logo

తీరనున్న ఇంటర్‌ ఇక్కట్లు

ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇంటర్‌ విద్యను పూర్తిగా నీరుగార్చింది. పుస్తకాల పంపిణీని పూర్తిగా పక్కన పెట్టింది. నాలుగేళ్లు పుస్తకాల్లేకుండానే చదువులు కొనసాగించాల్సి వచ్చింది..అధ్యాపకుల నియామకంలోనూ అలసత్వం వహించించారు.

Published : 22 Jun 2024 03:34 IST

నాలుగేళ్ల తర్వాత పుస్తకాలు

చదువుకుంటున్న విద్యార్థులు

ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఇంటర్‌ విద్యను పూర్తిగా నీరుగార్చింది. పుస్తకాల పంపిణీని పూర్తిగా పక్కన పెట్టింది. నాలుగేళ్లు పుస్తకాల్లేకుండానే చదువులు కొనసాగించాల్సి వచ్చింది..అధ్యాపకుల నియామకంలోనూ అలసత్వం వహించించారు. కళాశాలల్లో అవసరమైన సదుపాయాలు కల్పించడంలోనూ విఫలమైంది. ఇవన్నీ ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం నూతన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇంటర్‌ విద్యపై దృష్టి సారించింది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, ఏకరూప దుస్తులు ఇచ్చేందుకు జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపారు.

న్యూస్‌టుడే, కర్నూలు విద్య

ప్రతిపాదనలిలా..

  • కర్నూలు జిల్లాలో ఉన్న 22 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాదికి 4,921 సెట్లు, రెండో ఏడాదికి 4,178 సెట్ల పాఠ్య పుస్తకాలు అవసరమని జిల్లా ఇంటర్‌ బోర్డు అధికారులు నివేదికలు పంపారు. జిల్లాలో ఉన్న 21 కేజీబీవీల్లో సుమారు 2,100 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆదర్శ బడుల్లో 1,800 మంది చదువుతున్నట్లు అధికారులు తెలిపారు. కేజీబీవీ, ఆదర్శ విద్యాలయాల నుంచి ఇంకా వివరాలు సేకరించాల్సి ఉందని ఏడీ-2 శ్రీనివాసులు తెలిపారు.
  • నంద్యాలలోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మొదటి ఏడాదికి 3,052 సెట్లు, రెండో ఏడాదికి 2,185 సెట్ల పాఠ్య పుస్తకాలు అవసరమని  నివేదించారు.

జులై 15 నాటికి అందేలా ప్రణాళిక

కర్నూలు జిల్లాలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలతోపాటు 21 కేజీబీవీలు, 16 ఆదర్శ విద్యాలయాల్లో ఇంటర్మీడియట్‌ తరగతులు నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లాలో 27 కేజీబీవీలు, 19 ఆదర్శ బడుల్లో ఇంటర్‌ పాఠాలు బోధిస్తున్నారు. ఇవికాక సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో ఇంటర్‌ విద్య సాగుతోంది. ప్రథమ సంవత్సరంలో ఎన్ని సీట్లున్నాయి.. ఇప్పటివరకు ఎంతమంది ప్రవేశాలు పొందారు.. ఇంకనూ ఎంతమంది చేరే అవకాశముంది.. తదితర వివరాలు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారులతోపాటు కేజీబీవీ, ఆదర్శ బడులు, సంక్షేమ బడుల్లో ఉన్న ఇంటర్మీడియట్‌ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జులై 15వ తేదీ నాటికి పుస్తకాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

వీరి వివరాలేవీ

కేజీబీవీలు, ఆదర్శ బడుల్లో ఉన్న ఇంటర్‌లో ఎన్ని అడ్మిషన్లు జరిగాయి, ఎన్ని ఖాళీలు ఉన్నాయన్న వివరాలతోపాటు ఎన్ని పాఠ్య పుస్తకాలు అవసరమని లెక్కించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా విద్యాశాఖ అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కేజీబీవీ, ఆదర్శ బడుల్లో ఉన్న ఇంటర్‌ చదువుతున్న విద్యార్థుల వివరాలు తమ వద్ద ఉండవని.. మండల కేంద్రం నుంచి నేరుగా రాష్ట్రానికే వెళ్తాయని పొంతన లేని సమాధానం చెబుతుండటం గమనార్హం. దీంతో ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కేవలం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల సమాచారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి చేరినట్లు సమాచారం. ఫలితంగా తమ పిల్లలకు పుస్తకాలు అందే పరిస్థితి లేదంటున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని