logo

వైకాపాతో... అంటకాగిన ఖాకీల్లో కలవరం

‘న్యాయం’ చేయాల్సిన ఖాకీలు పరిధి దాటారు.. వైకాపా నేతలతో అంటకాగారు.. ఐదేళ్లూ వారు చెప్పిందే శాసనంలా ముందుకెళ్లారు

Updated : 20 Jun 2024 06:38 IST

 జాబితా సిద్ధం చేసిన నిఘా విభాగం

నేడో... రేపో పడనున్న వేటు

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే:  ‘న్యాయం’ చేయాల్సిన ఖాకీలు పరిధి దాటారు.. వైకాపా నేతలతో అంటకాగారు.. ఐదేళ్లూ వారు చెప్పిందే శాసనంలా ముందుకెళ్లారు.. ప్రతిపక్ష నేతలను బాధపెట్టారు.. రాష్ట్రంలో ప్రభుత్వం మారింది.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం పాలనపై ప్రత్యేక దృష్టి సారించింది.. శాఖల్లో ప్రక్షాళన ప్రారంభించింది.. వైకాపా నేతలకు వంతపాడిన అధికారుల చిట్టాను నిఘా విభాగం ప్రభుత్వానికి అందించింది. నంద్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి వేళ అక్రమంగా తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో ‘స్థానిక’ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.. నిఘా విభాగం సేకరించిన జాబితాలో వారి వివరాలూ ఉన్నట్లు తెలుస్తోంది. ఐదేళ్లు వైకాపా సాగించిన అరాచకపర్వానికి సహకరించిన పోలీసులపై నేడు.. రేపో వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రతిపక్షాలపై ఉగ్ర నరసింహ

రెండేళ్ల నుంచి నంద్యాల త్రీటౌన్‌లో విధులు నిర్వహిస్తున్న ‘అధికారి’ వైకాపా నేతలతో అంటకాగారు. వారు చెప్పిందే వేదంలా భావించి ప్రతిపక్షాలను వెంటాడారు. హోంగార్డు, హెడ్‌ కానిస్టేబుల్‌ సహకారంతో సెటిల్‌మెంట్లు చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వానికి నివేదిక అందింది. జిల్లా పోలీస్‌ ‘బాస్‌’ దగ్గరకు వచ్చిన సమస్యల్ని పోలీసుస్టేషన్‌లో దగ్గరుండి ప్రైవేటు పంచాయితీలు నిర్వహించేవారు. గతేడాది నంద్యాలలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడి అరెస్టు వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌ బయట కాపు కాసి మరి తెదేపా నాయకులను నిలువరించారు. నాయకులను బలవంతంగా పోలీసు వాహనం ఎక్కించి ఇతర ఠాణాలకు తరలించారు. పోలీసుస్టేషన్‌లోనే కానిస్టేబుల్‌ రామకృష్ణ ఆత్మహత్య చేసుకుంటే 174 సెక్షన్‌ పెట్టి సాధారణ వ్యవహారంగా కేసును మలచడంలో విజయం సాధించారు. ఎస్పీ కార్యాలయం ముందు సివిల్‌ పంచాయితీ విషయంలో పోలీసు అధికారులు వేధిస్తున్నారని వైఎస్సార్‌ జిల్లాకు చెందిన కౌన్సిలర్‌ కుటుంబం మూకుమ్మడిగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా చిన్న కేసుతో సరిపెట్టారు.

గురు ఆదేశాలు పాటించే గిరి

‘తాలూకా’ స్థాయి అధికారి వైకాపా నాయకుడిలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టు సమయంలో పత్రికా విలేకరులను అక్కడ ఉండకుండా బయటకు పంపించేసి ‘గురు’ ఆదేశాలు పాటించారు. ఎప్పుడూ పోలీసుస్టేషన్‌లో ఏదో ఒక పంచాయితీ ఉండేలా ఏడాదిగా చూసుకున్నారు. న్యాయం కోసం వెళ్తే వైకాపాకు ఒక విధంగా, మిగిలిన వారికి మరో విధంగా అన్న చందంగా వ్యవహరించారు.

బలి చేయడంలో ఘనుడు

తన ఏలుబడిలో శాంతిభద్రతలు క్షీణిస్తుంటే బాధ్యత వహించాల్సిన ‘బాస్‌’ ఆ నెపాన్ని ఇతరులపైకినెట్టి తప్పుకొంటున్నారు. నంద్యాలలో మే11న సినీ నటుడు అల్లు అర్జున్‌ ముందస్తు అనుమతి లేకుండా రోడ్‌షో నిర్వహిస్తే..ఇందుకు బాధ్యులైన సీఐ, ఎస్‌ఐపై చర్యలు తీసుకోకుండా ముందుగానే ఉన్నతాధికారులకు సమాచారమిచ్చిన ఇద్దరు ఎస్‌బీ కానిస్టేబుళ్లను వీఆర్‌కు పంపించారు. చాగలమర్రిలో హత్య జరిగితే అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీసు సిబ్బందిని వీఆర్‌కు పంపించారు.

తెదేపా కార్యకర్తలపై ఆంక్షలు

గతేడాది తెదేపా అధినేత చంద్రబాబునాయుడిని నంద్యాల పట్టణంలో అక్రమంగా అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో జిల్లా ‘బాస్‌’ కీలకంగా వ్యవహరించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత భారీగా పోలీసు బలగాలతో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్‌ హాల్‌కు వచ్చిన నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరిమేశారు. ముందుగానే వైద్యులను అక్కడికి రప్పించి ఆరోగ్యం బాగా ఉందనే కోణంలో నివేదికలు ఇప్పించారు. అరెస్టు సమయంలో ఎక్కువ మంది తెదేపా నాయకులు, కార్యకర్తలు గుమిగూడి ఉండకుండా ఆంక్షలు విధించారు.

పంచాయితీల్లో తనకు తానే సాటి

జిల్లావ్యాప్తంగా వివిధ పోలీసుస్టేషన్లతో పాటు పోలీసు అధికారి కార్యాలయంలో అర్ధరాత్రి వరకు సివిల్‌ పంచాయితీలు నిర్వహించారు. ఒక నాయకుడి గన్‌ లైసెన్సు కోసం ఏకంగా రూ.30 లక్షలు తీసుకున్నారు. బేతంచర్లలో పోలీసు కాంప్లెక్స్‌ నిర్మాణానికి విరాళాలు సేకరిస్తే.. ఈ నిర్మాణాలకు పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా నిధులు విడుదల చేయించి దారి మళ్లించారు. కొంత మంది న్యాయవాదులతో ప్రత్యేక సంబంధాలు ఏర్పరచుకుని కక్షిదారులను రప్పించుకుని ప్రైవేటు పంచాయితీలు చేసి భారీ ఎత్తున కూడబెట్టుకున్నారు. బేతంచర్లకు పెద్ద బాస్‌ వస్తే ఒక నాయకుడి ఇంట్లో ‘విందు’ ఏర్పాటు చేసి తన బంధాన్ని దృఢపర్చుకున్నారు. 

వీఆర్‌కు వెళ్లినా పెత్తనం 

పోలీసు ‘బాస్‌’కు షాడోలా వ్యవహరించిన ఓ అధికారి వీఆర్‌కు వెళ్లినా పెత్తనం చేస్తున్నారు. రెండేళ్లుగా పట్టణంలో జరిగిన పలు సివిల్‌ పంచాయితీల్లో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ సురేంద్ర దారుణహత్య సమయంలో ఎస్‌బీ సీఐగా ఉన్నారు. పోలీసుల వేధింపుల వల్ల నలుగురు కుటుంబ సభ్యులు రైలు కింద పడి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకున్న కేసులో బాధితులపై తొలిగా కేసును నమోదయ్యింది ఈ సీఐ హయాంలోనే. ఈయనపై పలు ఆరోపణలు రావడంతో కొన్ని నెలల కిందట అనంతపురం జిల్లాకు బదిలీ చేసి వీఆర్‌లో ఉంచారు. కానీ నంద్యాలలోనే తిరుగుతున్నారు. ప్రస్తుతం మరోసారి నంద్యాలలో పోస్టింగ్‌ కోసం ఒక నాయకుడి చుట్టూ తిరుగుతున్నారు.

బాస్‌ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు

రెండున్నరేళ్ల కిందట జిల్లాకు వచ్చిన ‘బాస్‌’ అక్రమాలను పెంచిపోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నియోజకవర్గంలో పేకాట క్లబ్‌ కొనసాగింది. మహానంది మండలం బసవాపురం చెరువు, బనగానపల్లి నియోజకవర్గంలోని నొస్సం, కొలిమిగుండ్ల మండలం, డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి, పాణ్యం సమీపంలోని తమరాజుపల్లె కొండల్లోని పేకాట క్లబ్‌లో రోజుకు రూ.లక్షల్లో చేతులు మారాయి. రేషన్‌ దుకాణాల్లోని చౌకబియ్యం తరలింపులో అక్రమార్కులకు వంత పాడారు. బనగానపల్లికి చెందిన ఒక వైకాపా నాయకుడితో చేతులు కలిపి అక్రమ రవాణాకు సహకారం అందించారు. జిల్లా కేంద్రం నంద్యాలలో అధికార పార్టీ నాయకుడు సేకరించే చౌక బియ్యం సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లగా.. రవాణాకు ‘బాస్‌’ సహకారం అంతా ఇంతా కాదు.

ఎస్‌బీ పోలీసులతో వ్యూహాలు

సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందే వ్యూహాలు సిద్ధం చేశారు. నంద్యాల వన్‌టౌన్‌ ఎస్‌బీ కానిస్టేబుల్‌గా తన అనుచరుడిని ఎస్‌బీ కానిస్టేబుల్‌గా నియమించి స్థానిక సమాచారం అంతా సేకరించి అధికార పార్టీకి చేర వేశారు. పాణ్యం ఎస్‌బీ కానిస్టేబుల్‌గా మరొకరిని నియమించారు. ఈయన గడివేములలో పాకిస్థాన్‌ జాతీయుడికి అక్రమంగా పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డు ఇప్పించడంలో కీలక పాత్ర పోషించారు. ఈయనపై ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోగా పాణ్యం ఎస్‌బీ కానిస్టేబుల్‌గానే ఉంచారు. నందికొట్కూరు తాలుకా, పట్టణ ఎస్‌బీ కానిస్టేబుళ్లుగా ఇద్దర్ని ఆ నియోజకవర్గ అధికార పార్టీ నాయకుని సూచనల మేరకు నియమించారు. ఈ ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ కేసులు గతంలో నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని