logo

ఉరిమే ఉత్సాహం.. పట్టా ప్రదానోత్సవం

దేశ అభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్‌ అన్నారు. విద్యార్థి దశ నుంచే ఆశయాలు ఉన్నతంగా ఉన్నప్పుడే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందన్నారు.

Published : 23 Jun 2024 03:48 IST

ఘనంగా ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాల స్నాతకోత్సవం


మాట్లాడుతున్న కర్నూలు ట్రిపుల్‌ ఐటీ కళాశాల డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి

కర్నూలు విద్య, న్యూస్‌టుడే : దేశ అభివృద్ధిలో యువ ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని నీతి ఆయోగ్‌ సభ్యుడు విజయ్‌కుమార్‌ సరస్వత్‌ అన్నారు. విద్యార్థి దశ నుంచే ఆశయాలు ఉన్నతంగా ఉన్నప్పుడే కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుందన్నారు.  కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న ట్రిపుల్‌ ఐటీ (డీఎం) కళాశాలలో 6వ స్నాతకోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఆర్టిఫిషియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డేటా సైన్సు, కంప్యూటర్‌ సైన్సు అండ్‌ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్, మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత సాధించిన 143 మంది విద్యార్థులకు డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి ఆధ్వర్యంలో డిగ్రీ పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజయకుమార్‌ సరస్వత్‌ మాట్లాడుతూ ప్రణాళికతో చదివితే అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చన్నారు.

ప్రతిజ్ఞ చేస్తున్న యువ ఇంజినీర్లు

కళాశాల డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీ కళాశాల క్యాంపస్‌లో చదువుతున్న విద్యార్థులకు అన్నిరకాల వసతులు కల్పిస్తున్నామన్నారు. క్యాంపస్‌ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో చేయూతనిచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థులను చదువుకు మాత్రమే పరిమితం చేయకుండా క్రీడల్లో రాణించేలా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇండోర్‌ స్టేడియం అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఉన్నత్‌ భారత్‌ అభయాన్‌ కింద ఐదు గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

పట్టాలు అందుకున్న ఆనందంలో..

ప్రణాళికతో లక్ష్య సాధన సొంతం

సీఎస్‌ఈలో ఉత్తమ మార్కులు సాధించడంతోపాటు బ్రాంచి టాపర్‌గా రాణించడం సంతోషంగా ఉంది. దేశంలో ఉన్న ట్రిపుల్‌ ఐటీ కళాశాలల్లోకల్లా కర్నూలు కళాశాల అగ్రస్థానంలో ఉండడంతో ఇక్కడ చదవాలన్న కోరికతో వచ్చా. మాది ఉత్తరప్రదేశ్‌. నాన్న అవుదేష్‌ యాదవ్‌ వ్యాపారిగా రాణిస్తూ నన్ను చదివించారు. నాన్న కష్టాన్ని వృథా చేయకుండా సమయపాలనతో ముందుకు సాగా. ప్రొఫెసర్లు, అధ్యాపకుల పర్యవేక్షణలో లక్ష్యాలు నిర్దేశించుకుని చదివా. చిన్నప్పటి నుంచి కష్టపడేతత్వాన్ని అమ్మ రాగన యాదవ్‌ నేర్పించారు. దీనిని అలవాటు చేసుకోవడంతోనే చదువులో రాణించగలిగా. భవిష్యత్తులో నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలన్నదే లక్ష్యం.

 పి.యాదవ్, సీఎస్‌ఈ

మంచి కంపెనీ స్థాపిస్తా

పాఠశాల స్థాయిలో నిర్వహించిన ప్రదర్శనల్లో రాణించడంలో ఇబ్బందులు పడ్డా. అప్పటినుంచి సమాజంలో నెలకొన్న సమస్యలపై వివిధ ప్రాజెక్టులు రూపొందించాలన్న తపన ఏర్పడింది. అవన్నీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ టాపర్‌గా.. క్యాంపస్‌ టాపర్‌గా రాణించేందుకు దోహదపడ్డాయి. ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో చేరినప్పటి నుంచి నేటి వరకు అధ్యాపకుల మార్గదర్శకాలే నన్ను ఈరోజు ఉన్నతస్థాయికి తీసుకొచ్చాయి. మేము కర్నూలు నగరంలోని మారుతి రెసిడెన్సీలో ఉంటున్నాం. నాన్న నరసింహులు చిన్నతనంలోనే చనిపోయారు. అమ్మ వెంకటలక్ష్మి గృహిణి. చదువుపై మక్కువతో ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకున్నా. యూఎస్‌ఏలో ఉన్నత చదువు చదవాలన్నదే అమ్మ ఆశయం. చదువు పూర్తైన తర్వాత మంచి కంపెనీ స్థాపించి పలువురికి ఉపాధి కల్పిస్తా.

 వై.సాయి గణేశ్యామ్, కర్నూలు

నాన్న కష్టాన్ని గుర్తించా

మాది నెల్లూరు జిల్లా. నాన్న వెంకటేశ్వర్లు వ్యాపారి. నాన్న పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని జీవితంలో ఎదగడంతోపాటు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని నిన్న నిర్ణయించుకున్నా. అమ్మ కల్యాణి గృహిణి. కర్నూలు ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో ఈఎస్‌ఈ పూర్తి చేయడం సంతోషంగా ఉంది. కష్టపడి చదివి బ్రాంచి టాపర్‌గా రాణించడంతో బంగారు పతకం సొంతమైంది. ప్రస్తుతం బెంగళూరులోని ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్నా. భవిష్యత్తులో పీహెచ్‌డీ చేయాలన్నదే లక్ష్యం.

 ఐ.శ్రీప్రియ, ఈఎస్‌ఈ

ఇంజినీరింగ్‌ అంటే భయమేసేది

ఇంజినీరింగ్‌ కోర్సు చదవాలన్న ఇష్టం ఉన్నప్పటికీ ప్రవేశ పరీక్ష సమయంలో అనేక ఇబ్బందులు పడ్డా. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహంతో ప్రవేశ పరీక్షలో అర్హత సాధించా. మాది గుంటూరు ప్రాంతం. నాన్న శ్రీధర్‌ కుమార్‌ వ్యాపారం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. అమ్మ శారద గృహిణి. హైదరాబాద్‌ ఐఐటీలో పీహెచ్‌డీ చేయాలన్నదే లక్ష్యం. అనంతరం మంచి ఉద్యోగంలో స్థిరపడి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండడంతోపాటు సేవ చేస్తా. విద్యార్థినుల విభాగంలో టాపర్‌గా రావడంతో బంగారు పతకం లభించింది.

 వర్ష, సీఎస్‌ఈ, గుంటూరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని