logo

విజయయోగం

మారిన పరిస్థితులకనుగుణంగా ప్రతిఒక్కరూ తీవ్ర ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు యోగాపై దృష్టి సారించారు.

Updated : 21 Jun 2024 04:38 IST

ఒత్తిడిని అధిగమిస్తూ రాణింపు
నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం 
న్యూస్‌టుడే, కర్నూలు క్రీడలు (బి.క్యాంపు)

మారిన పరిస్థితులకనుగుణంగా ప్రతిఒక్కరూ తీవ్ర ఒత్తిడితో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు యోగాపై దృష్టి సారించారు. నిత్యం ఆసనాలు వేస్తూ ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటున్నారు. యోగా నేర్చుకోవడమే కాదు.. గురువులుగా మారి ఉచితంగా తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. పలువురు మహిళలు జాతీయ, అంతర్జాతీయ యోగాసన పోటీల్లోనూ ప్రతిభ చాటి పతకాలు సాధించారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ప్రత్యేక కథనం.


ఆన్‌లైన్‌లో నేర్పిస్తూ..

కల్లూరు ఎస్టేట్‌కు చెందిన లలనప్రియ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. లలనప్రియకు మొదటినుంచి యోగా అంటే ఆసక్తి. 2022లో తాడేపల్లిగూడెంలో జరిగిన జాతీయస్థాయి యోగాసన పోటీల్లో రిథమిక్‌లో మూడో స్థానంలో నిలిచారు. 2018లో మంగళూరులో జరిగిన జాతీయస్థాయి యోగాసన పోటీల్లో అడ్వాన్స్‌ యోగాలో రాణించారు. 2012 నుంచి 2024 వరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఏడు బంగారు పతకాలు అందుకున్నారు. గతేడాది ఏప్రిల్‌లో రాజస్థాన్‌లో జరిగిన అంతర్జాతీయ యోగాసన పోటీల్లో అడ్వాన్స్‌ యోగాల్లో ప్రతిభ చాటారు. ఈ సందర్భంగా లలనప్రియ మాట్లాడుతూ యోగా సాధనతో ఒత్తిడి అధిగమించినట్లు చెప్పారు. విద్యార్థుల సౌకర్యార్థం పుల్లయ్య ఇంజినీరింగ్‌ యోగా తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. నగరంలో లేని సమయంలో ఆన్‌లైన్‌లో యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. నిత్యం యోగా సాధనతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదని ఆమె పేర్కొన్నారు. 


సాధన చేసి.. డాక్టరేట్‌ అందుకొని

కర్నూలు నందికొట్కూరు రోడ్డులోని పవన్‌ రెసిడెన్సీలో డా.ఎస్‌.ముంతాజ్‌బేగం నివాసం ఉంటున్నారు. ఆమె జిల్లా కోర్టులో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమెను పలు ఆరోగ్య సమస్యలు వేధించాయి. ఎందరో వైద్యులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. ఈ క్రమంలో మిత్రుల సూచనతో యోగాపై దృష్టి సారించారు. 2013 నుంచి 2019 వరకు నగరంలోని దేవీ ఫంక్షన్‌ హాలులో యోగా గురువు చంద్రశేఖర్‌ వద్ద యోగా సాధన చేశారు. అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. 2018లో యోగాలో ఎమ్మెసీ పట్టా అందుకున్నారు. ఆమె ప్రతిభను గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం 2018లో నేషనల్‌ హెల్త్‌ ఐకాన్‌ అవార్డు అందజేసింది. 2019లో న్యూదిల్లీలోని బైబిల్‌ వర్సిటీ నిర్వాహకుల నుంచి మెడిటేషన్‌లో డాక్టరేట్‌ అందుకున్నారు. 2022 జూన్‌లో పంజాబ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగా న్యాయనిర్ణేత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి బంగారు పతకం సాధించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2022 మార్చిలో కర్నూలులో యోగా ఉత్తమ శిక్షకురాలిగా అవార్డు స్వీకరించారు. ఈ ఏడాది మార్చి 16వ తేదీన యోగా ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో యోగా రత్న అవార్డు అందుకున్నారు. 


వరించిన పతకాలు

కల్లూరు పారిశ్రామికవాడకు చెందిన ప్రసన్న సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నారు. ఆమె 2023లో ఎన్‌ఐఎస్‌ యోగా కోర్సు పూర్తి చేశారు. ఐదో తరగతి నుంచే యోగా శిక్షకుడు విజయ్‌కుమార్‌ పర్యవేక్షణలో యోగాసనాలు నేర్చుకున్నారు. 2012 నుంచి 2021 వరకు వివిధ ప్రాంతాల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని 3 బంగారు, 2 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. 2014లో పుణెలో జరిగిన స్కూల్‌గేమ్స్‌ జాతీయస్థాయి పోటీలు, 2015లో ఉత్తరప్రదేశ్‌లో జరిగిన జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో ఏపీ తరఫున ప్రాతినిధ్యం వహించారు. 2016 నుంచి ఇప్పటివరకు పలు పోటీల్లో రాణించారు. గతేడాది ఏప్రిల్‌లో పంజాబ్‌లో జరిగిన అంతర్జాతీయ యోగాసన పోటీల్లో సీనియర్‌-21 కేటగిరీలో బంగారు పతకం వరించింది. ఈ సందర్భంగా ప్రసన్న మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరుగా పనిచేస్తున్నప్పటికీ యోగాలో సాధన చేయడం మరిచిపోలేదని చెప్పారు. యోగాతోనే ఒత్తిడి అధిగమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సైతం యోగా తరగతులు నిర్వహిస్తున్నామని.. అందరికీ మంచి ఆరోగ్యం అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని