logo

శ్రమకు ఫలితం.. ఉపకారం

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్‌మెరిట్‌ స్కాలర్‌షిప్‌) కింద 8వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు అవకాశం కల్పించింది.

Published : 22 Jun 2024 02:57 IST

ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్షలో ఎమ్మిగనూరు విద్యార్థినుల ప్రతిభ
ఈ ఏడాది 23 మంది బాలికలు ఎంపిక

ఎంపికైన బాలికలతో ఎంఈవో, హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం

ఎమ్మిగనూరు, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్‌ఎంఎంఎస్‌ (నేషనల్‌ మీన్‌మెరిట్‌ స్కాలర్‌షిప్‌) కింద 8వ తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థుల వరకు అవకాశం కల్పించింది. దీని కింద ఏటా జులై నెలలో రుసుము చెల్లిస్తే నవంబరులో పోటీ పరీక్ష నిర్వహిస్తారు. ప్రధానంగా 180 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఏడు, ఎనిమిది తరగతులకు చెందిన సైన్స్, గణితం సబ్జెక్టులు ఉంటాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నాలుగేళ్లపాటు ఉపకార వేతనం అందజేస్తారు. వీరికి 9వ తరగతి నుంచి ఇంటర్‌ ద్వితీయ, (ఇతర కోర్సులకు రెండేళ్లపాటు) రూ.15 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలో జమ చేస్తారు. ఎమ్మిగనూరు పట్టణంలోని మాచాని సోమప్ప బాలికల జడ్పీ ఉన్నత పాఠశాలలో 60 మందికిపైగా విద్యార్థినులు పరీక్షకు హాజరయ్యారు. ఇందులో  సాహితీ, రేణుక, అక్షయ, రత్నదేవి, హరిప్రియ, కల్పన, విజయలక్ష్మి, మిత్రబృందం, జ్ఞానేశ్వరి, అనీఫ్, అలీమ, జ్యోతి, ప్రియాంక, ఉషా, షాలినీ ఎంపికయ్యారు. ఈ పాఠశాల నుంచి మొత్తం 23 మంది బాలికలు ఎన్‌ఎంఎంఎస్‌కు ఎంపికయ్యారు.

రోజూ 6 గంటలు సాధన చేశా
- లలిత, 109 మార్కులు

మా అమ్మ పద్మ చేనేత కార్మికురాలు. నాన్న వీరేశ్‌ డ్రైవర్‌గా పని చేస్తారు. అమ్మ రోజూ మగ్గంపై రాత్రి 8 గంటల వరకు పని చేస్తుంది. ఆమె కష్టం చూడలేక నా చదువుకు ఆర్థిక భారం తగ్గించుకోవాలనున్నా భౌతిక, రసాయన శాస్త్రాలు, మెంటల్‌ ఎబిలిటీ సబ్జెక్టులను పదే పదే ప్రాక్టీసు చేశాను. రోజూ 6 గంటలపాటు చదివాను. వచ్చే ఉపకార వేతనంతో చదువుతోపాటు కొంత కుటుంబానికి ఖర్చు చేస్తా.

రోజూ ఐదు గంటలు చదివా
- హేమలత, 123 మార్కులు

మా నాన్న చంద్రశేఖర్‌ డ్రైవర్, అమ్మ చంద్రకళ ఇంట్లో కుటీర పరిశ్రమ నిర్వహిస్తారు. 8వ తరగతిలో (గతేడాది) పరీక్ష రాశాను. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఉపకార వేతనం కోసం బాగా చదవాలని అమ్మానాన్నలు ప్రోత్సహించారు. పాఠశాలలో ఉపాధ్యాయులు రెండు గంటలపాటు సమయం తీసుకుని బోధించారు. వాటిపై పదే పదే పరీక్షలు నిర్వహించారు. పరీక్ష కోసం రోజూ ఐదు గంటలపాటు చదివాను. ఉపాధ్యాయులు బోధించిన అంశాలను ప్రాక్టీస్‌ చేశాను. మెంటల్‌ ఎబులిటీ కింద అనుమానాలను మా ఉపాధ్యాయుడు దగ్గరుండి అర్థమయ్యేలా బోధించారు. నాకు 123 మార్కులు వచ్చాయి. మా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు.

ఆరు నెలలు కష్టపడ్డా
- రాజేశ్వరి, 119 మార్కులు

మా అమ్మ శారద చేనేత కార్మికురాలు, నాన్న హమాలీ పని చేస్తారు. అమ్మ మగ్గంపై పగలు, రాత్రి 10 గంటలపాటు మా కోసం కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని చూసి నా చదువుకయ్యే ఖర్చు భారాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంటుందని ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాశాను. లక్ష్యాన్ని సాధించేందుకు ఆరు నెలలు పగలు, రాత్రి కష్టపడి చదివాను. మా నాన్న ఈరన్న హమాలీ పని చేసి వచ్చి రాత్రిపూట నాకు ఏమైనా అర్థంకాని అంశాలుంటే చెప్పేవారు. దాంతో 119 మార్కలు సాధించాను. దీంతో వచ్చే ఉపకార వేతనంతో నా చదువు భారం తగ్గుతుందని ఆనందంగా ఉంది.

స్నేహితులతో కలిసి చర్చించుకునేది
- కీర్తన, 115 మార్కులు

మా అమ్మానాన్నలు సుమిత్ర, రామకృష్ణ చిన్న వ్యాపారం చేస్తారు. వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుంది. నా చదువుకు ఏటా రూ.20 వేలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఎన్‌ఎంఎంఎస్‌ పరీక్ష రాస్తే నా ఇబ్బంది తొలగిపోతుందని భావించా. మా స్నేహితులతో కలిసి రోజూ చదివేదాన్ని. బిట్లు గ్రూప్‌ డిస్కస్‌ చేసేవాళ్లం. నాలుగు నెలలపాటు కష్టపడ్డాను. మా ఉపాధ్యాయులు రోజూ సాయంత్రం రెండు గంటలపాటు ప్రత్యేక తరగతులను నిర్వహించి శిక్షణ ఇచ్చారు. వారు బోధించిన పాఠ్యాంశాలతోనే పరీక్షలో 115 మార్కులు సాధించి ఉపకార వేతనానికి ఎంపికయ్యా.  
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని