logo

59,207 హెక్టార్లలో పంట నష్టం

రబీలో జిల్లా వ్యాప్తంగా 59,207 హెక్టార్లలో 33 శాతానికి మించి పంట నష్టం జరిగిందని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు చెప్పారు. జిల్లాలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన కరవు పరిస్థితులను ఆయన కేంద్ర కరవు బృందానికి వివరించారు.

Published : 21 Jun 2024 04:16 IST

రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : రబీలో జిల్లా వ్యాప్తంగా 59,207 హెక్టార్లలో 33 శాతానికి మించి పంట నష్టం జరిగిందని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు చెప్పారు. జిల్లాలో 2023- 24 ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన కరవు పరిస్థితులను ఆయన కేంద్ర కరవు బృందానికి వివరించారు. స్థానిక కలెక్టరేట్‌లో కరవు పరిస్థితుల అధ్యయనంపై కేంద్ర కరవు బృందం సభ్యులు గురువారం వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకుముందు కరవు పరిస్థితులపై ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను కేంద్ర బృందం సభ్యులు వ్యయ విభాగం డైరెక్టర్‌ చిన్మయ పుండ్లిక్‌ రావు గాట్మేర్, తాగునీరు, పారిశుద్ధ్య శాఖ డిప్యూటీ సలహాదారు ఆశిష్‌ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి అరవిందకుమార్‌ సోని తిలకించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ వారికి కరవు పరిస్థితులను వివరించారు. రబీకి సంబంధించి ప్రభుత్వం 13 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించిందని తెలిపారు. శనగ, మినుము, కంది, పొగాకు, జొన్న, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. పంట సాగు చేసిన 58,011 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వెల్లడించారు. 2023- 24 సంవత్సరంలో అక్టోబరు నుంచి మే వరకు 21.14 శాతం తక్కువ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. భూగర్భ జలాలు గతేడాది మే నెలలో 6.84 మీటర్ల లోతులో ఉండగా నవంబరు నాటికి 7.01 మీటర్లకు పడిపోయాయన్నారు. ఈ ఏడాది మేలో 11.42 మీటర్ల లోతుకు జలాలు వెళ్లాయన్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశామన్నారు. తీవ్రమైన కరవు నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ నిబంధనల ప్రకారం జిల్లాలో 59,207 హెక్టార్లకు రూ.57.30 కోట్ల పెట్టుబడి రాయితీ కోసం ప్రతిపాదనలు పంపినట్లు వివరించారు. జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ, ఉద్యానవన శాఖ అధికారి నాగరాజు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ మనోహర్, భూగర్భ జల శాఖ డీడీ రఘురాం, ఇరిగేషన్‌ ఎస్‌ఈ వెంకటరమణ, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి, ఆర్డీవో మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రైతుల అభిప్రాయాలు ప్రభుత్వానికి నివేదిస్తాం

కోవెలకుంట్ల, న్యూస్‌టుడే: కరవు మండలాల్లో పంటలను నష్టపోయిన రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని కేంద్ర కరవు బృందం తెలిపింది. గురువారం కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడులో కేంద్ర కరవు బృందం జిల్లా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో పర్యటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని