logo

ఉపాధి నిధులతో ఇంకుడుగుంతలు

రైతుకు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లుగా వ్యవసాయ రంగాన్ని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా వైకాపా నిర్వీర్యం చేసింది. గత ఏడాది కరవు పరిస్థితుల్లో కూడా రైతులకు భరోసా కల్పించే ప్రయత్నాలేవీ చేయలేదు.

Published : 25 Jun 2024 03:49 IST

600 నిర్మాణాలకు ప్రణాళిక
జులై 15 కల్లా పూర్తి 

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే: రైతుకు వెన్నుదన్నుగా నిలవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లుగా వ్యవసాయ రంగాన్ని, రైతుల సంక్షేమాన్ని పూర్తిగా వైకాపా నిర్వీర్యం చేసింది. గత ఏడాది కరవు పరిస్థితుల్లో కూడా రైతులకు భరోసా కల్పించే ప్రయత్నాలేవీ చేయలేదు. ఈ క్రమంలో కొత్తగా కొలువుదీరిన తెదేపా ప్రభుత్వం రైతుల సంక్షేమంపై దృష్టి సారించింది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లోని రైతుల పొలాల్లో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.

డ్వామా అధికారుల ప్రతిపాదన

ఉపాధి హామీ నిధులతో జిల్లాలోని వివిధ మండలాల్లో గుంతల నిర్మాణానికి డ్వామా అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేశారు. దీనిపై ఇటీవల అధికారులతో కలెక్టర్‌ సమీక్షించారు. ప్రత్యేకించి సాగునీటి సౌకర్యాలు అంతగా లేని ప్రాంతాల్లో వీటిని నిర్మించాలని నిర్ణయించారు. బనగానపల్లి నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల, సంజామల, అవుకు, కోవెలకుంట్ల, డోన్‌ నియోజకవర్గంలోని ప్యాపిలి, బేతంచర్ల, డోన్, పాణ్యం నియోజకవర్గంలోని పాణ్యం, గడివేముల, శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరు, నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు, నందికొట్కూరు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో ఉపాధి హామీ నిధులతో చేపట్టనున్నారు. 5×5, 10×10, 15×15, 20×20 సైజుల్లో జరగనున్న నిర్మాణాలకు రూ.50 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఖర్చవుతుంది. రైతుల ఆసక్తిని బట్టి  పొలం విస్తీర్ణానికి అనుగుణంగా ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. పట్టా భూములతో పాటు అసైన్డ్, దేవదాయ, బంజరు భూముల్లో గుంతల తవ్వకానికి అవకాశం ఉంది. 

వైకాపా హయాంలో ప్రోత్సాహం లేక...

2014-19 మధ్య జిల్లాలో ఇంకుడు గుంతల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఆ తర్వాత వైకాపా అధికారంలోకి వచ్చాక వీటి నిర్మాణాలు అంతగా సాగలేదు. రైతులను ఈ దిశగా ప్రోత్సహించేందుకు కనీస చర్యలు చేపట్టలేదు. దీంతో తక్కువ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు సాగుకు నీళ్లు లేక ఇబ్బందులు పడ్డారు. ప్రత్యేకించి మెట్ట పంటలు సాగు చేసే బనగానపల్లి, డోన్, శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల రైతులు దిగుబడులు లేక నష్టపోయారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం నిర్మాణాలకు ఉపక్రమించారు. రైతుల ఆసక్తిని బట్టి కూలీలను కేటాయించి వారి పొలాల్లో త్వరగా పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభంలోనే జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నిర్మాణాలను జులై 15 నాటికల్లా ఎక్కువ భాగం పూర్తి చేసేలా అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని