logo

అధ్యక్షా..

ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలన పెట్టారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 చోట్ల కూటమి అభ్యర్థులు (11 తెదేపా, ఒకరు భాజపా), రెండుచోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.

Published : 21 Jun 2024 04:04 IST

నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేలు
14 మందిలో ఏడుగురు కొత్తవారే
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

ఐదేళ్ల అరాచక పాలనను జనం ఓటుతో తరిమి తరిమి కొట్టారు. ‘పంకా’ రెక్కలు విరిచి మూలన పెట్టారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 12 చోట్ల కూటమి అభ్యర్థులు (11 తెదేపా, ఒకరు భాజపా), రెండుచోట్ల వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు. 14 మందిలో ఏడుగురు మొదటిసారి గెలిచారు. ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి, టీజీ భరత్‌లకు మంత్రి వర్గంలో చోటుదక్కింది. శుక్రవారం నుంచి రెండు రోజులపాటు జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.


తొలిసారి

డోన్‌: మాజీ ఎంపీ కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి గత ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిని ఢీకొట్టి తొలిసారిగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. 

కర్నూలు సచివాలయం: మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ తనయుడు టీజీ భరత్‌ ఐదేళ్ల కిందట రాజకీయ ప్రవేశం చేశారు. 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిపోగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందారు. తొలిసారి గెలిచిన భరత్‌కు మంత్రి వర్గంలో స్థానం లభించడం విశేషం. 

పత్తికొండ: సీనియర్‌ నేత కేఈ కృష్ణమూర్తి వారసుడిగా కుమారుడు కేఈ శ్యాంబాబు రాజకీయ రంగప్రవేశం చేసి 2019లో ఓటమి చవిచూడగా 2024 ఎన్నికల్లో గెలుపొందారు. 

కోడుమూరు: తెదేపా అభ్యర్థిగా బరిలో దిగిన యువకుడు బొగ్గుల దస్తగిరి 21 వేల ఓట్ల ఆధిక్యంతో విజయకేతనం ఎగురవేశారు. ఈ నియోజకవర్గంలో 39 ఏళ్ల తర్వాత తెదేపా జెండా ఎగిరింది.

నందికొట్కూరు: ఎస్సీ నియోజకవర్గమైన నందికొట్కూరు నుంచి తెదేపా తరఫున పోటీ చేసి గిత్తా జయసూర్య తొలిసారి గెలుపొందారు. ఇక్కడ 25 ఏళ్ల తర్వాత తెదేపా అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఆదోని: ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలిసారి ఆదోనిలో కాషాయ జెండా ఎగిరింది. తెదేపా-భాజపా-జనసేన కూటమిలో భాగంగా ఇక్కడి నుంచి భాజపా నేత డా.పీవీ పార్థసారథిని బరిలో దింపారు. ఆయన విజయఢంకా మోగించి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు.

ఆలూరు: తెదేపా అభ్యర్థి బి.వీరభద్ర గౌడ్‌పై 2,851 స్వల్ప ఓట్లతో గెలుపొందిన వైకాపా అభ్యర్థి బి.విరూపాక్షి తొలిసారి శాసన సభకు వెళ్తున్నారు.


రెండోసారి

బనగానపల్లి: 2014లో మొదటిసారి విజయం సాధించిన తెదేపా నేత బీసీ జనార్దన్‌రెడ్డి రెండోసారి వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డిపై విజయం సాధించారు. ప్రస్తుతం మంత్రి వర్గంలో చోటుదక్కింది. రోడ్లు భవనాల శాఖ మంత్రిగా వ్యవహరించనున్నారు.

ఎమ్మిగనూరు: దివంగత మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి వారసుడిగా రాజకీయ రంగప్రవేశం చేసిన బీవీ జయనాగేశ్వరరెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ప్రస్తుతం 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించారు.

ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ రెండోసారి ఎన్నికయ్యారు. గతంలో తన తల్లి శోభానాగిరెడ్డి మృతి చెందడంతో 2014లో జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె 2018 నుంచి 2019 వరకు పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. 

శ్రీశైలం: బుడ్డా రాజశేఖర్‌రెడ్డి 2014లో వైకాపా తరఫున, 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా బరిలో దిగి గెలుపొందారు.


మూడోసారి

పాణ్యం: నియోజకవర్గంలో 25 ఏళ్ల తర్వాత తెదేపా జెండా ఎగిరింది. ఎమ్మెల్యేగా గెలుపొందిన గౌరు చరితారెడ్డి మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఆమె 2004లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2014లో పాణ్యం నియోజకవర్గం నుంచి వైకాపా అభ్యర్థిగా, తాజా ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా బరిలో నిలిచి విజయం సాధించారు.


నాలుగోసారి 

నంద్యాల: తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతూ వచ్చిన ఎన్‌ఎండీ ఫరూక్‌ 20 ఏళ్ల తర్వాత మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో 1985, 1994, 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం నాలుగోసారి గెలుపొందిన ఆయనకు మంత్రి వర్గంలో చోటుదక్కింది.

మంత్రాలయం: పునర్విభజనలో భాగంగా 2009లో మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచీ వై.బాలనాగిరెడ్డే గెలుస్తూ వస్తున్నారు. 2009లో తెదేపా తరఫున, 2014, 2019, 2024లో వైకాపా తరఫున బరిలో నిలిచి గెలుపొందారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని