిలిపేసింది

లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్లో ఏషియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం నిధులు సమకూర్చి పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో 25 శాతం పనులు పూర్తి చేశారు. లక్షకుమించి జనాభా ఉన్న పట్టణాల్లో అమృత్‌ పథకాన్నీ తెదేపా హయాంలోనే ప్రారంభించారు. 35 శాతం వరకు పనులు పూర్తి చేశారు. తర్వాత గద్దెనెక్కిన జగన్‌ ప్రభుత్వం నిధుల వాటా విడుదల చేయలేదు. దీంతో గుత్తేదారులు పనులను అసంపూర్తిగా నిలిపేశారు. పనుల్లో పురోగతి లోపించిన విషయాన్ని ఏఐఐబీ నిపుణుల బృందం గుర్తించి ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులిస్తే మిగతా నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నట్లుగా అనేకసార్లు లేఖలు రాసింది. లేదంటే ఒప్పందం రద్దు చేసుకుంటామని హెచ్చరించినా వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులు సరిగా విడుదల చేయని కారణంగా ఏఐఐబీ రుణం వెనక్కిపోతున్న విషయాన్ని గమనించిన కేంద్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఏజన్సీ (ఎస్‌ఎన్‌ఏ) ఖాతా ప్రారంభించాలంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలనూ పట్టించుకోకపోవడం గమనార్హం. 


ఎమ్మిగనూరులో ఏమీ చేయలే

ఎమ్మిగనూరు పట్టణానికి గాజులదిన్నె రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకురావాలనే ఉద్దేశంతో తెదేపా హయాంలో రూ.146.01 కోట్లు కేటాయించారు. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా పట్టించుకోలేదు. చేసిన పనులకు రూ.8.5 కోట్ల బిల్లులు రాకపోవడంతో గుత్తేదారులు మధ్యలోనే వదిలేశారు. పలుచోట్ల ట్యాంకుల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయాయి. 

ఎమ్మిగనూరు పట్టణంలో వృథాగా పడేసిన పైపులు


ఆత్మకూరులో అధోగతి

ఆత్మకూరు పట్టణానికి వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకురావాల్సి ఉంది. ఐదేళ్లుగా వైకాపా పట్టించుకోలేదు. పనులు పూర్తి చేస్తామన్న అప్పటి ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మాట నిలబెట్టుకోలేకపోయారు. ప్రస్తుతం ఖిల్లా వీధి, నీలితొట్ల వీధి, ఇస్లాంపేట, కొత్తపేట, వడ్లపేట, పెద్దబజారు, సంత మార్కెట్‌ ప్రాంతం, ఆర్డీటీ కాలనీ, స్వరాజ్‌నగర్, అర్బన్‌ కాలనీ, ఏరాసు అయ్యపురెడ్డినగర్, వెంగళరెడ్డినగర్‌లో నీటి కష్టాలు ఎక్కువయ్యాయి. 


ఆదోనిలో ఆందోళన

ఆదోని పట్టణంలో నీటి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో తెదేపా హయాంలో అమృత్‌-1, 2 కింద పనులు చేపట్టారు. ఇందుకు రూ.33.58 కోట్లు కేటాయించారు. 85 శాతం పనులు అప్పట్లోనే పూర్తయ్యాయి. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ బిల్లులు ఇవ్వలేదు. పనులు ఇంటింటి కుళాయిలకు నీటి సరఫరా చేసేందుకు ఇబ్బందులు తప్పేవి. 


నంద్యాలలో నత్తనడక

నంద్యాల పట్టణానికి వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి నీటిని తీసుకురావాల్సి ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించారు.. 2019 నాటికి 80 శాతం పూర్తయ్యాయి. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. ఎన్నికలు వస్తున్న తరుణంలో హడావుడిగా ఫిబ్రవరి 21న ప్రారంభించారు. 21 వార్డులకు నిత్యం, మిగిలిన 21 వార్డులకు రోజు తప్పి రోజు ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చాలా వార్డుల్లో మూడు రోజులకోసారి కూడా బిందెడు నీరు అందని పరిస్థితి నెలకొంది.


నందికొట్కూరులో సందిగ్ధం

నందికొట్కూరు పట్టణానికి అలగనూరు జలాశయం నుంచి నీటిని తీసుకొచ్చేందుకు తెదేపా హయాంలో ప్రణాళిక రూపొందించారు. నీటి సరఫరా కేంద్రం కోసం మిడుతూరు సమీపంలో రెండెకరాలు సేకరించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా పట్టించుకోలేదు. భూములకు రెక్కలు రావడంతో సరఫరా కేంద్రం కోసం సేకరించిన భూమిని ఇచ్చేందుకు రైతు అంగీకరించడం లేదు. నీటి పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. 


గూడూరు గోడు

గూడూరుకు సుంకేసుల నుంచి   12 కి.మీ. పైపులైను చేపట్టాల్సి ఉంది. ట్యాంకును మధ్యలోనే నిలిపివేశారు. పైపులైన్లు, ఫిల్టర్‌ బెడ్ల పనులు చేపట్టకుండా వదిలేశారు. 


ఆళ్లగడ్డ వాసుల ఆవేదన

గండ్లేరు జలాశయం నుంచి పుర ప్రజలకు మంచినీటిని అందించాలని ప్రణాళికలు రూపొందించారు. గుత్తేదారు 60-70 శాతం పనులు పూర్తి చేశారు. బిల్లు చెల్లించకపోవడంతో మిగిలిన పనులు నిలిపేశారు.


నగరవాసులకు నరకం

కర్నూలు నగరంలో మంచినీటి కష్టాలు తీర్చేందుకు అమృత్‌ పథకం 2.0 రెండో విడత కింద రూ.130 కోట్లు కేటాయించారు. జగన్నాథగట్టు వద్ద 50 ఎంఎల్‌డీ సామర్థ్యంతో వాటర్‌ ట్రీట్‌మెంటు ప్లాంట్, కర్నూలు, కల్లూరు ప్రాంతాల్లో తాగునీరు నిల్వ చేసుకునేందుకు వీలుగా 22 ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని ప్రణాళిక రూపొందించారు. పరిపాలనా అనుమతులు వచ్చినా ప్రక్రియను ముందుకు తీసుకెళ్లలేదు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు