logo

లభించని బాలిక ఆచూకీ

పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామంలో ఆదివారం అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు.

Updated : 11 Jul 2024 05:39 IST

నందికొట్కూరు, పగిడ్యాల, న్యూస్‌టుడే : పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎల్లాల గ్రామంలో ఆదివారం అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం కాలేదు. బుధవారం చీకటిపడే వరకు గాలింపు చర్యలు కొనసాగించినా ఫలితం లేకపోయింది. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకుని విచారించారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అనంతరం హత్యచేసి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం అప్రోచ్‌ కాలువలో పడేసినట్లు నిందితులు మంగళవారం నేరం ఒప్పుకొన్నట్లు పోలీసులు తెలిపారు. అదేరోజు సాయంత్రం వారిని ఘటనా స్థలానికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌కు కొంతదూరంలో కాలువలో బాలిక మృతదేహాన్ని పడేసిన ప్రాంతాన్ని చూపించారని చెప్పారు. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక మత్స్యకారులు వలలతో గాలించారు. మరోవైపు గజఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టారు. ఎంతకీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో పోలీసులు నిందితులను గట్టిగా ప్రశ్నించడంతో పంపుహౌస్‌ సమీపంలోనే పడేసినట్లు చెప్పడంతో ఆ ప్రాంతంలో గాలిస్తున్నారు. నలుగురు బాలురు కలిసి బాలికను తీసుకెళ్లినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. పోలీసులు ముగ్గురిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. మరో బాలుడు లైంగిక దాడికి పాల్పడలేదని మిగతా ముగ్గురు నిందితులు పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం.

ఎంపీ, ఎమ్మెల్యే పరామర్శ

నంద్యాల ఎంపీ డాక్టర్‌ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య వేర్వేరుగా ఘటనా స్థలానికి చేరుకుని బాధిత తల్లిదండ్రులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పోలీసుల వ్యవస్థ సరిగా లేకనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడితప్పిందని మండిపడ్డారు. రూ.వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాజెక్టు వద్ద భద్రతకు సంబంధించిన సీసీ కెమెరాలు లేకపోవడం శోచనీయమని ఎమ్మెల్యే జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నేరం ఒప్పుకొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీసుల అదుపులో ఉన్న వారిని విచారిస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


పోలీసులు వైకాపా ముసుగులు తీసేయాలి

-ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరిక

నందికొట్కూరు, న్యూస్‌టుడే : పోలీసులు వైకాపా ముసుగులు తీసివేసి ప్రజలకు సేవ చేయడం నేర్చుకోవాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి హెచ్చరించారు. తెదేపా పాలనలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే సెలవుల్లో వెళ్లిపోవచ్చని పేర్కొన్నారు. పగిడ్యాల మండలం ముచ్చుమర్రి పోలీసు స్టేషన్‌ పరిధిలో అదృశ్యమైన బాలిక కోసం హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌ సమీపంలో బుధవారం పోలీసులు గాలింపు చేపట్టారు. ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాలిక తల్లి, సోదరిని ఎంపీ ఓదార్చారు. ఈసందర్భంగా వారు విలపించడంతో ఎంపీ కంటతడిపెట్టారు. మధ్యాహ్నం భోజనాలు తెప్పించి బాధిత కుటుంబ సభ్యులు, బంధువులకు అందజేశారు. బాలిక సోదరుడు విలపిస్తూ అన్నం తినకపోవడంతో ఎంపీ దగ్గరుండి తినిపించారు. తల్లిదండ్రులు భోజనం చేసే వరకు అక్కడే ఉన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను స్పందించి పాప ఆచూకీ గుర్తించాలని బహిరంగ సభలో చెప్పడంతో పోలీసులు విచారణ చేపట్టారన్నారు. లేదంటే మామూలుగా కేసు నమోదు చేసి వదిలేసేవారని విమర్శించారు. వివిధ సమస్యలతో ప్రజలు పోలీసు స్టేషన్‌కు వస్తే వెంటనే స్పందించాలని సూచించారు.

ఈసందర్భంగా బాలిక తల్లిదండ్రులు మాట్లాడుతూ.. మా కుమార్తెకు జరిగిన అన్యాయం మరొక్కరికి జరగకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని కోరారు. నేరం ఒప్పుకొన్న నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. పిల్లలు అడుకునే పార్కు వద్ద సీసీ కెమెరాలు లేకపోవడంతో ఈ దారుణం జరిగిందన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు