logo

ఆశయం ఘనం.. కుదించిన లక్ష్యం

ఈ ఏడాది హరితహారం లక్ష్యాన్ని అధికారులు కుదించారు. గతేడాది జూన్‌ 12న నూతన కలెక్టరేట్‌ భవనాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దీంతో జిల్లా కార్యాలయాలకు ఈ భవనంలో గదులు కేటాయించారు.

Published : 13 Jun 2024 03:16 IST

ఈ ఏడాది సగానికిపైగా తగ్గిన మొక్కలు

నర్సరీలో సిద్ధంగా మొక్కలు

గద్వాల కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈ ఏడాది హరితహారం లక్ష్యాన్ని అధికారులు కుదించారు. గతేడాది జూన్‌ 12న నూతన కలెక్టరేట్‌ భవనాన్ని అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. దీంతో జిల్లా కార్యాలయాలకు ఈ భవనంలో గదులు కేటాయించారు. ఆర్డీవో, పశు సంవర్థక శాఖ, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగాలతో పాటు మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు సొంతంగా భవనాలు ఉండటంతో ఆయా విభాగాలు అక్కడి నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన 36 ప్రభుత్వ శాఖలు ఐడీవోసీలో ఆయా శాఖలకు కేటాయించిన కార్యాలయాల నుంచి అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ఈ ఏడాది జిల్లాలో హరిత లక్ష్యాన్ని కుదించారు. మొక్కలు నాటేందుకు అప్పట్లో కార్యాలయాల వద్ద స్థలాలు అందుబాటులో ఉండటంతో భారీ సంఖ్యలో మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులను భాగస్వాములు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ఐడీవోసీలో ఉండటంతో ఆ మేరకు హరిత లక్ష్యంలో కోత విధించారు. గత ఏడాది అన్ని ప్రభుత్వా విభాగాలకు కలిపి 14.35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం విధించారు. కాగా లక్ష్యానికి మించి 13 వేల మొక్కలు అధికంగా నాటారు. ఈ ఏడాది కూడా గతేడాది మాదిరిగానే 14.35 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు, మొక్కలు అందుబాటులో ఉన్నా నాటేందుకు స్థలాలు లేకపోవడంతో దానిని 6.86 లక్షలకు కుదించారు.

సిద్ధంగా మొక్కలు: జూన్‌ మొదటి వారంలో వర్షాలు పడితే నాటేందుకు వీలుగా జిల్లాలోని నర్సరీలలో మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు నాటేందుకు కొన్ని మొక్కలు ఉండగా, వివిధ స్థాయిలలో ఉన్నవి జులై, ఆగస్టు నెలల్లో నాటేందుకు అందుబాటులోకి వచ్చే విధంగా ప్రణాళిక ప్రకారం నర్సరీలలో పెంచుతున్నారు. ఏటా ఆగస్టు నెలలో హరిత హారం కార్యక్రమం ప్రారంభించే సంప్రదాయం కొనసాగుతోంది. 2015లో మొదలైన ఈ కార్యక్రమం ఏటా సాగుతోంది. అయితే గడిచిన కొనేళ్ళుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రోడ్ల పక్కన నాటిన మొక్కల సంరక్షణ లేకపోవడంతో ఎండిపోతున్నాయి. దీంతో మరుసటి ఏడాది అదే చోట మొక్కలను నాటాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆయా ప్రభుత్వ విభాగాల వారీగా మొక్కలు నాటేందుకు లక్ష్యం విధిస్తున్నప్పటికి సంరËక్షించే విషయాన్ని విస్మరిస్తున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది హరిత లక్ష్యం తగ్గించి, నాటిన మొక్కలు సంరక్షించడానికి ప్రధాన్యం ఇవ్వాలని పర్యావరణ వేత్తలు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఆ దిశగా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. 

కోటికిపైగా: 2019 సంవత్సరం నుంచి 24 వరకు మొత్తం నాలుగేళ్లలో కోటికిపైగా మొక్కలు నాటాలని లక్ష్యం విధించగా 88.44 లక్షల మొక్కలు నాటారు. వీటిలో అత్యధిక శాతం సంరక్షించామని అధికారులు లెక్కలు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ మేరకు పచ్చదనం కన్పించడంలేదు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని