logo

ఆరు సెంట్లు ఆరగించారు

ఆదోని రెండో ముంబయి.. వాణిజ్య పట్టణం.. ఎస్కేడీ కాలనీ మొదటి రోడ్డు.. అక్కడ సెంటు రూ.30 లక్షలు పలుకుతోంది.. కొందామంటే స్థలం దొరకదు.. ఓ పాత భవనంపై కన్నేసి వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి సొంతం చేసుకొనే ప్రయత్నం చేశారు..

Updated : 25 Jun 2024 06:26 IST

రూ.40 లక్షలకు 99 ఏళ్ల పాటు లీజు
ఆ స్థలం విలువ రూ.1.80 కోట్లు 
ఆదోనిలో వైకాపా ‘రాజ’గృహం
మాజీ ఎమ్మెల్యే అరాచకం
ఆదోని ఎస్కేడీ కాలనీ, పురపాలకం, న్యూస్‌టుడే

దోని రెండో ముంబయి.. వాణిజ్య పట్టణం.. ఎస్కేడీ కాలనీ మొదటి రోడ్డు.. అక్కడ సెంటు రూ.30 లక్షలు పలుకుతోంది.. కొందామంటే స్థలం దొరకదు.. ఓ పాత భవనంపై కన్నేసి వైకాపా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డి సొంతం చేసుకొనే ప్రయత్నం చేశారు.. ఉద్యోగ సంఘాలను దారికి తెచ్చుకొని రూ.1.80 కోట్ల విలువైన ఆరు సెంట్ల స్థలానికి రూ.40 లక్షలు చెల్లించి 99 ఏళ్ల పాటు తన ముఖ్య అనుచరుడి పేరుతో లీజుకు రాయించుకొన్నారు. వైకాపా కార్యాలయం పేరుతో భారీ భవంతి నిర్మించారు.. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతుల్లేకుండానే రెండేళ్ల కిందటనే దీన్ని నిర్మించడం గమనార్హం. సాగినంత కాలం తనంతటి వారు లేరనుకున్నారు.. అధికారం చేతిలో ఉందికదా అని అనధికార కార్యకలాపాలెన్నో చేశారు.. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు.. వారికి కావాల్సినవి దక్కించుకున్నారు.. రూ.కోట్ల ఆస్తులు కాజేశారు. 


సాయి ప్రసాద్‌రెడ్డి ముఖ్య అనుచరుడి పేరుపై

ఆదోని పట్టణంలో ఏపీఎన్జీవో హోం పాతభవనాన్ని ఉద్యోగులు వినియోగించుకునేవారు. అది మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఇంటికి ఎదురుగానే ఉంది. అధికార బలంతో ఉద్యోగ సంఘాలను తనవైపునకు తిప్పుకొని, పాత భవనం కూల్చారు. 12 సెంట్ల స్థలంలో ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రిస్వామి పేరుతో ఆరు సెంట్ల స్థలాన్ని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. ఇందుకు గానూ రూ.40 లక్షలు చెల్లించారు. ఇంటి నెంబరు 21-114, ఎస్కేడి.కాలనీ, మొదటి రహదారిలో ఈ భవనం ఉంది. మొత్తం భవనం 383.93 చ.మీల విస్తీర్ణంలో ఉంది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 93.15 చ.మీ, మొదటి అంతస్తులో 143.89 చ.మీలు, రెండో అంతస్తులో 143,89 చ.మీలు, టెర్రస్‌ అంతస్తులో 3 చ.మీలు మేర నిర్మించి, వైకాపా కార్యాలయంగా వినియోగిస్తున్నారు. 


టీపీవోపై చర్యలకు సిఫార్సు

ఈ విషయంపై పురపాలక కమిషనర్‌ రామచంద్రారెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. 2021 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. 2021 ఆరంభంలో ప్రాథమిక రుసుం మాత్రమే రూ.10వేల రుసుము చెల్లించి వదిలేశారన్నారు. వైకాపా భవనానికి అనుమతులు ఉన్నాయని పురపాలక ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన టీపీవో శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని పైఅధికారులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు.


ఆరా తీయడంతో ..

ఆదోని పట్టణంలో 2021లో నిర్మించిన వైకాపా కార్యాలయ భవనానికి 2024 జూన్‌ 24వ తేదీ వరకు ఎలాంటి అనుమతులు లేవు. 2021లో కేవలం రూ.10వేలు ప్రాథమిక రుసుము చెల్లించి ప్లాన్‌ కోసం అంతర్జాలంలో దరఖాస్తు చేసుకున్నారు. పురపాలక సంఘం కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో ఓ ఉన్నతాధికారి స్వామిభక్తి ప్రదర్శించి.. ముందుగా వైకాపా కార్యాలయ భవనానికి అనుమతులున్నాయని ‘న్యూస్‌టుడే’ ఎదుట బుకాయించారు. దీనిపై లోతుగా ఆరా తీయడంతో.. ఎలాంటి అనుతులు లేవని తేలింది. ఈ విషయం సదరు అధికారి వైకాపా వారికి చేరవేశారు. 


అరగంటలో అనుమతి

అనుమతి అంశాన్ని పుర అధికారి ఒకరు వైకాపా నేతల చెవిలో వేశారు. వారు వెంటనే రంగంలోకి దిగారు.. ఓ ప్లానర్‌ వద్దకు వెళ్లి సదరు వైకాపా కార్యాలయ ప్లాన్‌ అనుమతి కోసం అంతర్జాలంలో దరఖాస్తు చేయించారు. అరగంటలోనే ఆదోని పురపాలక సంఘం కార్యాలయంలో రూ.1.50 లక్షల రుసుము చెల్లించి, అప్పటికప్పుడు కార్యాలయానికి అనుమతులు జారీ చేయించారు. సాధారణంగా కార్యాలయ అనుమతి కోసం కనీసం 24 గంటల సమయం పడుతుంది. పుర సిబ్బంది తలుచుకుంటే.. క్షణాల్లో అనుమతికి దారి క్లియర్‌ చేసినట్లు తెలుస్తోంది. అక్రమాలు వెలుగు చూడటంతో అనుమతిలేని కార్యాలయ భవనానికి నోటీసులు జారీ చేయడంతో పాటు సీజ్‌ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని