logo

ప్రాణం తీసిన కలుషిత జలం

జూపాడుబంగ్లా మండలం చాబోలు గ్రామస్థులను అతిసార వ్యాధి వణికిస్తోంది. వారం రోజులుగా 30 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు.

Published : 23 Jun 2024 03:48 IST

చాబోలులో ప్రబలిన అతిసారం
30 మందికి అస్వస్థత.. ఒకరి మృతి

మృతిచెందిన నాగన్న (పాతచిత్రం)

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే : జూపాడుబంగ్లా మండలం చాబోలు గ్రామస్థులను అతిసార వ్యాధి వణికిస్తోంది. వారం రోజులుగా 30 మందికి పైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. గురువారం రాత్రి నుంచి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నా పరిస్థితి అదుపులోకి రాలేదు. పలువురిని నందికొట్కూరు ప్రభుత్వ వైద్యశాలతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో గ్రామానికి చెందిన నాగన్న శనివారం మృతి చెందారు.   తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను 108 వాహనంలో నందికొట్కూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందినట్లు వైద్య సిబ్బంది తెలిపారు.దీంతో గ్రామస్థులు ప్రాణభయంతో వణుకుతున్నారు.

చాబోలు గ్రామంలోని ట్యాంకు నీటిపై తేలాడుతున్న కొంగ కళేబరం

తాగునీటి కలుషితం వల్లే..

కలుషిత నీటిని తాగడం వల్లే గ్రామంలో అతిసారం ప్రబలినట్లు గ్రామస్థులు, ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారు. గ్రామంలోని మినీ ట్యాంకులను నెలల తరబడి శుభ్రం చేయడం లేదని చెబుతున్నారు. వాటికి పైన మూతలు కూడా లేకపోవడంతో చెత్త, వ్యర్థాలు పడి కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ఓ ట్యాంకులో కొంగ చనిపోయి కుళ్లిపోయినా అలాగే నీళ్లు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఓసారి వీటిని తప్పనిసరిగా శుభ్రం చేయాల్సి ఉన్నా చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిని క్లోరినేషన్‌ చేయకుండానే నేరుగా ట్యాంకులను నింపి కుళాయిలకు సరఫరా చేస్తున్నారని చెబుతున్నారు. చాలా గ్రామాల్లో పైపులైన్లు దెబ్బతిన్నా మరమ్మతులు చేయించడం లేదు. ట్యాంకుల పరిసరాలు తీవ్ర అపరిశుభ్రంగా ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని