logo

పతకాలపైనే గురి

ఆ యువకుడికి చిన్నతనం నుంచి ఆటలపై మక్కువ ఎక్కువ. ఒకవైపు ప్రైవేటు పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తూ మరోవైపు షూటింగ్‌ బాల్‌లో పతకాల పంట పండిస్తున్నారు

Published : 20 Jun 2024 03:31 IST

షూటింగ్‌బాల్‌లో సత్తా చాటుతున్న వ్యాయామోపాధ్యాయుడు
శిక్షకుడిగానూ రాణింపు

ఆ యువకుడికి చిన్నతనం నుంచి ఆటలపై మక్కువ ఎక్కువ. ఒకవైపు ప్రైవేటు పాఠశాలలో వ్యాయామోపాధ్యాయుడిగా పనిచేస్తూ మరోవైపు షూటింగ్‌ బాల్‌లో పతకాల పంట పండిస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పతకాలు సాధించడంతో పాటు రిఫరీగా, కోచ్‌గా సేవలు అందిస్తున్నారు. ఇటీవల దిల్లీలో షూటింగ్‌ బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి కోచింగ్‌ సర్టిఫికెట్‌ ఎంపికల్లో పాల్గొని ప్రతిభచూపి ధ్రువపత్రాన్ని అందుకున్నారు.
- న్యూస్‌టుడే, కోవెలకుంట్ల

సాధించిన పతకాలు ఇవే

  • 2022లో గయలో జాతీయస్థాయిలో జరిగిన సబ్‌ జూనియర్‌ పోటీల్లో ఏపీ జట్టుకు కోచ్‌గా వ్యవహరించారు.
  • 2022లో కోవెలకుంట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు నిర్వాహకుడిగా పనిచేశారు. 
  • రామకుప్పంలో జరిగిన స్కూల్‌గేమ్స్‌కు, విజయవాడ, ప్రకాశం, వైఎస్సార్, కృష్ణా జిల్లాలోని ఆకుపాడు, నెల్లూరు, కోవెలకుంట్లలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు రిఫరీగా వ్యవహరించారు. 
  • 2023 సెప్టెంబరులో భోపాల్‌లో జరిగిన జాతీయ స్థాయి ఆటలకు ఏపీ జట్టు కోచ్‌గా పనిచేశారు.
  • 2024 మార్చిలో ఉత్తరప్రదేశ్‌లోని గజియాబాద్‌లో ఏపీ సబ్‌ జూనియర్స్‌ జట్టుకు కోచ్‌గా పనిచేశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి....

కోవెలకుంట్లలోని ప్రైవేటు పాఠశాలలో నంద్యాల పరమేశ్వరరెడ్డి వ్యాయామోపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. స్వగ్రామం ఉయ్యాలవాడ మండలంలోని మాయలూరు. నంద్యాల వెంకటేశ్వరరెడ్డి, సావిత్రి తల్లిదండ్రులు. వారిది వ్యవసాయ కుటుంబం.  పెద్ద కుమారుడైన పరమేశ్వరరెడ్డి డిగ్రీతో పాటు అండర్‌ గ్రాడ్యుయేషన్‌ డిప్లొమో ఇన్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తితో పైకా క్రీడలు, స్కూల్‌గేమ్స్‌ల్లో పాల్గొనేవారు. జిల్లాస్థాయి పోటీల్లోనూ సత్తా చాటుతూ షూటింగ్‌ బాల్‌ పోటీల్లో రాణించి రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పతకాలు, ప్రశంసాపత్రాలు దక్కించుకున్నారు. ఇదేఆటలో జిల్లా, రాష్ట్రస్థాయి జట్లకు కోచ్‌గా, రిఫరీగా పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.  

 సర్టిఫికెట్‌ సొంతం: ఈనెల 9న దిల్లీలో షూటింగ్‌ బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా జాతీయస్థాయి షూటింగ్‌ బాల్‌ కోచింగ్‌ సర్టిఫికెట్‌ ప్రదానానికి ఎంపిక పోటీలు నిర్వహించారు. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి సుమారు 300 మందికి పైగా దరఖాస్తు చేసుకోగా 55 మంది అర్హత సాధించారు. ఏపీ నుంచి అయిదుగురు ఎంపిక కాగా వారిలో పరమేశ్వరరెడ్డి ఒకరు. షూటింగ్‌ బాల్‌ పోటీలు నిర్వహించి ప్రతిభ ఆధారంగా స్కోరింగ్‌ ఇచ్చి కోచింగ్‌ సర్టిఫికెట్లకు ఎంపిక చేశారు. దీని ఆధారంగా ఈ ఆటలో జాతీయ స్థాయి క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అర్హత పొందినట్లే. దీంతోపాటు ప్రత్యేకంగా శిక్షణ కేంద్రం నిర్వహించే అవకాశం ఉంటుంది.


జాతీయ స్థాయి రిఫరీగా రాణించాలని
- నంద్యాల పరమేశ్వరరెడ్డి, వ్యాయామోపాధ్యాయుడు

గతంలో ఏపీలో షూటింగ్‌ బాల్‌ ఆటకు ఆదరణ ఉండేది కాదు. కొన్నేళ్లుగా మళ్లీ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారుల్లో ఈ ఆటపై ఆసక్తి పెరిగింది. జిల్లాలో దీని అభివృద్ధికి కృషి చేయడంతో పాటు జాతీయ స్థాయి రిఫరీగా రాణించేందుకు ప్రయత్నిస్తా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని