logo

ఖనిజాలు కక్కించాలి

వైకాపా పాలనలో మైనింగ్‌ చట్టం ‘అధికారానికి’ చుట్టమైంది. నిబంధనలకు విరుద్ధంగా ‘లోతు’గా తోడేశారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా గుట్టుగా తరలించారు.

Updated : 23 Jun 2024 05:10 IST

ఐదేళ్లు రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా
వైకాపా పెద్దల అండతో తరలిన ఖనిజం

బావిపల్లె వద్ద గనిలో యంత్రాల ద్వారా ఖనిజాన్ని లోడింగ్‌ చేస్తూ..

డోన్, నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో మైనింగ్‌ చట్టం ‘అధికారానికి’ చుట్టమైంది. నిబంధనలకు విరుద్ధంగా ‘లోతు’గా తోడేశారు. ఎలాంటి పన్నులు చెల్లించకుండా గుట్టుగా తరలించారు.. లీజు గడువులు ముగిసినా పట్టపగలే తోడేశారు.. ఐదేళ్ల కాలంలో వైకాపా ముఖ్యనేతల కనుసన్నల్లోనే మైనింగ్‌ దోపిడీ విచ్చలవిడిగా కొనసాగింది. ఎవరైనా ప్రశ్నిస్తే మైనింగ్‌ మాఫియా దాడులకు దిగింది.. వాటిపై విచారణ చేసి ‘‘ఘనులు తీసిన గోతుల’’ లెక్కలు తీయాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే మైనింగ్, విజిలెన్స్‌ విభాగం అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

లోతుగా తోడి.. గుట్టుగా తరలించి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోలమైట్, లైమ్‌స్టోన్, వైట్‌షేల్, స్ట్రీటైట్, వైట్‌క్లే, తెల్ల సుద్ద, మొజాయిక్‌చిప్స్, ఇనుపఖనిజం, బలపంరాయి, నాపరాయి, క్వార్ట్జ్‌వంటి ఖనిజ నిల్వలు ఉన్నాయి. ‘బీ’ కేటగిరీ గనుల్లో రోజుకు 50-100 టన్నులు తవ్వకాలు చేపట్టవచ్చు. ఏ కేటగిరీలో ఖనిజాన్ని బట్టి 300-500 టన్నుల వరకు తవ్వకాలు చేపట్టే విధంగా అధికారులు అనుమతులు ఇస్తారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి రెట్టింపు స్థాయిల్లో తవ్వేస్తున్నారు. గనుల్లో తవ్వకాలు చేపట్టేటప్పుడు అక్కడున్న ఖనిజ పరిస్థితిని బట్టి 3 మీటర్ల నుంచి 9 మీటర్ల వరకు బెంచ్‌ కటింగ్‌ చేపట్టాలి. ఉమ్మడి జిల్లాలో ఈ విధానం ఎక్కడా అమలు లేదు. 60 నుంచి 100 అడుగుల లోతులో తవ్వేశారు. బెంచ్‌ కటింగ్‌ పద్ధతిని విస్మరించి తవ్వకాలు చేపట్టారు.

పొరుగు రాష్ట్రాలకు సున్నపురాయి

కొలిమిగుండ్ల, బనగానపల్లి, గడివేముల, ఓర్వకలు మండలాల్లో పెద్ద ఎత్తున సున్నపురాయి గనులు ఉన్నాయి. ప్రత్యేకించి నాలుగు సిమెంటు పరిశ్రమలకు 30 గనులను కేటాయించారు. ఇవి కాకుండా కొన్ని గనులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయి. స్థానిక పరిశ్రమలకు అనుమతి తీసుకుని వివిధ ప్రాంతాలకు సున్నపురాయిని అక్రమంగా తరలించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు గుట్టుచప్పుడు కాకుండా అక్రమ రవాణా జరిగిపోయింది. అప్పటి అధికార పార్టీ అండతో ఇష్టారాజ్యంగా అక్రమ రవాణా నిర్వహించారు. గతంలో పర్మిట్లు ఇచ్చిన సమయంలో రవాణా చేసే వాహనానికి జియో ట్యాగింగ్‌ కచ్చితంగా ఉండేది. దీనివల్ల ఈసీ అనుమతులు లేని గనుల నుంచి ఎగుమతులు జరిపేందుకు అనుమతులు ఉండేవి కావు. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతో కొన్ని ప్రైవేటు వాహనాల ద్వారా అక్రమ రవాణా ఇష్టానుసారంగా జరిగిపోయింది.

గడువు ముగిసి గనులపై గురి

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, వెల్దుర్తి, నంద్యాల జిల్లాలోని బనగానపల్లి, డోన్‌ ప్రాంతాల్లో పలు గనులకు లీజుల గడువు ముగిసింది. దీంతో మైనింగ్‌ తవ్వకాలు నిలిపివేశారు. ఇటువంటి గనులపై కొందరు వైకాపా నాయకులు కన్నేశారు. బావిపల్లె ప్రాంతంలో ఇలా గతంలో లీజుగడువు ముగిసినా యథేచ్ఛగా తవ్వకాలు జరిపి డోలమైట్, ఇతర రకాల ఖనిజాన్ని పెద్దఎత్తున తరలించారు. కొచ్చెర్వు ప్రాంతంలోనూ ఓ మైనింగ్‌ వ్యాపారికి సంబంధించిన గనిలో వైకాపా నాయకులు నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారు. ఈ క్రమంలో జేసీబీ యంత్రంపై మట్టిపల్లెలు విరిగిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ప్రస్తుతం అధికారం మారినా బావిపల్లె గ్రామ సమీపంలో ఓ వైకాపా నాయకుడు ఇష్టానుసారం తవ్వకాలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో తవ్విన ఖనిజాన్ని ఇక్కడికి తీసుకొచ్చి లోడింగ్‌ చేస్తున్నారు.

ఇద్దరికి  తాఖీదులు

డోన్‌ ప్రాంతంలో అక్రమ మైనింగ్‌పై మైనింగ్, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్యాపిలి మండలంలో ఓ మైనింగ్‌ యజమానికి సంబంధించిన గనిలో పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో తేలినట్లు సమాచారం. ఈ అక్రమ తవ్వకాలు చేపట్టినందుకు సంబంధిత గనుల యజమానికి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. చిన్నమల్కాపురం ప్రాంతంలో ఓ మైనింగ్‌ యజమానికి సంబంధించిన గనిలోనూ మైనింగ్, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించి అక్రమతవ్వకాలు జరిగినట్లు గుర్తించారు. గత వైకాపా ప్రభుత్వంలో కొందరు మైనింగ్‌ వ్యాపారులు, అప్పటి అధికారపార్టీ నాయకులతో కలసి పెద్దఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడినట్లు తెలుస్తోంది.  వారికి సుమారు రూ.10 కోట్లకు పైగా జరిమానా వేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

తనిఖీలు నామమాత్రం.. రాయల్టీకి ఎగనామం

రాయల్టీలు లేకుండానే ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా డోలమైట్, వైట్‌షేల్, మొజాయిక్‌ చిప్స్, స్టీటైట్, లైమ్‌స్టోన్‌ ఖనిజాలు తరలించారు. డోలమైట్‌కు మెట్రిక్‌ టన్నుకు రూ.262, డీఎంఎఫ్‌ కింద రూ.30 రాయల్టీ చెల్లించాలి. ఒక రాయల్టీని అడ్డు పెట్టుకుని ట్రాక్టర్ల ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు తీసుకెళ్తారు. డోన్‌ పరిధిలో కోట్లవారిపల్లె వద్ద గనుల శాఖ చెక్‌పోస్టు ఉంది. ప్యాపిలి, డోన్, బేతంచెర్ల మండలాల్లోని తవ్విన ఖనిజాలు ఇక్కడి నుంచే కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నామమాత్రంగా సాగుతున్నాయి. ఖనిజాలు తీసుకెళ్లే వాహనాలు వెళ్లేటపుడు అక్కడున్న సిబ్బంది పత్రాలు నిశితంగా పరిశీలించాలి.. పత్రాల్లో పొందుపరిచిన సరకు, లారీలో ఉన్నది ఒకటేనా అన్నది గమనించాలి, కానీ అలా జరగడం లేదు. కనీసం నిఘా కెమెరాలు లేకపోవడం గమనార్హం. కోట్లవారిపల్లె సమీపంలో పెద్ద ఎత్తున పౌడర్‌ పరిశ్రమలు ఉన్నాయి. మల్కాపురం నుంచి వచ్చే డోలమైట్, ఇతర ఖనిజాలు ఈ చెక్‌పోస్టు సమీపం నుంచే పరిశ్రమలకు వెళ్తుంటాయి. రాయల్టీలు లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నా అడిగేవారు లేరు.

లీజు ఫీజు పెంచి పెత్తనం

కర్నూలు జిల్లాలో 300 గనులు ఉండగా ప్రస్తుతం 170 వరకు నడుస్తున్నాయి. నంద్యాల, బనగానపల్లి, డోన్‌ నియోజకవర్గాల్లో 500 వరకు గనులు ఉండగా 300కు పైగా నడుస్తున్నాయి. కర్నూలు జిల్లాకు  ఏడాదికి రూ.100 కోట్లు, నంద్యాలకురూ.250 కోట్ల ఆదాయం వస్తుంది. సాధారణంగా గనుల లీజు 20 ఏళ్ల పాటు ఉంటుంది. ఏటా 30 శాతం వరకు గనుల లీజుల రెన్యువల్‌ ఉంటుంది. రెండేళ్ల కిందట లీజు మొత్తాన్ని వైకాపా ప్రభుత్వం పది రెట్లు పెంచింది. దీంతో రెన్యువల్‌కు లీజుదారులు ముందుకు రాలేదు. వీటిపై కన్నేసిన కొంతమంది వైకాపా నాయకులు అక్రమ తవ్వకాలు చేపట్టి రూ.కోట్లు కొల్లగొట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని