logo

వెళ్లేలోపు వెనకేసుకొంటున్నారు

ఐదేళ్లు వైకాపాతో అంటకాగారు.. అప్పటి ప్రజాప్రతినిధుల అరాచకాలకు రక్షణగా నిలిచారు.. ప్రజా కంటక పాలన కొనసాగించిన వైకాపాకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు.

Updated : 11 Jul 2024 05:54 IST

వసూళ్లు పెంచిన కొందరు అధికారులు
వైకాపాతో అంటకాగిన అధికారుల తీరిది

ఈనాడు, కర్నూలు: ఐదేళ్లు వైకాపాతో అంటకాగారు.. అప్పటి ప్రజాప్రతినిధుల అరాచకాలకు రక్షణగా నిలిచారు.. ప్రజా కంటక పాలన కొనసాగించిన వైకాపాకు ప్రజలు ఓటుతో గుణపాఠం చెప్పారు.. కొలువుదీరిన కొత్త ప్రభుత్వం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది.. ప్రజాసంక్షేమం కోసం పాటుపడే అధికారులకు పోస్టులు ఇవ్వాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో బదిలీలకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది.. ఆలోపు అందినకాడికి దండుకోవాలని వైకాపాతో అంటకాగిన అధికారులు పన్నాగం పన్నారు. నంద్యాల జిల్లాలో పోలీస్‌ శాఖలో ఈ పరిస్థితి ఎక్కువ. పేకాట శిబిరాలు, మద్యం అక్రమ రవాణా, బియ్యం దందా, మట్కా నిర్వాహకుల వద్ద పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉన్నతాధికారి ఒకరు ప్రతి ఠాణాకు రోజువారి ‘లక్ష’్యం విధించడం గమనార్హం.

ఆగని ప్రయత్నాలు

  • సామాజిక మాధ్యమాల్లో వైకాపాకు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అనుకూలంగా నిత్యం పోస్టులు పెట్టే ఓ కీలక అధికారి సర్వజన ఆసుపత్రిలో తన పదవిని కాపాడుకునేందుకు తన సామాజికవర్గానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కలిసి అండగా ఉండాలని కోరినట్లు తెలుస్తోంది.
  • నగర పాలక సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న ఓ అధికారి కమిషనర్‌ పోస్టులోకి రావడానికి వీలుగా తన వంతు ప్రయత్నిస్తున్నారు. ఐఏఎస్‌లు కాకుండా గ్రూప్‌-1 స్థాయి అధికారులను ఆ పోస్టులో నియమించాలనుకుంటే తనను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నారు.
  • ఓ పోలీసు ఉన్నతాధికారి కర్నూలులోనే మరికొంతకాలం కొనసాగడానికి వీలుగా పావులు కదుపుతున్నారు. ఆయన ప్రయత్నం ఎంత వరకు సఫలమవుతుందోననే అంశంపై చర్చసాగుతోంది.
  • రాయలసీమ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ కీలక అధికారి ఇన్‌ఛార్జి వీసీగా తాత్కాలిక నియామకం పొందడానికి చేయని ప్రయత్నమంటూ లేదు. వైకాపా నాయకుల అండదండలతో కీలక పదవిని పొందిన ఆయన తెదేపా అధికారంలోకి రాగానే తనకు తెలిసిన తెదేపా నాయకులందరి చుట్టూ తిరుగుతున్నారు. రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు నిలయంగా మారిన నేపథ్యంలో ఇన్‌ఛార్జి వీసీ బాధ్యతను ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికే ఇస్తారని తెలుస్తోంది.
  • వైకాపా హయాంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖలో ఓ కీలక అధికారిణిని బదిలీచేయించి మరీ పోస్టింగు పొందిన ఓ అధికారి ప్రస్తుత తెదేపా హయాంలోనే అదే పోస్టులో కొనసాగడానికి ప్రయత్నిస్తుండటం గమనార్హం. కర్నూలు, నంద్యాల రెండు జిల్లాలకు ఒకే అధికారి కావడంతో ఆ పోస్టు కీలకంగా మారింది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని