logo

భజన చేశారు.. పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు

‘‘ నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ. .నమ్ముతూ కదలాలిరా.. నమ్మకుంటే ఓటేయలేవురా..ఓటేయకుంటే ఎంత ఏడ్చినా బతుకురాదురా.. తిరిగిరాదురా..అందుకే జగనన్న మన నమ్మకమని.. నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ.. నమ్ముతూ కదలాలిరా..’’ 

Updated : 21 Jun 2024 04:42 IST

వృత్తిని పక్కన పెట్టి వైకాపా సేవలో తరించారు
డా.ప్రభాకరరెడ్డి పనితీరుపై విమర్శల వెల్లువ
న్యూస్‌టుడే, కర్నూలు వైద్యాలయం

‘‘ నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ. .నమ్ముతూ కదలాలిరా.. నమ్మకుంటే ఓటేయలేవురా..ఓటేయకుంటే ఎంత ఏడ్చినా బతుకురాదురా.. తిరిగిరాదురా..అందుకే జగనన్న మన నమ్మకమని.. నమ్ముతూ బతకాలిరా.. తమ్ముడూ.. నమ్ముతూ కదలాలిరా..’’ 

ర్నూలు వైద్య కళాశాలలో కార్డియోథొరాసిక్‌ విభాగాధిపతి పనిచేసిన ప్రొఫెసర్‌ ప్రభాకరరెడ్డి రాసిన కవితా పంక్తులివి. ఇలా నిత్యం జగన్‌ను స్తుతిస్తూ కవితలల్లి సామాజిక మాధ్యమాల్లో పెడుతు ప్రస్తుతం వైద్యశాల పర్యవేక్షకుడి కుర్చీలో కూర్చొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో ఆయన వైద్య వృత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి జగన్‌ను ఆకాశానికి ఎత్తారు.. మరోవైపు ప్రతిపక్షాలపై అభ్యంతరకర పదాలు వాడేవారు. తన ఫేస్‌బుక్‌తో పాటు వైద్య కళాశాల సిబ్బంది, వైద్యులు సభ్యులుగా ఉన్న అధికారిక గ్రూపుల్లోనూ ఈ తరహా పోస్టులు పెట్టేవారు. 

వైకాపా ప్రభుత్వ హయాంలో పార్టీకి ఆస్థాన కవిగా పనిచేసిన డాక్టర్‌ ప్రభాకరరెడ్డి పదోన్నతి అంశంలో 80వ స్థానంలో ఉన్నారు. పెద్దాస్పత్రి పర్యవేక్షకుడిగా ఉన్న డాక్టర్‌ రంగారెడ్డి మే 31న ఉద్యోగ విరమణ చేయడంతో ఆయన స్థానంలో ఎందరో సీనియర్లను కాదని డా.ప్రభాకర్‌రెడ్డిని అప్పటి ప్రభుత్వం పర్యవేక్షకుడిగా నియమించింది. బాధ్యతలు చేపట్టిన తర్వాత కార్యాలయ సిబ్బందితో ‘‘నేను పనిచేసేందుకు సిద్ధం.. మీరు సిద్ధమా’’ అని జగన్‌ అన్న మాటలతో పోల్చి చెప్పడం గమనార్హం. వైకాపా ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమాతో ఈనెల 2న తన తోటి స్నేహితుడి చరవాణికి ఫోన్‌ చేసి మన ప్రభుత్వం వస్తుంది.. విమానంలో వెళ్లేందుకు ఈనె 9న విశాఖపట్టణానికి టికెట్‌ తీసుకుందామని చెప్పడం గమనార్హం. 

ప్రచారమే.. శస్త్రచికిత్సలేవీ

కార్డియోథోరాసిక్‌ విభాగాధిపతిగా సుమారు తొమ్మిదేళ్లుగా ఉన్న డా.ప్రభాకరరెడ్డి ఆ స్థాయికి తగ్గ వైద్యం చేసింది అంతంత మాత్రమేనని అక్కడి వైద్యులు చెబుతున్నారు. కేవలం 700లోపు గుండె శస్త్రచికిత్సలు చేశారు. ఆయనతో విభేదించి బయటకు వెళ్లిపోయిన ఓ యువ వైద్యుడు ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరి 5 వేలకుపైగా గుండె శస్త్రచికిత్సలు చేయడం విశేషం. డా.ప్రభాకర్‌రెడ్డి నెలకు 10 నుంచి 15 గుండె ఆపరేషన్లు చేశారు. ఆయన నిర్వాకం కారణంగా ఇక్కడికి వచ్చిన యువ వైద్యులు పనిచేయలేకపోయారన్న విమర్శలున్నాయి.

అధికార పెత్తనం

పర్యవేక్షకుడైన తర్వాత డా.ప్రభాకరరెడ్డి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడంతో వైద్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ స్పెషాలిటీ వైద్యులు ఆరు రోజులు ఓపీ చూడాలని ఆదేశాలు ఇచ్చారు. అందుబాటులో ఉన్న ఔషధాల కౌంటరును దూరంగా మార్చడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే.. వైకాపా అనుబంధ సంఘంగా ఉన్న అనంతపురం వారిని పిలిపించి వారి ఆధ్వర్యంలో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినా ఆయనకు వైకాపాపై అభిమానం పోలేదు. డా.ప్రభాకరరెడ్డి వ్యవహారానికి సంబంధించిన వివరాలు ఇంటెలిజెన్స్‌ విభాగం సేకరించి ప్రభుత్వం చెంతకు చేర్చింది. గతంలో అందరూ బదిలీ అయినప్పటికీ ఆయన్ను మాత్రం అలానే ఉంచారు. వైకాపాతో అంటకాగడంతో ప్రస్తుతం బదిలీ తప్పదని తోటి వైద్యులు పేర్కొంటున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని