logo

ప్రేమ పేరుతో బాలికలపై వేధింపులు

పాఠశాలలకు వెళ్లే బాలికలపై ప్రేమ పేరుతో ఆకతాయిలు వేధిస్తున్నారని, పెద్దలకు చెబితే చంపేస్తామని కత్తులతో బెదిరిస్తున్నారని బిలకలగూడూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Published : 21 Jun 2024 02:45 IST

పోలీసులు పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆందోళన

గడివేముల, న్యూస్‌టుడే : పాఠశాలలకు వెళ్లే బాలికలపై ప్రేమ పేరుతో ఆకతాయిలు వేధిస్తున్నారని, పెద్దలకు చెబితే చంపేస్తామని కత్తులతో బెదిరిస్తున్నారని బిలకలగూడూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పోలీసులు స్పందించకపోవడంతో స్థానిక యువకులే గ్రామంలో గస్తీ కాయాల్సి వస్తోందని చెబుతున్నారు. బిలకలగూడూరు గ్రామస్థులు తమ పిల్లలను గడివేములలోని ఆదర్శ పాఠశాల, జిల్లా పరిషత్‌ పాఠశాలకు పంపిస్తున్నారు. వారిని కొందరు ఆకతాయిలు, ఆటో చోదకులు ప్రేమ పేరుతో వేధిస్తున్నట్లు బాధితులు తెలిపారు. ప్రేమించకుంటే చంపేస్తామని కత్తులతో బెదిరిస్తున్నట్లు వాపోతున్నారు. నాలుగు రోజుల కిందట ఓ వ్యక్తి బాలిక ఇంటి వద్దకెళ్లి కత్తితో బెదిరించాడని, చుట్టుపక్కల వారు వెంబడించడంతో తప్పించుకుని పరారయ్యాడని చెబుతున్నారు. అప్పటి నుంచి రాత్రిళ్లు యువకులే గస్తీ కాస్తున్నారు. గ్రామంలో పదేళ్ల కిందట ఇదే విధంగా వేధింపుల విషయమై జంటహత్యలు జరిగాయి. తర్వాత ఓ వర్గం మహిళలను ఆకతాయిలు వేధిస్తున్నారని వారు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. అప్పట్లో ఆకతాయిలకు పోలీసులు కౌన్సెలింగ్‌  ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ గ్రామంలో ఆకతాయిల ఆగడాలు పెరిగిపోయాయని స్థానికులు తెలిపారు. వేధింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రెండు రోజులుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లినా ఫిర్యాదు కూడా తీసుకోవడం లేదన్నారు. ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిని బెదిరిస్తున్నారని బాధితులు వాపోయారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులే బెదిరింపులకు పాల్పడితే తమ బాధను ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గ్రామంలో శాంతిభద్రతలు కాపాడాలని కోరుతున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని