logo

వక్ఫ్‌ ఆస్తులు పరిరక్షిస్తాం

‘ఉమ్మడి కర్నూలు జిల్లాలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఇప్పటికే ఆక్రమణలకు గురైన వాటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటాం. గత వైకాపా ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూసింది.

Updated : 25 Jun 2024 06:24 IST

మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట
ఈనాడు ముఖాముఖిలో మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ 

ఈనాడు, కర్నూలు : ‘ఉమ్మడి కర్నూలు జిల్లాలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఇప్పటికే ఆక్రమణలకు గురైన వాటిపై దృష్టి పెట్టి తగిన చర్యలు తీసుకుంటాం. గత వైకాపా ప్రభుత్వం మైనార్టీలను చిన్నచూపు చూసింది. సంక్షేమ పథకాలు అందకుండా మోసం చేసింది. కఠిన నిబంధనలు విధించింది. రుణాలు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసింది. మా ప్రభుత్వంలో మైనార్టీలందరికీ న్యాయం చేస్తాం. వారికి అండగా ఉంటాం’ అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో మాట్లాడారు.

ఆక్రమణదారులపై చర్యలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 32 వేల ఎకరాల వక్ఫ్‌ భూములున్నాయి. వాటి విలువ రూ.వేల కోట్లల్లో ఉంటుంది. అందులో కొంత భూమిని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించుకున్నారు. ఇళ్లు, వ్యాపార సముదాయాలు నిర్మించుకుని భారీగా ఆదాయం పొందుతున్నారు. అయినప్పటికీ గత ప్రభుత్వం ఆక్రమణదారులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మైనార్టీల సంక్షేమానికి ఉపయోగపడాల్సిన ఆ భూములను పరిరక్షించి వాటిపై వచ్చే ఆదాయం మైనార్టీల అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం. ఆక్రమణదారులు ఏస్థాయివారైనా వదిలిపెట్టం.

మసీదుల నిర్మాణం వేగవంతం

వైకాపా ప్రభుత్వ హయాంలో షాదీఖానాలు, మసీదుల నిర్మాణం నత్తనడకన సాగింది. ఉమ్మడి జిల్లాలో ఒకట్రెండు మినహా మిగిలిన ప్రతిపాదనలేవీ సాకారం కాలేదు. అర్థంపర్థం లేని షరతులు విధించి దుల్హన్‌ పథకం కింద ప్రభుత్వం అందించే నగదు సాయం రాకుండా ఎంతోమంది ఆడపిల్లల ఉసురుపోసుకున్నారు. ఆయా షరతులు తొలగించి అత్యధిక ముస్లిం యువతులు లబ్ధి పొందేలా చర్యలు తీసుకుంటాం.


ఉర్దూ వర్సిటీపై దృష్టి

మైనార్టీల కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. ఓర్వకల్లులో 144 ఎకరాలు కేటాయించి మొదటి దశ పనుల్లో భాగంగా బాలికల వసతిగృహం ఫౌండేషన్‌ వరకు, అకడమిక్‌ బ్లాక్‌ మొదటి అంతస్తు శ్లాబ్‌ వరకు పనులు చేయించాం. వైకాపా హయాంలో మచ్చుకు ఒక్క రూపాయి పని కూడా జరగలేదు. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కనీసం ప్రహరీ కూడా నిర్మించలేదు. విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించారు. అత్యంత విలువైన ఆ భూమిని ఇతర అవసరాల కోసం కేటాయించాలని కూడా వైకాపా నాయకులు ఆలోచన చేశారు.


రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం

ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్‌ అంశానికి తెదేపా వంద శాతం కట్టుబడి ఉంది. ఆ రిజర్వేషన్‌ అమలుకు ఎలాంటి ఢోకా లేకుండా చూస్తాం. దిల్లీ స్థాయిలో న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటుచేసి రిజర్వేషన్‌ అమలుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తాం.

  • మెగా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి వైకాపా ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడంతో చాలామంది ముస్లింలు సైతం నష్టపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 171 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో జనరల్‌ కేటగిరీలో ఒక్క పోస్టు కూడా చూపలేదు. కేవలం 17 బ్యాక్‌లాగ్‌ పోస్టులు మాత్రమే భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది. 

లా వర్సిటీ పేరుతో హడావుడి

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టు ప్రాంతంలో 150 ఎకరాల్లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని రూ.1,011 కోట్లతో నిర్మిస్తామని జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. దానికి ఒక రోడ్డు వేయడం మినహా ఏ ఒక్క పనీ చేయలేదు. ప్రజల్ని నమ్మించేందుకుగా వీలుగా ఎన్నికల ముందు హడావుడిగా శంకుస్థాపన చేశారు. 


పాఠశాలల్లో పోస్టుల భర్తీకి కృషి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉర్దూ మాధ్యమ ఇంటర్‌ కళాశాలలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ అధ్యాపకులు లేరు. అతిథి ఉపాధ్యాయులతో నెట్టుకొస్తున్నారు. దీంతోపాటు ఉమ్మడి జిల్లాలోని ఉర్దూ పాఠశాలల్లోనూ తగినంత మంది బోధకులు లేరు. అధ్యాపకుల భర్తీపై దృష్టి సారిస్తాం. ఉత్తమ విద్య అందేలా కృషి చేస్తాం.


హైకోర్టు బెంచ్‌ ఏర్పాటుచేస్తాం

కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని తెదేపా స్పష్టమైన హామీ ఇచ్చింది. న్యాయశాఖ మంత్రిగా ఆ హామీ సాకారమయ్యేలా నావంతు కృషి చేస్తా. మైనార్టీల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోనూ, మంత్రి నారా లోకేశ్‌తోనూ ఇప్పటికే మాట్లాడా. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న అంశాలపై చర్చించా. మైనార్టీలకు ఇచ్చిన ప్రతి హామీ తూచా తప్పకుండా అమలు చేస్తాం.


తెదేపా హయాంలో ఎన్నో పథకాలు

మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రిగా విశేష అనుభవం ఉంది. ఉర్దూ అకాడమీ, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్ల ఏర్పాటులో కీలకపాత్ర పోషించా. వీటితోపాటు వక్ఫ్‌ బోర్డు, హజ్‌ కమిటీలు ఏర్పాటుచేసి వాటన్నింటినీ ‘మైనార్టీ సంక్షేమ విభాగం’ పేరుతో ఒక వేదికపైకి తీసుకొచ్చాం. అవన్నీ తెదేపా హయాంలోనే ఏర్పాటయ్యాయి. ఏ లక్ష్యాలతో వాటిని ఏర్పాటుచేశామో.. ఆ లక్ష్యం నెరవేరకుండా వైకాపా ప్రభుత్వం అడ్డుపడి మైనార్టీలకు తీరని అన్యాయం చేసింది.

  • ముస్లింల సంక్షేమానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకుండా నవరత్నాల పథకాల కింద పంపిణీ చేసిన నిధులనే సంక్షేమానికి వెచ్చించినట్లు అడ్డుగోలుగా రికార్డులు రాసుకున్నారు. మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన అన్ని పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫలితంగా లక్షలాది మంది మైనార్టీలు తీవ్రంగా నష్టపోయారు. మళ్లీ ఆయా పథకాలన్నీ అమలుచేసేందుకు కసరత్తు చేస్తున్నాం.  
  • ముస్లిం యువకులు తమ కాళ్లపై తాము నిలబడి వ్యాపారాలు చేసుకునేలా ప్రోత్సహించేందుకు వీలుగా గతంలో ‘మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌’ పెద్దఎత్తున రుణాలు విడుదల చేసేది. వైకాపా హయాంలో ఒక్కరికి కూడా రుణం ఇచ్చిన దాఖలాలు లేవు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు