logo

ఉచిత విద్య.. మిథ్య

పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించేందుకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరికలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.

Updated : 22 Jun 2024 05:53 IST

ప్రైవేట్, కార్పొరేట్‌ బడుల్లో సక్రమంగా అమలు కాని పేదల కోటా
ఉమ్మడి జిల్లాలో రెండు విడతల్లో 3,206 మందికే ప్రవేశాలు

ప్రైవేట్‌ పాఠశాలల్లో అభ్యసిస్తున్న విద్యార్థుల

డోన్‌పట్టణం, న్యూస్‌టుడే: పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందించేందుకు ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరికలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పేద, బడుగు, బలహీన వర్గాల వారి పిల్లలకు ఉచిత విద్య కోటాను అందిస్తోంది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారితో పాటు దివ్యాంగులకు రిజర్వేషన్ల ప్రకారం 25 శాతం సీట్లను కేటాయించాలి. కానీ చాలా యాజమాన్యాలు పాఠశాలల్లో నిబంధనల ప్రకారం ఆయాసీట్ల భర్తీకి ఉత్సుకత  చూపకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కొన్ని పాఠశాలల యాజమాన్యాలు రుసుములను ప్రభుత్వం చెల్లిస్తుందో, లేదో అన్న సందేహంతో పిల్లలను చేర్పించుకునేందుకు ముందుకు రావడం లేదు. అనేక కొర్రీలతో విద్యార్థుల తల్లిదండ్రులను వేధిస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు.

చేరికలు ఇలా...

2024-25 ఏడాదిలో తొలి విడతలో భాగంగా కర్నూలు జిల్లాలో 1926 మంది దరఖాస్తు చేసుకుంటే 1,464 మంది ప్రవేశాలు పొందారు. రెండో విడతలో 1,255 మందికి గాను 818 మంది చేరారు.

నంద్యాల జిల్లాలో 1,867 మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలి విడతలో 960 మందికి గానూ 721 మంది చేరారు. రెండో విడతలో భాగంగా 302 మందికి గాను 203 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఉమ్మడి జిల్లాలో ఒకటో తరగతిలో 3,793 మంది దరఖాస్తు చేసుకుంటే 3,206 మంది చేరారు.

వివరాలు ఇలా...!

ఉమ్మడి జిల్లాలో 1,017 వరకు ప్రైవేట్, కార్పొరేట్, సీబీఎస్‌ఈ పాఠశాలలు ఉన్నాయి. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలల్లో చేరితే వారి ఫీజులను కూడా ప్రభుత్వమే ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలకు నేరుగా చెల్లిస్తుంది పట్టణ ప్రాంతాల్లో ఒక్కో విద్యార్థికి రూ.8 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.6,500ల ప్రకారం ప్రభుత్వం భరిస్తుంది. కానీ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఒకటో తరగతికి అంతకన్నా ఎక్కువగానే ఫీజులు ఉండటంతో ఇవి ఏ మూలకు సరిపోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వం ఫీజులను చెల్లించేదెప్పుడో తెలియని పరిస్థితి నెలకొందని, ఉచిత విద్యాహక్కు చట్టం కింద చేరిన పిల్లలకు యాజమాన్యాలు విద్య సక్రమంగా అందిస్తుందా...? లేదా అనే సందేహాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. దీంతో చాలా మంది ప్రైవేట్‌ పాఠశాలల్లో చేర్పించే కన్నా..ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవనే అభిప్రాయానికి వస్తున్నారు. అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో ఉన్నత లక్ష్యం నెరవేరడం లేదు.

మూడో విడత ప్రవేశాలకు కృషి
- కె. సుధాకర్‌రెడ్డి, జిల్లా విద్యాధికారి, నంద్యాల

ప్రైవేట్‌ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్యను ప్రభుత్వం అందిస్తోంది. రిజర్వేషన్ల ప్రకారం సీట్లను కేటాయిస్తున్నాం. ప్రైవేట్‌ పాఠశాలల నుంచి ఇబ్బందులు వస్తే తమకు ఫిర్యాదు చేయాలి. ఇబ్బందులకు గురి చేసే యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. మొదటి, రెండో విడతల్లో ఎవరైనా వివిధ కారణాలతో చేరకపోయి తిరిగి చేరడానికి వస్తే వారిని తప్పనిసరిగా ఆయా పాఠశాలల యాజమాన్యాలు చేర్చుకోవాలి. ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలి.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని