logo

ప్రజా ఫిర్యాదు.. పరిష్కార కసరత్తు

గత ఐదేళ్లలో ఇబ్బందులు పడిన బాధితులెందరో కలెక్టరేట్‌కు తరలొచ్చారు.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ‘‘ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

Published : 25 Jun 2024 03:21 IST

తొలిరోజు తరలొచ్చిన బాధితులు
నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే

తమ సమస్యలపై అర్జీలు రాయించుకుంటున్న ప్రజలు

‘‘ గొల్లలేరు కాల్వ నిర్మాణానికి 0.47 ఎకరాలు తీసుకున్నారు.. ఇంత వరకు పైసా పరిహారం ఇవ్వలేదు.. గత ఐదేళ్లుగారెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులను కోరినా స్పందించ లేదు.. తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. ఇప్పటికైనా స్పందించి పరిహారం మంజూరు చేయాలి..’’

అవుకుకు చెందిన గోవిందయ్య విన్నపం.


‘‘ డోన్‌ మండలం వలసల గ్రామ పరిధిలోని సర్వే నంబరు 158లో 6.30 ఎకరాలు ఉంది. అందులో 50 సెంట్లు.. వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి అనుచరులు మూడేళ్ల కిందట అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు.. న్యాయం చేయాలని తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌ను కలిసి వేడుకున్నా పట్టించుకోలేదు.. పోలీసుస్టేషన్‌కు పిలిపించి మూడు రోజుల పాటు లాకప్‌లో ఉంచి భయపెట్టారు.. కేసుల కోసం తిరిగి అప్పులయ్యాయి.. వాటిని తీర్చేందుకు జీవనాధారమైన ఆటోతో పాటు బంగారం అమ్ముకోవాల్సి వచ్చింది..అయినా వేధింపులు ఆగకపోవడంతో ఏడాదిన్నర కిందట ఉరేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడితే స్థానికులు గుర్తించి కాపాడారు.. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలి..’’

పులికొండ స్వామి ఆవేదన 


  • గత ఐదేళ్లలో ఇబ్బందులు పడిన బాధితులెందరో కలెక్టరేట్‌కు తరలొచ్చారు.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ‘‘ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జిల్లా కేంద్రం నంద్యాల సెంటినరి హాల్‌లో  సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి తొలిరోజు ప్రజల నుంచి స్పందన వచ్చింది. 

భూ సమస్యలపై ఏకరవు

భూ తగాదాలు, ఆక్రమణలపై ఫిర్యాదులు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు కోసం వినతులు అందాయి. ఏళ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాలేదని బాధితులు విన్నవించుకున్నారు. గత ప్రభుత్వంలో అధికార పార్టీ నాయకులు అండదండలతో భూ సమస్యలు పెరిగిపోయాయని.. వాటిని పరిష్కరించి న్యాయం చేయాలని పలువురు కోరారు. అన్ని అర్హతలున్నా పింఛన్లు మంజూరు చేయలేదని వృద్ధులు వాపోయారు. పంట కాలువలకు పొలాలు తీసుకుని పరిహారం ఇవ్వలేదని.. విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు దొంగ పత్రాలు సృష్టించారని రైతులు అధికారులకు ఏకరువుపెట్టారు.  అంతకుముందు ప్రతి దరఖాస్తుకు జవాబుదారీతనం ఉండేలా అధికారులు అర్జీదారుని ఫోన్‌ నంబరు, ఆధార్‌ తీసుకుని సమస్యలను ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. దీంతో తమ సమస్య పరిష్కారం అవుతుందని బాధితులు ధీమా వ్యక్తం చేశారు. సమస్యలు ఆన్‌లైన్‌లో నమోదు చేసి నాణ్యమైన పరిష్కారం చూపాలి.. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా పర్యవేక్షించే ఆస్కారం ఉన్నందున అందరూ అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్‌ డా.కె.శ్రీనివాసులు, జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని పరిష్కరించాలన్నారు. డీఆర్వో పద్మజ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని