logo

పట్టణాల్లో ప్లాస్టిక్‌ మేటలు

ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు.

Updated : 20 Jun 2024 06:42 IST

ప్లాస్టిక్‌ కవర్లు, ఇతర వస్తువుల వినియోగంపై నిషేధం విధించి రెండేళ్లు గడుస్తోంది. నేటికీ పూర్తిస్థాయిలో నిబంధనలు అమలు కావడం లేదు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ యథేచ్ఛగా వాడకంలో ఉంటోంది. ప్రతి మనిషి నిత్యం సగటున 25-50 గ్రాముల మేర ప్లాస్టిక్‌ వినియోగిస్తున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 40 లక్షలకు పైగా జనాభా ఉంది.. ప్లాస్టిక్‌ వినియోగం టన్నుల్లో ఉంటోంది. ఇదంతా చెత్త కుప్పల్లో పోగుపడి.. అక్కడి నుంచి డంపింగ్‌ యార్డులకు చేరి, చివరికి భూమిలో కరగక.. నీరు, వాయు, భూ కాలుష్యానికి కారణమవుతోంది. 

ఆదోని పురపాలకం, నంద్యాల పురపాలకం, ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: నిషేధం విధించిన నేటికీ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ అమ్మకాలు చేస్తున్నారు. మొదట్లో 50 మైక్ల్రాన్ల కంటే తక్కువ కాని కవర్లు వినియోగించాలని నిర్ణయించారు. 2021 సెప్టెంబర్‌లో 75 మైక్రాన్లకు తక్కువ కాకుండా ఉండే ప్లాస్టిక్‌ వినియోగించాలని భావించారు. 2022లో 120 మైక్రాన్ల కంటే తక్కువ ఉండే ప్లాస్టిక్‌ వినియోగంపై నిషేధం విధించారు. అయినా రోజు సరాసరి ఒక్క ఆదోనిలోనే వెయ్యి కిలోలకు పైగా వ్యాపారం సాగుతోంది. కర్నూలు వంటి ప్రాంతాల్లో  5-6 వేల కిలోలు, నంద్యాల రూ.3-4 వేల కిలోల ప్లాస్టిక్‌ కవర్ల విక్రయాలు సాగుతున్నాయి. మిగిలిన ప్రాంతాల్లో రోజు సుమారు 50-100 కిలోల దాకా అమ్మకాలు చేపడుతున్నారు. ఈ లెక్కన రోజు ఉమ్మడి జిల్లాలో పది వేల కిలోల దాకా ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్నారని అంచనా.

తనిఖీలు తకరారు

మనిషి బయటకు ఖాళీ చేతులతో వచ్చి.. చివరికి ఇంటికి వెళ్లే సమయంలో కూరగాయలు మొదలు ఆహార పదార్థాలు, పండ్లు, బేకరి, వస్త్రాలు, ఇతర సామగ్రి ఏదైనా సరే ప్లాసిక్‌ కవర్లపైనే ఆధారపడ్డాడంటే పరిస్థితి ఎంతలా మారిపోయిందో అర్థమవుతోంది. ఇటు పురపాలక, నగర పంచాయతీ అధికారులు కఠిన నిషేధం ఉన్నా.. పై పై దాడులతోనే సరిపుచ్చుతున్నారు. ఆదేశాలు వచ్చిన రోజు మాత్రమే ఆర్భాటంగా దాడులు చేయడం, కేసులు నమోదు చేసి జరిమానా విధించడం తప్ప.. కఠినంగా వ్యవహరించడం లేదు. ఇటు తయారీ పరిశ్రమలపైనే దాడులు చేసి, వాటి ఉత్పత్తినే నిలిపేస్తే.. వ్యవహారం ఇక్కడిదాకా రాదనేది అందరి మాట. ఉత్పత్తి లేకుంటే విక్రయాలు ఎలా సాగిస్తారని.. వ్యాపారులే ప్రశ్నిస్తున్నారు. ఇందులో మా ప్రమేయం లేదు. చిరు వ్యాపారులపై దాడులు చేసి మమ్మల్సి ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకపోవడం ఒకింత సమస్యగా మారింది. 

ఆదోని డంపింగ్‌ యార్డులో ప్లాస్టిక్‌ వ్యర్థాలు. వ్యవహారం ఇక్కడిదాకా రాదనేది అందరి మాట. ఉత్పత్తి లేకుంటే విక్రయాలు ఎలా సాగిస్తారని.. వ్యాపారులే ప్రశ్నిస్తున్నారు. ఇందులో మా ప్రమేయం లేదు. చిరు వ్యాపారులపై దాడులు చేసి మమ్మల్సి ఇబ్బంది పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయకపోవడం ఒకింత సమస్యగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని