logo

వైకాపా ప్యాలెస్‌

ఐదేళ్ల ‘కబ్జా’రాజ్యంలో స్థలాలకు రక్షణ కరవైంది... ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ కాలు మోపారు.. ప్రశ్నిస్తే దాడులకు దిగారు. కర్నూలు నగరంలోని ఐదు రోడ్ల కూడలిలో రూ.100 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకున్నారు.

Updated : 23 Jun 2024 05:08 IST

నగరంలో అనుమతి లేకుండా నిర్మాణం
రూ.వంద కోట్ల విలువైన జాగాలో పనులు
ఖరీదైన స్థలం కారుచౌకగా కైవసం

రాజుల కోటను తలపించేలా నిర్మాణం

ఐదేళ్ల ‘కబ్జా’రాజ్యంలో స్థలాలకు రక్షణ కరవైంది... ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే అక్కడ కాలు మోపారు.. ప్రశ్నిస్తే దాడులకు దిగారు. కర్నూలు నగరంలోని ఐదు రోడ్ల కూడలిలో రూ.100 కోట్ల విలువైన భూమిని సొంతం చేసుకున్నారు. కారుచౌకగా 33 ఏళ్లపాటు లీజుకు తీసుకున్నారు.. ఎలాంటి అనుమతుల్లేకుండా రాజుల కోటను తలపించేలా పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. విశాఖలోని రుషికొండ ప్యాలెస్‌ను తలపించేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ‘కుడా’ను అడగలేదు.. పట్టణ ప్రణాళిక అనుమతి లేదు.. నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కేశారు. ఏడాదిగా అక్రమ నిర్మాణం సాగుతోంది.. అధికారులు అటువైపు వెళ్లలేదు. ఎన్నికల్లో ఓటమి పాలుకావడంతో హడావుడిగా ఈ నెల 17వ తేదీన రూ.14.25 లక్షల రుసుము చెల్లించడం గమనార్హం.

 ఈనాడు, కర్నూలు

కొనసాగుతున్న సీలింగ్‌ పనులు

1979లో ఆగ్రోస్‌కు కేటాయింపు

  • కర్నూలు నగర నడిబొడ్డున సర్వే నంబరు 95-2లో 3.40 ఎకరాల స్థలం ఉంది. రైతుల ప్రయోజనాల నిమిత్తం నిర్మాణాలు చేపట్టేందుకు 1979లో అప్పటి ప్రభుత్వం 1.60 ఎకరాలను ఏపీ ఆగ్రోస్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కేటాయించింది. మిగిలిన 1.80 ఎకరాలను టీబీపీ, ఎల్‌ఎల్‌సీ కార్యాలయానికి కేటాయించారు. ఏపీ ఆగ్రోస్‌కు కేటాయించిన స్థలం మాదంటే మాదని జలవనరుల శాఖ ఇంజినీర్లు, ఏపీ ఆగ్రోస్‌ అధికారులు ఇరువురూ పంతానికి వెళ్లారు. రెండు శాఖల మధ్య వివాదం నడుస్తుండటంతో పర్యవేక్షణ కరవైంది. ఆనాటి నుంచి ఈ స్థలం ఖాళీగా ఉంది.
  • 1.60 ఎకరాల భూమిని 33 ఏళ్లపాటు ఎస్‌.వి కన్‌స్ట్రక్షన్స్‌ (నెల్లూరు)కు లీజుకు ఇచ్చేందుకు 2010-12 మధ్య కాలంలో ఏపీ ఆగ్రోస్‌ ఎండీ శైలజా రామయ్యర్‌ నిర్ణయించారు. 5-6 అంతస్తుల మేర దుకాణ సముదాయం నిర్మించేందుకు సదరు కంపెనీ ముందుకొచ్చింది. విలువైన భూమిని లీజుకిస్తే వారు సొంతం చేసుకొనే అవకాశం ఉందని అప్పటి సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి తిరస్కరించారు.

సిద్ధంగా మార్బుల్స్‌

విశాలమైన గదులు.. విలువైన ఫర్నిచర్‌

వైకాపా కార్యాలయానికి సంబంధించి చాలా వరకు పనులు పూర్తి చేశారు. మొత్తం 12,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో భూతల అంతస్తు నిర్మించారు. మొదటి అంతస్తులో 4,560 చదరపు అడుగుల విస్తీర్ణంలో గదులు, సమావేశ మందిరాలు ఏర్పాటుచేస్తున్నారు. వైజాగ్‌లో రుషికొండ ప్యాలెస్‌ను తలపిస్తోంది. జిల్లా అధ్యక్షునికి ప్రత్యేక గదితోపాటు అనుబంధ విభాగాల అధ్యక్షులకు విడివిడిగా గదులు ఉండేలా నిర్మిస్తున్నారు. రెండు సమావేశపు గదులు, వీఐపీలకు ప్రత్యేక రూమ్, పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు, మీడియా సమన్వయకర్తకు, క్యాంటీన్, స్టోర్‌రూం, కార్యాలయ కార్యదర్శులకు రెండు గదులు ప్రత్యేకంగా ఆడిటోరియం, పెద్దగా సీట్‌అవుట్‌ సౌకర్యం ఉండేలా నిర్మాణాలు చేస్తున్నారు. ఫ్లోరింగ్, పుట్టీలు, ఇంటీరియర్‌ పనులు చేస్తున్నారు. రూ.లక్షలు విలువ చేసే ఫర్నిచర్‌నూ తెప్పించారు. భవన నిర్మాణానికి సుమారు రూ.5 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. భవన నిర్మాణం పూర్తైన తర్వాత కార్యాలయ ప్రాంగణంలోనే పార్కింగ్, చిన్నపాటి ఉద్యానవనం, అంతర్గత రహదారులు, ఫౌంటెన్‌ ఏర్పాటుచేయనున్నారు. ఎన్నికల్లో పార్టీ ఓటమి చవిచూడటంతో ఈనెల 17న రూ.14.25 లక్షల రుసుము చెల్లించడం గమనార్హం. తమకు ఇచ్చిన లీజు గడువు ఉండగానే ఆ భూమిని వైకాపా కార్యాలయం నిర్మాణం కోసం కేటాయించారు.. అది చట్టవిరుద్ధమని ఇటీవల ఓ సంస్థ కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

భవనం లోపల నిర్మాణశైలి

రూ.100 కోట్ల భూమికి ఎసరు

ఐదు రోడ్ల కూడలిలో ప్రస్తుతం సెంటు స్థలం అరకోటి పలుకుతోంది.. ఈ లెక్కన 1.60 ఎకరాల భూమి విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. ఆక్రమణలపై ఆరితేరిన వైకాపా నేతలకు ఖాళీగా ఉన్న ఆగ్రోస్‌ సంస్థ స్థలంపై కన్నుపడింది. పార్టీ కార్యాలయం కోసం సదరు స్థలాన్ని కేటాయించాలని జగన్‌ సర్కారుకు లేఖ రాశారు. ఏడాదికి రూ.1,600 ప్రకారం లీజు చెల్లించేలా 33 ఏళ్ల పాటు వైకాపా కార్యాలయం కోసం కేటాయిస్తూ 2023 ఫిబ్రవరి 16న అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ అంశాన్ని అప్పట్లో ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకొచ్చింది. రైతుల ప్రయోజనాలకు ఉపయోగించాల్సిన రూ.కోట్ల విలువైన భూమిని కారు చౌకగా వైకాపా కార్యాలయం నిర్మాణానికి కట్టబెట్టడంపై అప్పట్లో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.

కార్యాలయానికి వచ్చిన కుర్చీలు

అన్నీ తానై నడిపిన మేయర్‌

రాంకీ సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 2023 జులైలో పనులు ప్రారంభించారు. నగర పాలక, కుడా అనుమతుల్లేకుండానే ఒక అంతస్తు ఉండేలా (జి+1) పనులు చేపడుతున్నారు. నిబంధనల ప్రకారం వేకెంట్‌ ల్యాండ్‌ ట్యాక్స్, ప్రభుత్వం నిర్దేశించిన రుసుము చెల్లించి పట్టణ ప్రణాళిక అనుమతి వచ్చిన తర్వాతే పనులు చేపట్టాలి. ప్రస్తుత మేయర్, అప్పటి జిల్లా అధ్యక్షుడు బీవీ రామయ్య అన్నీ తానై నడిపించారు. నగర పాలక సంస్థ తన గుప్పిట్లో ఉండటంతో ఎలాంటి అనుమతుల్లేకుండానే పార్టీ కార్యాలయం నిర్మాణ పనులు కొనసాగేలా చూశారు. కార్పొరేషన్‌ పరిధిలో ఎలాంటి అక్రమ నిర్మాణం జరిగినా గుర్తించి చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు ఉంటే కూల్చేయాలి. ఈ కూడలి మీదుగా నిత్యం ప్రయాణించే వివిధ స్థాయి అధికారులకు మాత్రం ఈ అక్రమ నిర్మాణాలు కనపడలేదు. అధికార పార్టీ కావడంతో వారికి కొమ్ముకాసి ఆ పార్టీ నాయకులకు తొత్తుల్లా వ్యవహరించారు. అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నట్లు పదేపదే ప్రకటనలు ఇచ్చే పట్టణ ప్రణాళిక అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు.

వెంటనే స్వాధీనం చేసుకోవాలి

కర్నూలు నగర నడిబొడ్డున ఉన్నటువంటి ఆగ్రోస్‌ ఇండస్ట్రీస్‌ ప్రాంతీయ కార్యాలయ స్థలాన్ని ప్రభుత్వ అనుమతులు లేకుండానే వైకాపా నాయకులు ఆక్రమించుకున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలంలో వైకాపా కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాన్ని తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోచేసి పార్టీ కార్యాలయాల పేరుతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నామమాత్రపు లీజుతో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వానికి పెద్దఎత్తున నష్టం కలిగించారు. నగరపాలక, కుడా అనుమతులు తీసుకోకుండానే నిర్మాణలు చేపట్టారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్యగా భావించాలి.  

 తిక్కారెడ్డి, కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు

అధికారమదంతో స్థలం లాక్కున్నారు

పార్టీ కార్యాలయం పేరుతో రూ.వంద కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని వైకాపా నాయకులు కొట్టేశారు. ప్యాలెస్‌ను తలపించేలా అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు.  అధికారంలో ఉన్నామన్న అహంకారంతో విర్రవీగారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుములు సైతం ఎగ్గొట్టేందుకు ప్రయత్నించారు. కార్యాలయ నిర్మాణానికి డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారన్న అంశంపై విచారణ జరపాలి. వేరే సంస్థకు కేటాయించిన స్థలాన్ని నిబంధనలకు విరుద్ధంగా వైకాపా కార్యాలయానికి కేటాయించడంపై విచారణ చేయించాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశా.

సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని