logo

జిల్లా అంతటికీ శాశ్వత తాగునీటి పథకం!

జిల్లా అంతటా ఒకే పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈమేరకు అంచనాలు రూపొందించారు.

Published : 21 Sep 2023 03:41 IST

గోపాల్‌పేటలో నిర్మించిన పంపింగ్‌ గది, ఓవర్‌హెడ్‌ వాటర్‌ట్యాంకు

వనపర్తి వ్యవసాయం, న్యూస్‌టుడే : జిల్లా అంతటా ఒకే పథకం ద్వారా తాగునీరు సరఫరా చేయాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు. ఈమేరకు అంచనాలు రూపొందించారు. వేసవిలో ప్రజలు మంచినీటి సమస్య ఎదుర్కొనకుండా ఇప్పటికే రూ.300 కోట్లతో శాశ్వత మంచినీటి పథకం పనులు ప్రారంభించారు. శ్రీశైలం తిరుగుజలాల ద్వారా మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా నిర్మాణం చేపట్టారు. గోపాల్‌పేటలో 10 ఎంఎల్‌డీ సామర్థ్యం గల నీటిశుద్ధి ప్లాంటు, పెద్దమందడి మండలం బుగ్గపల్లితండాలో 75 ఎంఎల్‌డీ నీటిశుద్ధి ప్లాంటు నిర్మించారు. వాటికి అనుబంధంగా ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకులు, క్లోరినేషన్‌ ప్లాంట్లు, పంపింగ్‌ గదులు నిర్మించారు. ఈ పథకాన్ని ఆత్మకూరు, అమరచింత, పాన్‌గల్‌, వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు విస్తరించాలని నిర్ణయించారు. ఈ అయిదు మండలాల పరిధిలోని 112 నివాస ప్రాంతాలకు తాగునీరు సరఫరా చేయాలంటే రూ.130 కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.

బుగ్గపల్లి నుంచి 256 నివాస ప్రాంతాలకు

పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి తండాలో నిర్మిస్తున్న 75 ఎంఎల్‌డీ నీటిశుద్ధి ప్లాంటు నుంచి ప్రతి రోజూ 256 నివాస ప్రాంతాలకు నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధం చేశారు. ఇప్పటికే వనపర్తి పట్టణానికి అక్కడి నుంచే సరఫరా చేస్తున్నారు. ఇక్కడ నిర్మాణాలు పూర్తి కావడంతో ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. కానాయపల్లిలోని నీటిశుద్ధి ప్లాంటు నుంచి ఇప్పటికే సరఫరా కొనసాగుతోంది. గోపాల్‌పేటలోని ప్లాంటు నుంచి 52 నివాస ప్రాంతాలకు సరఫరాకు ట్రయల్‌రన్‌ నిర్వహిస్తున్నారు. రేవల్లి, గోపాల్‌పేట మండలాలతో పాటు వనపర్తి మండలంలోని కొన్ని గ్రామాలకు గోపాల్‌పేట నుంచి సరఫరా అవుతోంది.

శ్రీశైలం తిరుగుజలాల వినియోగం

మిషన్‌ భగీరథ పథకం ద్వారా హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, జడ్చర్ల, అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి ప్రాంతాలకు మంచినీటి సరఫరాకు శ్రీశైలం తిరుగుజలాలను వినియోగిస్తున్నారు. రేగుమాన్‌గడ్డ నుంచి రా వాటర్‌ను రేవల్లి మండలం నాగపూరు వద్ద నిర్మించిన నీటిశుద్ధి ప్లాంటుకు తరలిస్తున్నారు. అక్కడ శుద్ధి చేసిన నీటిని అచ్చంపేట, నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లకు రా వాటర్‌నే పంపుతున్నారు. నాగపూరు నుంచి గోపాల్‌పేట, బుగ్గపల్లితండా, కానాయపల్లిలకు రా వాటర్‌ సరఫరా చేస్తున్నారు. అక్కడ శుద్ధిచేసి నివాస ప్రాంతాలకు అందజేస్తున్నారు.

నియోజకవర్గం నుంచి జిల్లా మొత్తానికి..

రూ.300 కోట్లతో వనపర్తి నియోజకవర్గంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీటి సరఫరాకు పథకం రూపకల్పన చేశారు. జిల్లా మొత్తానికి ఈపథకం ద్వారా సరఫరా చేయాలన్న మంత్రి నిరంజన్‌రెడ్డి సూచన మేరకు అధికారులు అన్ని మండలాలకు పథకాన్ని విస్తరించే పనుల్లో ఉన్నారు. నియోజకవర్గంలోని రేవల్లి, గోపాల్‌పేట, వనపర్తి, పెద్దమందడి, పెబ్బేరు, శ్రీరంగాపురం, ఖిల్లాగణపురం మండలాలకు మంచినీటిని సరఫరా చేయడానికి పథకం సిద్ధమైంది. దేవరకద్ర నియోజకవర్గంలోని కొత్తకోట, మదనాపురం మండలాలను ఇందులోకి తీసుకున్నారు. మక్తల్‌ నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత, కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని పాన్‌గల్‌, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు రూ.300 కోట్ల ప్రత్యేక పథకం ద్వారా సరఫరాకు నిర్ణయించారు.


ప్రతిపాదనలు పంపించాం
- జగన్‌ మోహన్‌, ఎస్‌ఈ, మిషన్‌భగీరథ

జిల్లాలో రూ.300 కోట్లతో చేపట్టిన శ్రీశైలం తిరుగుజలాలతో తాగునీటి సరఫరా పథకం పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. ఈపథకం ద్వారా 308 ఆవాస ప్రాంతాలకు నీటి సరఫరాకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. జిల్లా పరిధిలోని మక్తల్‌, కొల్లాపూర్‌ నియోజకవర్గంలోని 112 ఆవాస ప్రాంతాలకు ఈ పథకం ద్వారా నీటి సరఫరాకు రూ.130 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదనలు పంపించాం. మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని