logo

పంచాయతీ రాజ్‌ ఎవరో

కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. పాలనపై ప్రత్యేక దృష్టి సారించింది.. శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించింది.

Published : 20 Jun 2024 03:04 IST

కర్నూలు జడ్పీ, న్యూస్‌టుడే: కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.. పాలనపై ప్రత్యేక దృష్టి సారించింది.. శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించింది.. కొందరు అధికారులు గతంలో వైకాపా నేతలతో అంటకాగి వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేశారు. అలాంటి అధికారుల చిట్టాను నిఘా విభాగం ప్రభుత్వానికి అందించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ శాఖలో కొందరు అధికారులు కొత్త ప్రజాప్రతినిధుల వద్దకు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికే అమరావతిలో తిష్ఠ వేసి మచ్చిక చేసుకొనే ప్రయత్నంలో పడ్డారు. ఉమ్మడి జిల్లాలో కొందరు డీఈఈలు తమ స్థానాలు పదిలపర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు కర్నూలు, కోడుమూరు, ఎమ్మిగనూరుకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

ఈఈ పోస్టుకు పోటాపోటీ 

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో నాలుగు డివిజన్ల ఈఈ పోస్టులకు డిమాండు పెరిగింది. ఈ నెలాఖరులో కర్నూలు సర్కిల్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం పదవీ విరమణ చేయనున్నారు. కర్నూలు ఈఈ పోస్టులో చేరితే ఇన్‌ఛార్జి ఎస్‌ఈగా కొనసాగే అవకాశం ఉంటుందని కొందరు ఆరాటపడుతున్నారు. కర్నూలు (పీఆర్‌ఐ) ఈఈ పోస్టుకు నెల్లూరు జిల్లాలో పని చేస్తున్న సుధాకర్, సుబ్బరాజు, అనంతపురం నుంచి మల్లికార్జున మూర్తి, కాకినాడ నుంచి జి.మల్లికార్జున, పల్నాడు నుంచి వైసీ సుబ్బరాయుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు ఈఈలు సంబంధిత ఎమ్మెల్యేల నుంచి సిఫార్సు లేఖలు సిద్ధం చేసుకుని అమరావతిలో మకాం వేశారు. రెండేళ్ల క్రితం కర్నూలు ఈఈగా విధుల్లో చేరిన మద్దన్నకు ఏం చేయాలో అంతుపట్టని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కర్నూలు ఈఈ పోస్టుకు ఇంతమంది పోటీ పడుతుంటే తాను మరో ప్రాంతానికి వెళ్లాల్సి వస్తోంది.. ఆయనా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఈ నెలాఖరుకు ఆదోని ఈఈ వెంకట ప్రసాద్‌ పదవీ విరమణ చేస్తున్నందున ఆ పోస్టుకైనా ప్రయత్నించాలని మద్దన్న నిర్ణయించుకున్నట్టు తెలిసింది. 

పీఐయూ ఈఈ పోస్టుకు డిమాండు 

జిల్లాల విభజన అనంతరం కర్నూలులోని పీఐయూ (ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్‌ యూనిట్‌) డివిజన్‌ కార్యాలయం నంద్యాలలో ఏర్పాటు చేయాల్సి ఉంది. గతేడాది నవంబరులో కార్యాలయం మార్చాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కొందరు రాజకీయ నేతల ప్రోద్బలంతో ఇక్కడే కొనసాగింది. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు తప్పకుండా కర్నూలులోని పీఐయూ డివిజన్‌ కార్యాలయం ఈ నెలాఖరు నాటికి నంద్యాలకు మారనుందని చెబుతున్నారు. పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఎంతో కీలకమైన పీఐయూ డివిజన్‌ ఈఈ పోస్టుకు డిమాండు నెలకొంది. పీఎంజీఎస్‌వై, నాబార్డుతోపాటు ఏఐఐబీ నుంచి నిధులు భారీగా వచ్చే అవకాశమున్నందున ఈఈ పోస్టుకు డిమాండు పెరిగింది. నంద్యాలలో డివిజన్‌ కార్యాలయం ఏర్పాటు చేసినా అక్కడ నుంచి విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. మంత్రులు, ఎంపీల నుంచి సిఫారసు లేఖలకు ప్రయత్నం చేస్తున్నారు. 

ఈ నెలాఖరుకు ఎస్‌ఈ పదవీ విరమణ 

పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రహ్మణ్యం ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ పోస్టుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌ జిల్లా ఎస్‌ఈ శ్రీనువాసులురెడ్డి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. ఇతర జిల్లాల నుంచి కొందరు ఎస్‌ఈలు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. గతంలో ఇక్కడ ఈఈ విధులు నిర్వహించి, పదోన్నతిపై ఎస్‌ఈగా ఇతర జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఇక్కడకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని