logo

టమాటా ధర‘దడ’

పది లక్షల హెక్టార్ల సారవంతమైన నేల.. 7.40 లక్షల సమర్థులైన రైతులు .. విదేశాలకు ‘సోనా’ బియ్యం ఎగుమతి చేసిన ఖ్యాతి.. అలాంటి సీమ ముఖద్వారంలో గత ఐదేళ్లలో కూరగాయల సాగు తగ్గింది

Updated : 20 Jun 2024 06:53 IST

కిలో రూ.100కు చేరింది
ఐదేళ్లలో అమాంతం తగ్గిన సాగు
రాయితీలు నిలిపివేసిన జగన్‌

కర్నూలు వ్యవసాయ, మద్దికెర న్యూస్‌టుడే: పది లక్షల హెక్టార్ల సారవంతమైన నేల.. 7.40 లక్షల సమర్థులైన రైతులు .. విదేశాలకు ‘సోనా’ బియ్యం ఎగుమతి చేసిన ఖ్యాతి.. అలాంటి సీమ ముఖద్వారంలో గత ఐదేళ్లలో కూరగాయల సాగు తగ్గింది.. గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదివేల హెక్టార్లలో టమాటా సాగయ్యేది.. ప్రస్తుతం 4-6 వేల హెక్టార్లకు పడిపోయింది. సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో పొరుగు జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం కిలో రూ.100కు చేరువలో ఉంది. 

కలగా జ్యూస్‌ పరిశ్రమ 

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, ప్యాపిలి, ఆస్పరి, మద్దికెర, బిల్లేకల్లు తదితర ప్రాంతాల్లో టమాటా అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఏటా రెండు నెలలు మినహా మిగిలిన రోజుల్లో నష్టాలే చవి చూస్తున్నారు. ధరలు లేని సమయంలో లాభం పొందేలా జ్యూస్‌ పరిశ్రమ ఏర్పాటు చేస్తామని వైకాపా నేతలు కాలం వెళ్లదీశారు. తీరా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొండల్లో శంకుస్థాపన చేశారు. 

రాయితీలకు ఎగనామం.. పంటకు విరామం

  • గత ఐదేళ్ల వైకాపా కాలంలో కూరగాయల సాగుకు ప్రోత్సాహం కరవైంది. తెదేపా హయాంలో రాయితీపై విత్తనాలు ఇచ్చేవారు. వైకాపా పాలనలో ఎలాంటి రాయితీలు ఇవ్వలేదు. గిట్టుబాటు ధర కల్పించలేదు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న గొప్పలు ‘గాలి’ల్లో కలిశాయి. 
  •  పంట ప్రణాళికలు లేకపోవడం, ఉద్యాన పంటలకు రాయితీలు ఆపేయడంతో టమాటా ఉత్పత్తి క్రమంగా తగ్గుతోంది. గిట్టుబాటు ధర కల్పిస్తే ఉత్పత్తి పెరగడంతోపాటు రైతులకూ లాభదాయకంగా ఉంటుంది. ఈ విషయాన్ని గత వైకాపా ప్రభుత్వం గుర్తించలేదు. 
  •  2014-19 మధ్య కాలంలో ట్రెల్లీస్‌ విధానంలో టమాటా సాగుకు రాయితీలు అందించారు. 2019-20 నుంచి తగ్గిపోయింది. విత్తనాలు, మల్చింగ్, ట్రెల్లీస్‌ విధానాలకు ఖర్చు పెరుగుతుండటంతో రైతులు సంప్రదాయ సాగుకు మళ్లుతున్నారు. 
  •  కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లోనూ రాష్ట్రం నిర్లక్ష్యం వహించింది. సూక్ష్మ సేద్యం మూడేళ్లపాటు నిలిపివేసి రైతుల సహనానికి పరీక్ష పెట్టింది. ఉత్పత్తి తగ్గడానికి ఇవన్నీ కారణాలని రైతులు పేర్కొంటున్నారు. 
  • మార్చి, ఏప్రిల్, మే నెలల్లో బోరుబావుల కింద, నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో టమాటా సాగును ప్రోత్సహించి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చేది కాదు.. గత ప్రభుత్వం చెప్పలేదు.. ఉద్యాన శాఖ అధికారులు పట్టించుకోలేదు.

    నాలుగు వేల హెక్టార్లకు పడిపోయింది

  • రాష్ట్రంలో ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి సుమారు రెండు లక్షల ఎకరాల్లో టమాటా సాగవుతోంది. ఇందులో సింహభాగం అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలో ఉత్పత్తి అవుతోంది. 2022-23లో కర్నూలు జిల్లాలో 4,774 హెక్టార్లకు 1,67,078 మెట్రిక్‌ టన్నుల దిగుబడి, నంద్యాలలో 4,389 హెక్టార్లకు 2,63,376 మె.ట. దిగుబడి వచ్చింది. పంట బాగా పండినా ధరలు పడిపోవడంతో చాలా మంది రైతులు పొలాల్లోనే వదిలేశారు. 2023-24లో కర్నూలు జిల్లాలో 4,050 హెక్టార్లకు 1,21,500 మె.ట. రాగా, నంద్యాలలో 3,180 హెక్టార్లకు 95,400 మె.ట. ఉత్పత్తి వచ్చింది. 
  • పంట ఉన్నప్పుడు ధర ఉండదు.. ధర బాగుంటే పంట ఉండటం లేదు.. ఏడాదిలో ఒకటి రెండు నెలలు మినహా మిగిలిన రోజుల్లో నష్టాన్ని చవిచూస్తున్నారు. ఎకరానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. గత ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం కరవైంది.. ఫలితంగా సాగు విస్తీర్ణం అమాంతం పడిపోయింది.

అప్పుడు కిలో రూ. 1..  ఇప్పుడు రూ. 1¦00

గతేడాది నవంబరులో కిలోకు రూపాయి దక్కింది. మార్కెట్‌లో కొనేవారు లేక రోడ్డు పక్కన పారబోశారు. మరికొన్నిసార్లు కిలోకు రూ.5 నుంచి రూ.8 పలికింది. కోత ఖర్చులు, ఇతర రవాణా ఛార్జీలకు సరిపోవడం లేదు. ప్రస్తుతం కిలో రూ.100కు చేరువలో ఉంది. బుధవారం కర్నూలులో టోకు(హోల్‌సేల్‌) కిలో రూ.60-72, సీక్యాంపు రైతుబజారులో రూ.62-74, లోకల్‌ మార్కెట్‌లో రూ.64-78 ధర పలికింది. చిరు వ్యాపారులు, చిల్లర వర్తకులు, వీధి వ్యాపారులు కిలో రూ.80-100కు విక్రయిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని