logo

మల్లన్న క్షేత్రం.. ఉద్యోగుల పెత్తనం

తిరుమల తర్వాత అత్యధిక భక్తులొచ్చే శ్రీశైల మల్లన్న సన్నిధిలో కొందరు ఉద్యోగులు వైకాపా నేతలతో అంటకాగారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా అక్రమార్జనకు అలవాటు పడ్డారు.

Updated : 22 Jun 2024 05:53 IST

ఐదేళ్లూ వైకాపాకు వంతపాడారు
అంటకాగిన వారికి బదిలీ సిద్ధం

తిరుమల తర్వాత అత్యధిక భక్తులొచ్చే శ్రీశైల మల్లన్న సన్నిధిలో కొందరు ఉద్యోగులు వైకాపా నేతలతో అంటకాగారు. సామాన్య భక్తుల్ని పట్టించుకోకుండా అక్రమార్జనకు అలవాటు పడ్డారు. అలాంటి అధికారుల జాబితాను ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రభుత్వానికి చేరవేసింది. ఈ నేపథ్యంలో శ్రీశైల దేవస్థానం పరిధిలో ఉద్యోగుల అంతర్గత బదిలీలకు జాబితా సిద్ధమైనట్లు సమాచారం. రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. దీర్ఘకాలం పని చేస్తున్న పర్యవేక్షకులు, గుమస్తాలకు స్థానచలనం కలిగించనున్నారు. ఉపాలయాల్లో విధులు నిర్వహించే కిందిస్థాయి సిబ్బందినీ బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేవస్థానంలో కీలకమైన ఆలయ విభాగం, వసతి, రెవెన్యూ, పరిపాలనా విభాగాల్లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది.

న్యూస్‌టుడే, శ్రీశైలం ఆలయం

పకడ్బందీ ప్రక్షాళన అవసరం

జూనియర్‌ అసిస్టెంట్‌ నుంచి ఏఈవో స్థాయి వరకు ప్రతి ఉద్యోగి ఉద్యోగోన్నతి పొందాలంటే కొన్ని అర్హతలు ఉన్నాయి. అకౌంట్స్, దేవాదాయ చట్టం వంటి అంశాల్లో తప్పని సరిగా ఉత్తీర్ణత కావాలి. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తున్నారు తప్ప కొన్ని విభాగాలకే ఉద్యోగుల సేవలు పరిమితమవుతున్నాయి. దేవస్థానంలో 16 మంది పర్యవేక్షకులు, 20 మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 21 మంది జూనియర్‌ అసిస్టెంట్లు ఉంటే కేవలం అందులో కొందరే అకౌంట్స్‌ విభాగంలో పని చేశారు.  కీలకమైన ఆడిట్‌ విభాగంలో అభ్యంతరాలకు సమాధానమిచ్చే నైపుణ్యం కలిగిన సిబ్బందిని నియమించాల్సి ఉంది. దేవస్థానంలో ఉద్యోగోన్నతులు, దుకాణాల వ్యవహారాలపై పెండింగ్‌లో ఉన్న కీలకమైన కేసులు పరిష్కారమయ్యేలా ప్రత్యేక దృష్టి సారించాలి. పరిపాలన విభాగాన్ని పర్యవేక్షించే ప్రతి ఒక్క ఉద్యోగి అన్ని విభాగాల్లో పని చేసే విధంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలి.

ఇంజినీరింగ్‌ విభాగం ఎంతో ముఖ్యం

ఇంజినీరింగ్‌ విభాగంలో క్యాడర్‌ స్ట్రెంత్‌ వింతైన రీతిలో సాగుతోంది. ఏఈలను ఇన్‌ఛార్జి డీఈలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఏఈలు నేరుగా ఇన్‌ఛార్జి అనే హోదాలు పేర్కొనకుండా డీఈలుగా సంతకాలు చేస్తున్నారు. వాస్తవానికి దేవస్థానంలో సివిల్, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో డీఈల కొరత ఉంది. డీఈలను డిప్యుటేషన్‌ కింద నియమించుకునే అవకాశం ఉండటంతో ఇటు ఈవోలు, దేవాదాయశాఖ కమిషనర్లు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. టెండర్ల వ్యవహారంలో భారీగా అక్రమాలు జరుగుతున్నాయి. ఒకే పనిని రెండు నుంచి మూడుగా విభజించి టెండర్లు పిలుస్తూ ఆలయ ఖజానాకు గండి కొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రచురణలు - ప్రజాసంబంధాలు

దేవస్థానంలో ప్రచురణలు-ప్రజాసంబంధాల విభాగాలు కీలకమైనవి. 2011 క్యాడర్‌ స్ట్రెంత్‌ ద్వారా ప్రజాసంబంధాల విభాగాన్ని అధికారికంగా అమలు చేస్తున్నారు. ఏళ్ల పాటు ప్రచురణల విభాగం పర్యవేక్షించే సంపాదకుడికి ప్రెస్‌నోట్లు రూపకల్పన బాధ్యతలను అదనంగా కేటాయిస్తున్నారు. దీనివల్ల సంపాదకుడు కేవలం శ్రీశైలప్రభ సంచిక విధులకే పరిమితమవుతున్నారు. దేవస్థానానికి చెందిన పుస్తకాలు, గ్రంథాలు పునఃముద్రించాలంటే సంపాదకుడికి పూర్తిస్థాయిలో ప్రచురణల బాధ్యతలు అప్పగించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజాసంబంధాల అధికారి, సహాయ ప్రజాసంబంధాల అధికారి సంయుక్తంగా భక్తులకు దేవస్థానం సేవలు, పూజలు, దర్శనం వేళలు, ప్రచార కార్యక్రమాలు ఆధునిక కాలానికి అనుగుణంగా తెలిసేలా చర్యలు తీసుకోవాలి.

ఎన్నికల ముందు డీఈవో ఖాళీ భర్తీ

 శ్రీశైల దేవస్థానంలో 20 ఏళ్ల కిందట ఉన్న డీఈవో పోస్టును గతంలో రద్దు చేశారు. రెగ్యులర్‌ ఉద్యోగుల భర్తీపై నిషేధం విధించడంతో పాటు ఉద్యోగ విరమణ చేసే నాలుగో తరగతి ఉద్యోగాలు రద్దు చేసి, వారి స్థానాల్లో పొరుగుసేవల కింద నియామకాలు చేస్తున్నారు. 2011, 2013 క్యాడర్‌స్ట్రెంత్‌ జాబితాల్లో డీఈవో పోస్టును పేర్కొనలేదు. దేవాదాయశాఖలో కొందరు అధికారులు దొంగచాటుగా డీఈవో పోస్టును భర్తీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని అడ్డంపెట్టుకొని తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్‌ శ్రీశైల దేవస్థానానికి డీఈవో హోదాలో అధికారిణిని నియమించారు. గతంలో రద్దైపోయిన నాలుగో తరగతి పోస్టుల భర్తీకి మాత్రం మోకాలడ్డుతున్నారు. ఇలా దేవాదాయశాఖలో ద్వంద్వ పాలనను అరికట్టేందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని