logo

Kurnool: అమ్మ కష్టమే కలెక్టర్‌ను చేసింది.. అంచెలంచెలుగా ఎదిగిన నందికొట్కూరు వాసి

తండ్రి చిన్నతనంలోనే దూరమయ్యారు. తల్లి ఆలనాపాలనలో పెరిగి పెద్దయ్యారు. ఆమె పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. బాగా  చదివి ఉన్నతస్థాయికి ఎదిగి అమ్మను సంతోషపెట్టాలని లక్ష్యం పెట్టుకున్నారు.

Updated : 24 Jun 2024 07:46 IST

కర్నూలు జిల్లా పాలనాధికారిగా రంజిత్‌బాషా

కుటుంబ సభ్యులతో కలెక్టర్‌ రంజిత్‌బాషా

తండ్రి చిన్నతనంలోనే దూరమయ్యారు. తల్లి ఆలనాపాలనలో పెరిగి పెద్దయ్యారు. ఆమె పడుతున్న కష్టాన్ని కళ్లారా చూశారు. బాగా  చదివి ఉన్నతస్థాయికి ఎదిగి అమ్మను సంతోషపెట్టాలని లక్ష్యం పెట్టుకున్నారు. దానిని సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించారు. అనుకున్నది సాధించి ఐఏఎస్‌ అయ్యారు. కలెక్టర్‌గా పదోన్నతి పొంది అమ్మ కళ్లలో ఆనందం నింపారు. ఆయనే నందికొట్కూరు పట్టణానికి చెందిన.. కర్నూలు కలెక్టర్‌గా నియమితులైన రంజిత్‌బాషా.

న్యూస్‌టుడే, నందికొట్కూరు

చదువంతా ప్రభుత్వ విద్యాలయాల్లోనే..

నందికొట్కూరు పట్టణానికి చెందిన హలీమాబీ, గోకారి సాహెబ్‌ దంపతులకు 1975, ఆగస్టు 31న రంజిత్‌బాషా జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. ఈ నేపథ్యంలో హలీమాబీ తన రెక్కల కష్టంతో కుమారుడిని చదివించారు. నందికొట్కూరులోని సంతపేట పాఠశాలలో ఒకటి నుంచి 7వ తరగతి వరకు రంజిత్‌బాషా చదివారు. 8 నుంచి పదో తరగతి వరకు ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని ఏపీ గురుకుల పాఠశాలలో, ఇంటర్, డిగ్రీ.. నందికొట్కూరు ప్రభుత్వ కళాశాలల్లో పూర్తి చేశారు. డిగ్రీ అనంతరం 1999లో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ మ్యాథ్స్, 2006లో సిక్కిం మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ పూర్తి చేశారు. ఆయనకు 2005లో భానుతో వివాహమైంది. ఆమె ఎంఏ బీఈడీ చేశారు. వీరికి లతిష, హనీషా కుమార్తెలున్నారు. లతిష బీటెక్, హనీషా ఇంటర్‌ చదువుతున్నారు. 

నారా లోకేశ్‌ ఓఎస్డీగా..

  • ఉన్నత చదువు పూర్తవ్వగానే మొదట తపాలా శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉన్నత శిఖరాలకు చేరాలన్న లక్ష్యంతో గ్రూప్‌-1 పరీక్షకు సన్నద్ధమయ్యారు. 2003లో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. శిక్షణ అనంతరం కడప, గుడివాడ ఆర్డీవోగా పనిచేశారు. ఆ తర్వాత భూ పరిపాలన కమిషనరేట్‌లో సీఎంఆర్‌వోగా పనిచేశారు. అక్కడ కొంతకాలం పనిచేసిన రంజిత్‌బాషా నెల్లూరు జిల్లా జేసీ-2గా బాధ్యతలు నిర్వహించారు.
  • 2018లో పంచాయతీరాజ్‌ శాఖË మంత్రి నారా లోకేశ్‌ వద్ద ఓఎస్డీగా విధులు నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆయనకు కలెక్టర్‌గా పదోన్నతి కల్పించింది. 2018-19లో పీఆర్‌ అండ్‌ ఆర్డీ డైరెక్టర్‌గా, 2019-21 వరకు ట్రైబల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా, 2022లో విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా పనిచేశారు. 2022-23 వరకు కృష్ణా జిల్లా కలెక్టర్‌గా, అనంతరం బాపట్ల కలెక్టర్‌గా పనిచేస్తూ ప్రస్తుతం కర్నూలు జిల్లాకు బదిలీపై వస్తున్నారు. 

సాఫ్ట్‌వేర్ల రూపకల్పనతో గుర్తింపు

  • ఎమ్మెస్సీ కంప్యూటర్స్‌ పూర్తిచేసిన రంజిత్‌బాషాకు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుంది. పారదర్శక పాలన, మెరుగైన సేవలు అందించేందుకు పలు శాఖల కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్లు రూపొందించారు. తపాలా శాఖకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపొందించి రాష్ట్ర పోస్టుమాస్టర్‌ జనరల్‌ నుంచి అవార్డు అందుకున్నారు.
  • ఈ-పంట పోర్టల్‌ను రూపొందించి వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమగ్ర వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరిచేందుకు మార్గం సులభతరం చేశారు. ఈ-పంట పోర్టల్‌ ద్వారా ప్రస్తుతం భూ సర్వే నంబరు, విస్తీర్ణం, పంట సాగు వివరాలతో పాటు ఉపగ్రహ చిత్రాలను జోడించే విధానం అమలవుతోంది. మీసేవ కేంద్రాలకు సంబంధించి 64 రకాల రెవెన్యూ సేవలతో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకున్నారు.
  • ఒకప్పటి సొంత జిల్లా అయిన కర్నూలు అభివృద్ధికి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న లక్ష్యంతో వస్తున్నట్లు నూతన కలెక్టర్‌ రంజిత్‌బాషా పేర్కొన్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని