logo

ఐదేళ్ల అన్యాయం.. అందించాలి సాయం

‘వైకాపా ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారానికిగాను కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలోనూ అర్జీలు అందజేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది.

Published : 25 Jun 2024 03:25 IST

న్యూస్‌టుడే, కర్నూలు సచివాలయం

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

‘వైకాపా ప్రభుత్వ హయాంలో సమస్యల పరిష్కారానికిగాను కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేశాం. కలెక్టరేట్‌లో నిర్వహించిన స్పందనలోనూ అర్జీలు అందజేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది. చెప్పులు అరిగిపోవడం తప్ప స్పందన కానరాలేదు. చివరికి ఆశలు వదిలేసుకున్నాం’ అని బాధితులు పేర్కొన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పేరుతో అర్జీల స్వీకరణ ప్రారంభించడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి బాధితులు సోమవారం పెద్దఎత్తున తరలివచ్చారు. తెదేపా హయాంలో సమస్యలు పరిష్కారమవుతాయన్న నమ్మకంతో అధికారులకు అర్జీలు అందజేశారు. వారు సైతం పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సమస్యలు విన్నవించారు. అవి వారి మాటల్లోనే..


దౌర్జన్యంగా ఆక్రమించారు
- సరోజమ్మ, కోడుమూరు

గూడూరు మండలం చనుగొండ్లలో సర్వే నంబర్లు 359, 349లో 3.80 ఎకరాల భూమి నాపేరున ఉంది. ఇందులో 74 సెంట్లను పరమేశ్వరరెడ్డి ఆకమ్రించుకొని ఆన్‌లైన్‌ చేయించుకుని అక్రమంగా పాసు పుస్తకాలు పొందారు. పరమేశ్వరరెడ్డి రూ.30 లక్షలు అడ్వాన్సు తీసుకొని 74 సెంట్ల భూమిని మాకు అమ్మారంటూ లింగన్న, దుబాయ్‌ శ్రీను బెదిరిస్తున్నారు. రోడ్డు పక్కన పొలం కావడంతో ఎకరా రూ.కోటిపైగా విలువ ఉంది. వారి పేరున ఉన్న భూమిని రద్దు చేసి నాపేరున నమోదు చేయాలి.


12 ఏళ్లుగా పోరాడుతున్నా
- వీరభద్ర ఆచారి, బాధితుడు

నాకు దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామంలో పూర్వీకుల నుంచి సర్వే నంబరు 953లో 18.87 ఎకరాల వడ్ల ఇనాము భూమి సంక్రమించింది. దీనిని గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు మాదిరెడ్డి కౌలు పేరుతో మొత్తం ఆక్రమించుకుని రిజిస్టర్‌ చేయించుకున్నారు. కొంత భూమిని మల్లయ్య, మహదేవ, మునిస్వామి, శారద, జయసుధ, వీరన్న తదితరులకు విక్రయించారు. 2020లో వారి పేర్లతో ఆన్‌లైన్‌ అడంగల్‌లో పేర్లు నమోదు చేశారు. నా భూమి కోసం 12 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నా. తహసీల్దారు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా కనికరం చూపడం లేదు. ఇకనైనా స్పందించి తగిన చర్యలు చేపట్టాలి.


చంపుతామని బెదిరిస్తున్నారు
- కె.సరస్వతమ్మ, బాధితురాలు

దేవనకొండ మండల కేంద్రంలో సర్వే నంబరు 466లో 2.88 ఎకరాల భూమి ఉంది. గత యాబై ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. మా పొలంలో కొందరు దౌర్జన్యంగా రహదారి ఏర్పాటు చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే చంపుతామని బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని హెచ్చరించారు. కొత్తగా రస్తా ఏర్పాటుచేసి పంట పొలానికి నష్టం వాటిల్లేలా దౌర్జన్యం చేస్తున్నారు. న్యాయం చేసి ఆదుకోవాలి.


నాలుగేళ్లుగా పట్టించుకోలేదు
- చంద్రశేఖర్‌రెడ్డి, బాధితుడు

మాది వెల్దుర్తి మండలం పుల్లగుమ్మికలుగొట్ల గ్రామం. బతుకుదెరువు కోసం కర్నూలు వలస వచ్చా. గత నాలుగేళ్లుగా కర్నూలులో నివాసం ఉంటున్నా. గ్రామంలో మా ఇంటిని హెల్పర్‌ తిమ్మయ్యకు నెలకు రూ.3 వేల చొప్పున అద్దెకు ఇచ్చా. గత కొన్నేళ్లుగా అద్దె చెల్లించడం లేదు.. ఖాళీ చేయమని అడిగితే బెదిరిస్తున్నాడు. గతంలో కలెక్టరేట్‌లో జరిగిన స్పందనలో, జిల్లా ఎస్పీకి, పోలీసుస్టేషన్‌లో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ న్యాయం చేయలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వ హయాంలో సమస్య పరిష్కారమవుతుందని ఆశిస్తున్నా. తగిన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. 


హాస్టల్‌లో సీటు ఇవ్వడం లేదు 
- తలారి నాగమ్మ

తుగ్గలి మండలం శభాష్‌పురం గ్రామంలో నివసిస్తున్నాం. నా భర్త చిన్న రంగన్న 2018లో చనిపోయారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. కూలీ పనులు చేసుకుంటూ ఇద్దరు పిల్లలను పోషిస్తున్నా. నా కుమార్తె లత (8వ తరగతి)కు వసతిగృహంలో సీటు ఇవ్వాలంటూ తుగ్గలి, మద్దికెర, ఆలూరు, ఆస్పరి కస్తూర్బా గాంధీ విద్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఖాళీలు లేవని చెబుతున్నారు. గతేడాది ఏడో తరగతిలో చేర్చిద్దామని ప్రయత్నించినా సీటు ఇవ్వలేదు. కుటుంబ పోషణ భారంగా మారింది. వెంటనే సీటు ఇప్పించేలా చూడాలి.


పెళ్లికానుక సాయం అందలేదు
- షేక్‌ నూర్‌ అహ్మద్‌

కర్నూలు నగరంలోని బేఖార్‌కట్ట ప్రాంతం నివసిస్తున్నాం. నా కుమార్తె ఖమ్రున్నీసాకు 2019లో పెళ్లి చేశా. ఐదేళ్లయినా పెళ్లి కానుక ఆర్థిక సాయం అందలేదు. గతంలో రెండు సార్లు స్పందనలో అధికారులకు విన్నవించా. మెప్మా, మున్సిపల్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌ చుట్టూ పలుమార్లు తిరిగినా పెళ్లికానుక సాయం రాలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చేయూతనివ్వాలి.


పంటలు వేస్తే దున్నేస్తున్నారు
- వెంకటేశు, లక్కసాగరం

మాది కృష్ణగిరి మండలం లక్కసాగరం గ్రామం. మా పేరుతో పూర్వీకుల నుంచి వచ్చిన 4.40 ఎకరాల భూమి ఉంది. ఏటా పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాం. గ్రామానికి చెందిన కొందరు ఆ భూమిని తమ తండ్రి విక్రయించారంటూ దౌర్జన్యం చేస్తున్నారు. ఐదారేళ్లుగా పంటలు సాగు చేస్తే దున్నేస్తున్నారు. దౌర్జన్యం చేస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదు. ఆన్‌లైన్‌ అడంగల్‌లో మా పేరును తొలగించి వారి పేర్లు నమోదు చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి.


సర్వే చేసి హద్దులు చూపాలి 
- లింగన్న, నందవరం

నందవరం మండల కేంద్రంలో సర్వే నంబరు 8861లో రెండెకరాల భూమిని 30 ఏళ్ల కిందట ప్రభుత్వం మంజూరు చేసింది.. గత కొంతకాలం సాగు చేసుకున్నాం. బతుకుదెరువు కోసం నంద్యాల వలస వెళ్లాం. మా భూమికి సర్వే చేసి హద్దులు చూపాలని తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. పెద్దల నుంచి వచ్చిన ఆస్తిని కాపాడుకునేందుకు పోరాడుతూనే ఉన్నా. ఇకనైనా అధికారులు స్పందించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని