logo

పశువైద్యం.. గగనం

జిల్లాలో పశువైద్యం దైవాధీనంగా మారింది. వైద్యులే కాదు.. కనీసం పూర్తి స్థాయిలో సహాయ సిబ్బంది లేక సేవలు గగనంగా మారాయి.  జిల్లాలో 15 మండలాల్లోని పశువైద్యశాలల్లో వైద్య సిబ్బందిని గమనిస్తే ఈ శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు.

Updated : 13 Jun 2024 05:41 IST

జిల్లా వ్యాప్తంగా సిబ్బంది కొరత

దీర్ఘకాలంగా వైద్యుడు లేని అప్పరాల పశువైద్యశాల

కొత్తకోట, న్యూస్‌టుడే : జిల్లాలో పశువైద్యం దైవాధీనంగా మారింది. వైద్యులే కాదు.. కనీసం పూర్తి స్థాయిలో సహాయ సిబ్బంది లేక సేవలు గగనంగా మారాయి.  జిల్లాలో 15 మండలాల్లోని పశువైద్యశాలల్లో వైద్య సిబ్బందిని గమనిస్తే ఈ శాఖ ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో అర్థం చేసుకోవచ్చు. ఏళ్ల తరబడిగా ఖాళీలు భర్తీ చేయక పోవడంతో పాడిరైతులకు పశువుల పెంపకం, సంరక్షణ, పోషణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకుండా పోయింది. సిబ్బందిని నియమించి పశువైద్యాన్ని అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.

  • జిల్లా కేంద్రంలో డీడీ పోస్టు ఉన్నప్పటికీ ఆయన డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లో పని చేస్తున్నారు. ముగ్గురు ఏడీలకు ఇద్దరు ఉన్నారు. వీరిలో ఒకరు డీడీగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరొకరు అలంపూర్‌కు డిప్యూటేషన్‌పై వెళ్లారు.
  • 15 మండలాల్లో కనీసం సగం మంది వైద్యులు వారి సహాయకులు కూడా లేరు. సకాలంలో పశువులకు సరైన వైద్యం అందక మూగజీవాలు మృత్యువాత పడుతున్న సంఘటనలున్నాయి. కొందరు రైతులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తున్నారు. మొత్తం 19 మంది వైద్యులకు ఆరుగురు ఉన్నారు.
  • కొత్తకోట మండలం అప్పరాలలోని వైద్యశాలకు పశు వైద్యాధికారి ఉండాలి. దశాబ్దాలుగా నియమించడం లేదు. జిల్లాలో కింది స్థాయి సిబ్బందికి రెండు, మూడు గ్రామీణ పశువైద్యశాలలను కేటాయించడంతో వారిపై అదనపు భారం పడుతోంది.
  • పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టే నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భధారణ వంటి కార్యక్రమాలు గోపాలమిత్రల సాయంతో నిర్వహించాల్సి వస్తోంది.
  • జిల్లాలో తెల్లజాతి పశువులు 75 వేలు, నల్లజాతి పశువులు 72 వేలు, గొర్రెలు 10 లక్షలు, మేకలు 80 వేలు, నాటు కోళ్లు 3.50 లక్షలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి.

ప్రతిపాదనలు పంపించాం

పశువైద్యశాలల్లోని ఖాళీ పోస్టుల భర్తీకి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే సర్దుకు పోతున్నాం. జిల్లాలో అన్ని బాధ్యతలు ఒక్కడినే చేపట్టాల్సి రావడం ఇబ్బందిగా ఉన్నా కింది స్థాయి సిబ్బంది సహకారంతో వాటిని పూర్తి చేయగలుగుతున్నా.

- వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, వనపర్తి 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని