logo

నగరంలో హైకోర్టు బెంచ్‌

సంవత్సరంలోపే ఏర్పాటయ్యేలా ప్రణాళికలుఈనాడు, కర్నూలు: తెదేపా ఇచ్చిన హామీల్లో భాగంగా నగరంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది.

Published : 20 Jun 2024 02:51 IST

సంవత్సరంలోపే ఏర్పాటయ్యేలా ప్రణాళికలుఈనాడు, కర్నూలు: తెదేపా ఇచ్చిన హామీల్లో భాగంగా నగరంలో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభమైంది. సంవత్సరంలోపే ప్రక్రియ పూర్తికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కూడా హైకోర్టు బెంచి ఏర్పాటు చేస్తామని పలుచోట్ల ప్రకటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో భాగంగా చర్యల్ని వేగవంతం చేస్తున్నారు. 

తీసుకోవాల్సిన చర్యలెన్నో: హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుకు పలు చర్యలు తీసుకోవాల్సి ఉంది. తొలుత హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ సమావేశమై బెంచ్‌ ఏర్పాటుపై చర్చించాలి. అందరు తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయాలి. ఆ ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఆమోదించాలి. దాన్ని శాసనసభ కూడా ఆమోదించి తీర్మానించాలి. ఆ ప్రతిపాదనను కేంద్రప్రభుత్వానికి పంపాలి. కేంద్ర మంత్రివర్గం కూడా ఆ ప్రతిపాదనను ఆమోదించి కేంద్ర న్యాయశాఖ, హోంశాఖలకు పంపుతుంది. అనంతరం దీన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆమోదంతో హైకోర్టు ఏర్పాటు ప్రక్రియ పూర్తవుతుంది. సాధారణంగా పూర్తిస్థాయి వసతులతో ఉన్న భవన సముదాయంలోనే బెంచ్‌ ఏర్పాటుచేస్తారు. ప్రైవేటు భవనాల్లో హైకోర్టు బెంచి నిర్వహించడం ఒకింత ఇబ్బందికరంగా ఉంటుంది. హైకోర్టు బెంచ్‌ నిర్వహణకు అవసరమైన సదుపాయాలతో ముందుగానే ఒక భవనాన్ని నిర్మిస్తే ఏర్పాటు ప్రక్రియ కూడా వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ భవన నిర్మాణానికి అవసరమైన స్థల సేకరణ, నిర్మాణ పనులు కూడా సమాంతరంగా ప్రారంభించాల్సిన అవసరం ఉందని పలువురు న్యాయనిపుణులు చెబుతున్నారు.

కొన్ని సంస్థలు అమరావతికి.....

కర్నూలులో రాష్ట్ర మానవహక్కుల కమిషన్, లోకాయుక్త తదితర సంస్థలు ఇప్పటికే కర్నూలులో ఏర్పాటయ్యాయి. రాష్ట్ర రాజధానిలో ఉండాల్సిన సంస్థలను చట్ట నిబంధనలకు విరుద్ధంగా కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారని కొందరు హైకోర్టులో కేసులు కూడా దాఖలు చేశారు. ఆ కేసు విచారణ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా సంస్థల ప్రధాన కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటుచేసి... ప్రస్తుతం కర్నూలులో ఉన్న కార్యాలయాలను వాటి బ్రాంచి కార్యాలయాలుగా మార్చి కొనసాగిస్తారని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని