logo

సాంకేతిక వనం.. నైపుణ్య బలం

ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో చాలామంది దీనిపై దృష్టి సారిస్తున్నారు.

Published : 21 Jun 2024 03:47 IST

ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాలలో వినూత్న కోర్సులు
మెండుగా ఉపాధి అవకాశాలు
రేపు 6వ స్నాతకోత్సవం

ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాల ముఖద్వారం

న్యూస్‌టుడే, కర్నూలు విద్య: ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాంకేతిక విద్య దినదినాభివృద్ధి చెందుతోంది. ఉపాధి అవకాశాలు మెండుగా ఉండటంతో చాలామంది దీనిపై దృష్టి సారిస్తున్నారు. కర్నూలు నగర శివారులో జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాలలో చేరేందుకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. నూతన విద్యా విధానంలో భాగంగా నైపుణ్యాలకు పెద్దపీట వేస్తూ విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు. ఇక్కడ సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటుండటం విశేషం. వంద మంది వరకు బోధన, బోధనేతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు చదువు చెప్పడంతోపాటు ఆటల్లో రాణించేలా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియం ఏర్పాటుచేశారు. సెంట్రల్‌ వర్క్‌షాప్‌ సేవలు అందుబాటులో ఉంచారు. 2020-21 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల చదువు పూర్తవుతున్న నేపథ్యంలో 22వ తేదీన 6వ స్నాతకోత్సవం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దిల్లీ జవహర్‌లాల్‌ వర్సిటీ ఛాన్స్‌లర్, నీత్‌ ఆయోగ్‌ సభ్యులు విజయ్‌కుమార్‌ సరస్వత్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.

కొత్త కోర్సులతో ఊతం

ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాలలో మైనర్‌ ప్రోగాం కోర్సులు ప్రారంభించారు. మైనర్‌ ఇన్‌ ఏఐ ఎంఎల్, మైనర్‌ ఇన్‌ ఐవోటీ, డ్రోన్స్‌ అండ్‌ రోబోటిక్స్, స్మార్ట్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి కోర్సులను ఏ బ్రాంచి విద్యార్థి అయినా ఒకదానిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఒక్కో అంశంలో నైపుణ్యం పొందవచ్చు. మరోవైపు కర్నూలు ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఫర్‌ టెక్నాలజీ (కైట్‌)ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బోధన చేస్తున్న అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. 

శిక్షణలో విద్యార్థులు 

పరిశ్రమలతో అనుసంధానం

శామ్‌సంగ్, గూగుల్, అమెజాన్‌ కంపెనీలతో అనుసంధానమై విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తున్నారు. నైపుణ్యాలను మెరుగుపరచడమేకాక విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. ఈ ఏడాది పలువురు విద్యార్థులు మంచి వేతనాలతో ఆయా కంపెనీల్లో ఉద్యోగాలు సాధించారు. కొత్తగా చేరిన విద్యార్థులను సైతం ఇదే రీతిలో ప్రోత్సహిస్తున్నారు. ఫ్టెక్సిబుల్‌ అకాడమిక్‌ ప్రోగ్రాం కింద క్లస్టర్‌గా అలహాబాద్, కాంచీపురం, కర్నూలు ట్రిపుల్‌ ఐటీ కళాశాల కేంద్రాలు కలిసి ఒప్పందం చేసుకున్నాయి. ఆయా కేంద్రాల్లో పనిచేసే ఫ్యాకల్టీలు విద్యార్థులకు ఆసక్తి ఉన్న కోర్సులను ఆఫర్‌ చేస్తారు. ఒక్కో కోర్సును ఆన్‌లైన్‌లో ఒక్కో డిపార్ట్‌మెంట్‌ బోధిస్తుంది.

ఐదు గ్రామాల దత్తత

కర్నూలు ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాల ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ పథకానికి ఎంపికైంది. ఇందులో భాగంగా కన్నమడకల, కేతవరం, ఓర్వకల్లు, రుద్రవరం, నూతనపల్లె గ్రామాలను దత్తత తీసుకున్నారు. ఆయా గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ విధి విధానాలతోపాటు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. అంతేకాకుండా ట్రిపుల్‌ ఐటీ కళాశాల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని యువతకు శిక్షణ సైతం ఇస్తారు.


కళాశాల అభివృద్ధికి కృషి
- ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి, డైరెక్టర్, ట్రిపుల్‌ ఐటీ (డీఎం) 

ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాలలో విద్యా ప్రమాణాలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పాలన సౌలభ్యంతోపాటు విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరింత కృషి చేస్తాం.  నైతిక విలువలతో కూడిన సాంకేతిక విద్య అందిస్తున్నాం. ఉన్నత్‌ భారత్‌ అభియాన్‌ పథకం కింద ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు