logo

కర్షకుల ఏకరవు

రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. సాధారణంగా పప్పు శనగ ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది

Published : 20 Jun 2024 03:20 IST

సకాలంలో స్పందించకపోవడంపై అన్నదాత ఆగ్రహం

ఆలూరులో కరవు బృందానికి సమస్యలు విన్నవిస్తున్న రైతు 

కర్నూలు వ్యవసాయం, న్యూస్‌టుడే: రబీలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.. సాధారణంగా పప్పు శనగ ఎకరానికి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.. పొలం తడారిపోవడంతో మూడు క్వింటాళ్లు కూడా రాలేదు.. ఆదుకోవాలని ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు.. ప్రస్తుతం నేలపై రబీ సీజన్‌ పంట ఆనవాళ్లే లేవు.. ఇప్పుడు ఏం చూడడానికి వచ్చారని రైతులు కరవు బృందాన్ని ప్రశ్నించారు.. గత ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని మరికొందరు రైతులు పేర్కొన్నారు. 2023-24 రబీ సీజన్‌లో నెలకొన్న కరవు పరిస్థితులు పరిశీలించడానికి కేంద్ర కరవు బృందం సభ్యులు పర్యటించారు. ఆలూరు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను చూశారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అనంతరం జిల్లా కేంద్రంలో జేసీ నారపురెడ్డి మౌర్యతో కలిసి పరిశీలించారు. వ్యవసాయానుబంధ శాఖలతో సమీక్షించారు. డీఆర్వో మధుసూదన్‌రావు, జిల్లా వ్యవసాయాధికారిణి పీఎల్‌ వరలక్ష్మి తదితరులు ఉన్నారు.

రూ.63.63 కోట్ల పంట నష్టం

గత రబీ సీజన్‌లో నవంబరులో 41 శాతం వర్షం కురవగా, సెప్టెంబరు, అక్టోబరు, డిసెంబరు నెలల్లో చినుకు జాడ కరవైంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 18 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించారు. అనావృష్టితో 70,982.465 హెక్టార్లలో పంటలు దెబ్బతినగా 58,901 మంది రైతులు నష్టపోయారు. బాధిత రైతులకు రూ.63.63 కోట్ల పంట నష్ట పరిహారం చెల్లించాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారులు కేంద్ర కరవు బృందానికి నివేదించారు. 

పశుగ్రాసం పెంపకానికి ప్రతిపాదనలు

జిల్లాలో 3.74 లక్షల యూనిట్ల పశు సంపద ఉంది.. కరవు ప్రభావంతో 16 వేల మెట్రిక్‌ టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడింది.. 575 మెట్రిక్‌ టన్నుల సమీకృత దాణా అవసరం.. రూ.35 లక్షల విలువ చేసే మందులను సరఫరా చేయాలి.. 213 గడ్డిని కత్తిరించే యంత్రాలు కావాలి.. ఇందుకు మొత్తం రూ.1.18 కోట్ల వ్యయం అవసరమని సంబంధిత శాఖాధికారులు నివేదించారు. జిల్లాలో వెయ్యి మంది రైతులకు రాబోయే ఐదేళ్లకు ఒక్కొక్కరికి అర ఎకరం చొప్పున 2,500 ఎకరాల్లో పశుగ్రాసం పెంచేందుకు రూ.12 కోట్ల ప్రతిపాదనలు చేశారు.

పాతాళంలో జలం

2023 మే - 2024 మే నెల మధ్య కాలంలో భూగర్భ జలాలు -3.62 మీటర్ల లోతుకు పడిపోయాయి. గతేడాది మే నుంచి నవంబరు మధ్య కాలంలో -0.82 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి.. తుంగభద్ర నది ఎండిపోవడంతో ఆయకట్టు రైతులు సాగునీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.. 223 చెరువు ఉన్నా నీటి నింపలేకపోయామని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు వేదికలో పేర్కొన్నారు. జిల్లాలో 165 గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి తలెత్తింది.. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు, ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో నింపేందుకు, బోరు, బావుల మరమ్మతులకు రూ.11.21 కోట్లతో ప్రతిపాదించినట్లు.. ట్యాంకర్ల ద్వారా 3,881 ట్రిప్పుల నీటి సరఫరాకు రూ.29.52 లక్షలు వెచ్చించినట్లు నివేదికలో పొందుపరిచారు.

వీటికి నిధులివ్వండి

  • ఏడాదికి వంద మంది చొప్పున ఐదేళ్లకు 500 మంది రైతులు ‘పట్టు’సాధించేందుకు రూ.22.50 కోట్లు అవసరమని పట్టు పరిశ్రమల శాఖాధికారులు నివేదించారు.
  • కొండ ప్రాంతాల్లో ఏటా 10 లక్షల మొక్కలు నాటేందుకు నిధులు అవసరమని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రతిపాదనలు రూపొందించింది.
  • జిల్లాలోని మండలాల్లో 200 చేపల చెరువులు తవ్వించేందుకు రూ.12 కోట్ల అవసరమని అలా చేస్తే 4.66 లక్షల మందికి ఉపాధి కల్పించినట్లవుతుందని మత్స్యశాఖ అధికారులు నివేదికలో పేర్కొన్నారు.
  • జలకళ పథకం ద్వారా వచ్చే ఐదేళ్లలో 12,500 బోరు బావులు తవ్వించి మోటార్లు బిగించేందుకు రూ.250 కోట్లు అవసరమవుతాయిని నివేదించారు. రాబోయే ఐదేళ్లలో 11 వాటర్‌షెడ్లకు రూ.42 కోట్లు కావాలని నివేదిక సమర్పించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని