logo

పరిశ్రమిస్తాం.. యువతకు ఉపాధి కల్పిస్తాం

కృష్ణా.. తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న ప్రాంతం.. గనుల ఖిల్లా.. పది లక్షల హెక్టార్ల సారవంతమైన నేల.. పరిశ్రమల ఏర్పాటుకు దండిగా వనరులు ఉన్నాయి.. పారిశ్రామిక ప్రగతికి చిరునామాలా ఉండేలా ఉమ్మడి కర్నూలు జిల్లాను తీర్చిదిద్దుతాం..

Updated : 21 Jun 2024 04:33 IST

‘ఈనాడు’ ముఖాముఖిలో టీజీ భరత్‌
పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ
ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రగతికి ప్రణాళికలు
ఈనాడు, కర్నూలు

మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న టి.జి.భరత్‌

కృష్ణా.. తుంగభద్ర నదులు ప్రవహిస్తున్న ప్రాంతం.. గనుల ఖిల్లా.. పది లక్షల హెక్టార్ల సారవంతమైన నేల.. పరిశ్రమల ఏర్పాటుకు దండిగా వనరులు ఉన్నాయి.. పారిశ్రామిక ప్రగతికి చిరునామాలా ఉండేలా ఉమ్మడి కర్నూలు జిల్లాను తీర్చిదిద్దుతాం.. వేలాది ఉద్యోగావకాశాల కల్పనకు కృషి చేస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఆహారశుద్ధి శాఖ మంత్రి టి.జి.భరత్‌ పేర్కొన్నారు. గురువారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొంది.. మంత్రిగా పనిచేసే అవకాశం రావడం అదృష్టం.. పారిశ్రామికరంగంపై అవగాహన ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, యువ నేత లోకేశ్‌లు నాకీ అవకాశం ఇచ్చారు.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.. గత ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలు,  ప్రోత్సాహకాలు ఇవ్వలేదు. దీంతో పారిశ్రామిక వేత్తలు ముందుకు రాలేదు.. మా ప్రభుత్వం పరిశ్రమలకు విస్తృతంగా రాయితీలు ఇస్తుంది.. ప్రోత్సాహకాలు అందిస్తుంది.. పారిశ్రామికవేత్తల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం కల్పించి భారీగా పెట్టుబడులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చేపట్టబోయే ప్రగతి ప్రణాళికను వివరించారు. 

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నాయి. 20 వేల ఎకరాల్లో ‘ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌’ (ఓఎంఐహెచ్‌) ప్రాజెక్టుకు తెదేపా హయాంలోనే శ్రీకారం చుట్టాం. హైదరాబాద్‌- బెంగళూరు రహదారి వెంట 11 గ్రామాల పరిధిలో భూమి సేకరించి ఏపీఐఐసీకి అప్పగించారు.. ఇప్పటికే 9,455 ఎకరాల సేకరణ పూర్తైంది. మరో పదివేల ఎకరాలకు పైగా స్థలం అందుబాటులో ఉంది. వందలాది పరిశ్రమలు నెలకొల్పడానికి వీలుంది. అప్పట్లో కంపెనీలూ ముందుకొచ్చాయి.. ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా పట్టించుకోలేదు. బాధ్యతలు తీసుకున్నా. ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని ఓర్వకల్లు పారిశ్రామిక వాడను తీర్చిదిద్దుతాం.

కర్నూలులో గిఫ్ట్‌సిటీ

గుజరాత్‌ తరహాలో మన రాష్ట్రంలో ‘గిఫ్ట్‌ సిటీ’ ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని అడుగుతాం. దీని పరిధిలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే పదేళ్లపాటు ఆదాయపు పన్ను హాలిడే, అతి తక్కువ స్థాయిలో మ్యాట్‌పన్ను, ‘క్యాపిటల్‌ గెయిన్స్‌’ పన్ను నుంచి మినహాయింపులు పొందొచ్చు. అలాంటి చోట్ల పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు. పారిశ్రామికంగా అత్యంత వెనుకంజలో ఉన్న కర్నూలులో గిఫ్ట్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. 


నడవాతో పారిశ్రామికాభివృద్ధి

హైదరాబాద్‌- బెంగళూరు పారిశ్రామిక నడవా పరిధిలోనే కర్నూలు ఉండటం జిల్లాకు ఓ వరంలాంటింది. నడవా అభివృద్ధికి కేంద్రం భారీ ఎత్తున నిధులు కేటాయిస్తోంది. నడవా పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లో భారీ ఎత్తున పారిశ్రామికాభివృద్ధి చెందడానికి వీలుంది. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతుల్ని కల్పిస్తాం. అప్పుడు పారిశ్రామిక వేత్తలు రావడానికి మార్గం సుగమమవుతుంది.


సీడ్‌ పార్కుపై దృష్టి

తంగడంచలో 623 ఎకరాల్లో రూ.670 కోట్లతో మెగా సీడ్‌ పార్కు ఏర్పాటుకు తెదేపా హయాంలో పునాది వేశాం. అమెరికాలోని అయోవా విశ్వవిద్యాలయ సహకారంతో సీడ్‌ పార్కు ఏర్పాటు చేయాలని, రూ.670 కోట్ల మేర ఖర్చవుతుందని అప్పట్లో అధినేత చంద్రబాబు నిర్ణయించారు.  అందుబాటులోకి వస్తే యువతకు ఉపాధి దొరుకుతుంది.. రైతులకు మేలు రకం విత్తనాలు అందుబాటులోకి వస్తాయి.


‘గనుల’ ఆధారిత పరిశ్రమలకు పూర్వ వైభవం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేల హెక్టార్లలో గనులు విస్తరించి ఉన్నాయి. గనుల ఆధారిత పరిశ్రమల్లో గతంలో వేలాది మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ప్రస్తుతం పలు పరిశ్రమలు మూతపడ్డాయి. బేతంచెర్ల, అవుకు, రామాపురం ప్రాంతాల్లో పాలిష్‌ పరిశ్రమలకు తరలిస్తున్నారు. డెడ్‌రెంట్, విద్యుత్తు బిల్లు పెరగడం వారికి ఇబ్బందికరంగా మారినట్లు తెలుస్తోంది. గనుల మంత్రితో కలిసి చర్చించి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రయత్నిస్తా. ఉమ్మడి జిల్లా నుంచి నాపరాయి, వివిధ రకాల ఫ్లోరింగ్‌ టైల్స్‌ ఉత్పత్తుల ఎగుమతులు జరిగేలా చర్యలు తీసుకుంటాం. 


టమాట జ్యూస్‌ కర్మాగారం కల సాకారం చేస్తాం

గతంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పదివేల హెక్టార్లలో టమాటా సాగయ్యేది.. ప్రస్తుతం 4-6 వేల హెక్టార్లకు పడిపోయింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తికొండ, దేవనకొండ, ప్యాపిలి, ఆస్పరి, మద్దికెర, బిల్లేకల్లు తదితర ప్రాంతాల్లో టమాట అత్యధికంగా సాగు చేస్తున్నారు. ఏటా రెండు నెలలు మినహా మిగిలిన రోజుల్లో నష్టాలే చవి చూస్తున్నారు. ధరలు లేని సమయంలో లాభం పొందేలా జ్యూస్‌ పరిశ్రమ ఏర్పాటు కలను సాకారం చేస్తాం.


ఉల్లిపొడి పరిశ్రమలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ఉల్లి అత్యధికంగా కర్నూలులోనే సాగవుతోంది. గిట్టుబాటు ధర దక్కక రైతులు నష్టపోతున్నారు... పొలాల్లోనే వదిలేస్తున్న ఘటనలు ఉన్నాయి. ఉల్లిపొడికి జాతీయస్థాయిలో మార్కెట్లో గిరాకీ ఉంది. ఉల్లి రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఉల్లిపొడి తయారీ సంస్థల ఏర్పాటుకు కృషి చేస్తాం. వీటిని అతి తక్కువ పెట్టుబడితో కుటీర పరిశ్రమల్లా ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలితంగా సొంత గ్రామంలోనే ఉపాధి పొందడంతో పాటు ఇతరులకూ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. రైతులకూ అదనపు ఆదాయం సమకూరినట్లవుతుంది.


సమృద్ధిగా నీరుంది

పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే తగిన పరిమాణంలో నీరు అందుబాటులో ఉండాలి. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు ముచ్చుమర్రి నుంచి పైపులైన్లు ఏర్పాటు చేసి నీటిని తీసుకొస్తాం. ఉమ్మడి జిల్లాలోని పారిశ్రామికవాడల్లో చాలా స్థలాలు ఖాళీగా ఉన్నా పరిశ్రమలు మాత్రం ఏర్పడలేదు. ఆయా పారిశ్రామికవాడల్లో అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తాం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు