logo

రుణ పరిమితి పెంపు.. సాగుకు ఊపు

ఏటా రైతులకు పంట రుణాలు బ్యాంకర్లు ఇచ్చే క్రమంలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను టెస్కాబ్‌ (తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు) ఖరారు చేస్తుంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 123 పంటలకు స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది.

Published : 24 Mar 2023 05:38 IST

అత్యధికంగా మిరపకు ఎకరాకు రూ.80 వేలు

కళ్లాల్లో మిర్చి రాశులు

ధరూర్‌, న్యూస్‌టుడే: ఏటా రైతులకు పంట రుణాలు బ్యాంకర్లు ఇచ్చే క్రమంలో స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ను టెస్కాబ్‌ (తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు) ఖరారు చేస్తుంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి 123 పంటలకు స్కేల్‌ఆఫ్‌ ఫైనాన్స్‌ను ఖరారు చేసింది. గత సీజన్‌ కంటే రూ.5-6 వేలు పెంచుతూ ఖరారు చేసిన రుణపరిమితి అమలుకు బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)కి నివేదిక పంపించింది. దాని ఆధారంగా వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లో వ్యవసాయ పంట రుణాలను బ్యాంకర్లు అమలు చేయాల్సి ఉంటుంది. ఏటా రుణపరిమితి పెంపు కనిపిస్తున్నా.. అమలులో మాత్రం రైతుకు ఆశించినంత మద్దతు లభించటం లేదు. బ్యాంకర్లు జిల్లా కలెక్టర్ల సమావేశంలో జరిగిన ఒప్పందాలను సైతం విస్మరించి రైతులకు ఇచ్చే రుణాల్లో కోత పెడుతున్నాయి. తామిచ్చిన లక్ష్యాన్ని తామే తుంగలో తొక్కుతున్న పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. ఈ సారైనా టెస్కాబ్‌ సూచనలు పూర్తి స్థాయిలో అమలు చేస్తారా? లేదా? అన్నది బ్యాంకర్ల దయపై ఆధారపడి ఉందని రైతులు చెబుతున్నారు. గత నాలుగేళ్లు జిల్లాలో ప్రాజెక్టుల పరిధిలో సాగు పెరగటం, కూలీల కొరత, పెరిగిన పెట్టుబడుల కారణంగా రైతులకు ఇబ్బందులు తప్పటం లేదు. ఇచ్చే రుణాలు సకాలంలో ఇవ్వాలని, పెంచిన పరిమితికి అనుగుణంగా ఇస్తే ఊరట కలుగుతుందని అన్నదాతలు చెబుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో 5.49 లక్షల మంది

ఉమ్మడి జిల్లాలో వివిధ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకుంటున్న రైతులు 5.49 లక్షల మంది వరకు ఉన్నారు. దాదాపుగా రూ.2,736 కోట్లు వరకు తీసుకున్నారు. వాటిని రెన్యూవల్‌ చేసే సందర్భంగా రైతులకు టెస్కాబ్‌ సూచన మేరకు స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ నిబంధనలకు అనుగుణంగా పెంచిన రుణపరిమితిని బ్యాంకులు వర్తింప చేయాలి. రుణపరిమితి పెంపు టెస్కాబ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా బ్యాంకర్ల సమితి సమావేశమై నిర్ణయం తీసుకున్న తర్వాత అమల్లోకి వస్తుందని జోగులాంబ జిల్లా లీడ్‌బ్యాంకు మేనేజర్‌ అయ్యపురెడ్డి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని