logo

తెలుగుకు వెలుగునిచ్చిన మహోన్నత వ్యక్తి

పాత్రికేయ వృత్తికి సమాజంలో ఎనలేని గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు.

Updated : 22 Jun 2024 05:56 IST

పాత్రికేయ రంగంలో రారాజు రామోజీ
ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ఆధ్వర్యంలో ఘన నివాళి

రామోజీరావుకు నివాళులర్పిస్తున్న ఏపీడబ్ల్యూజేఎఫ్‌ ప్రతినిధులు

కర్నూలు నగరం, న్యూస్‌టుడే : పాత్రికేయ వృత్తికి సమాజంలో ఎనలేని గౌరవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. తెలుగు భాషను ప్రోత్సహిస్తూ.. తెలుగు సాహిత్యానికి ఎంతో సేవచేసిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు. కర్నూలులోని టీజీవీ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్మలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఏపీడబ్ల్యూజేఎఫ్‌) కర్నూలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు సంస్మరణ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ముందుగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. జిల్లా కన్వీనరు జె.నాగేంద్ర అధ్యక్షతన జరిగిన సభలో వివిధ పత్రికల ప్రతినిధులు, కవులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య మాట్లాడుతూ నిత్యం ఎన్నో మార్పులు తీసుకొస్తూ పాఠకులను ఆకర్షించేలా ‘ఈనాడు’ పత్రికను తీర్చిదిద్దారని చెప్పారు. పత్రికా రంగంతోపాటు వివిధ రంగాలను సైతం రామోజీరావు తనదైన శైలిలో ప్రథమ స్థానంలో నిలిపారని చెప్పారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగారు మోహన్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి ‘ఈనాడు’ ఉత్తమ సేవలు అందించిందని, తెలుగు భాషపై మరింత పట్టు సాధించేందుకుగాను ప్రత్యేక నిఘంటువు ఏర్పాటు చేసేందుకు రామోజీరావు కృషి చేశారని చెప్పారు. ‘ఈనాడు’ పత్రిక చదివితే తెలుగు బాగా నేర్చుకోవచ్చనేలా వాడుక భాషను పత్రికా భాషగా మార్చి జర్నలిజానికి కొత్త నిర్వచనం తీసుకొచ్చారన్నారు. అందరూ రామోజీరావును స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. ఏపీడబ్ల్యూజేఎఫ్‌ జిల్లా కన్వీనరు నాగేంద్ర మాట్లాడుతూ పత్రికా రంగంలో రామోజీరావు ఓ ప్రత్యేకతను చాటుకున్నారని పేర్కొన్నారు. గీతాంజలి గ్రూపు సంస్థల అధినేత పెరుగు విజయవర్ధనరెడ్డి, సాహితీవేత్త బసవరాజు, పాత్రికేయులు బసప్ప, వినయ్‌కుమార్‌ తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో కన్వీనర్‌ రమేష్, బ్రహ్మయ్య, వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని